Share News

మా సర్కార్‌ను కూలగొట్టే కుట్ర

ABN , Publish Date - May 04 , 2024 | 05:27 AM

కాంగ్రెస్‌, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కార్‌ను కూలగొట్టేందుకు ఆ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆరోపించారు.

మా సర్కార్‌ను కూలగొట్టే కుట్ర

బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య లోపాయికారి ఒప్పందం..

పార్టీ, ప్రభుత్వం బలోపేతం: తుమ్మల

కాంగ్రెస్‌లోకి 20మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

బీఆర్‌ఎ్‌సకు ఒక్క ఎంపీ సీటూ రాదు: ఉత్తమ్‌

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

కాంగ్రెస్‌, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కార్‌ను కూలగొట్టేందుకు ఆ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆరోపించారు. అందుకే ఇటు పార్టీని, అటు ప్రభుత్వాన్ని బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌... కన్నెత్తి చూసేందుకూ సాహసించని విధంగా తమ వ్యూహాలు ఉంటాయని తెలిపారు. రెండు, మూడు నెలల్లోనే కాగ్రెస్‌ ఇచ్చిన రైతు రుణమాఫీ అమలు చేసి చూపిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌ వల్ల రైతుబంధు ఆగిపోయిందని, ఎన్నికల అనంతరం రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో శుక్రవారం బీఆర్‌ఎస్‌ నాయకురాలు, ఖమ్మం మేయర్‌ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్లు రమాదేవి, కొత్తపల్లి నీరజ కాంగ్రె్‌సలో చేరారు. ఈ సందర్భంగా ఖమ్మంలో విలేకరుల సమావేశంతోపాటు మహబూబాబాద్‌లో నిర్వహించిన సీపీఐ ప్రజా పిలుపు సభలో తుమ్మల మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుచుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మరింత బలం చేకూరడంతోపాటు రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యే అవకాశం ఉంటుందన్నారు. తద్వారా రాష్ట్రానికి అత్యధిక నిధులు సాధించుకునే ఆస్కారం ఉంటుందన్నారు. ఇప్పటికే జరిగిన రెండు విడతల ఎన్నికల్లో ఇండియా కూటమికే ఆధిక్యం ఉందని సర్వేలు చెబుతున్నాయన్నారు.

అందుకే ప్రధాని మోదీ... మతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. దేశానికి ప్రమాదకరంగా మారిన బీజేపీని ఓడించేందుకు వామపక్ష, అభ్యుదయ పార్టీలతో ఇండియా కూటమి ఏర్పడిందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ హయాంలో స్కీములన్నీ స్కామ్‌లుగా మారిపోయాయని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎ్‌సకు చెందిన 20మంది ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరనున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో నిర్వహించిన సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లగొండ అభ్యర్థి రఘువీర్‌రెడ్డికి మద్దతు తెలిపాలని కోరారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు ఒక్క సీటూ రాదని జోస్యం చెప్పారు. తెలంగాణలో పదేళ్ల పాటు కేసీఆర్‌ కుటుంబ సభ్యులు చక్రవర్తుల్లా ప్రవర్తించారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లోనే బీఆర్‌ఎ్‌సను ప్రజలు బొంద పెట్టారని, రానున్న రోజుల్లో దాని మనుగడ ప్రశ్నార్థకం కానుందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య పోటీ ఉంటుందన్నారు. తెలంగాణకు పదేళ్లలో ప్రధాని మోదీ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. అభివృద్ధి గురించి చెప్పకుండా ఎన్నికల సభలో మతపరమైన అంశాలే మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌, సీపీఐది సహజ బంధమని, రెండు పార్టీలు పేదల కోసమే పని చేస్తాయని పేర్కొన్నారు.


నేడు కొత్తగూడేనికి సీఎం రేవంత్‌

సీఎం రేవంత్‌రెడ్డి శనివారం కొత్తగూడెం రానున్నారు. ఖమ్మం అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి, మహబూబాబాద్‌ అభ్యర్థి పోరిక బలరాం నాయక్‌ను గెలిపించాలని కోరుతూ ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. కొత్తగూడెంలోని సింగరేణి ప్రకాశం స్టేడియంలో ఉదయం 11 గంటలకు బహిరంగ సభ జరగనుంది.

Updated Date - May 04 , 2024 | 05:27 AM