Share News

ఎయిమ్స్‌ను కాంగ్రెస్‌ మంజూరు చేసింది

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:21 AM

బీబీనగర్‌ ఎయిమ్స్‌ను గత కాంగ్రెస్‌ ప్రభుత్వం మంజూరు చేసిందని, భువనగిరి ప్రజా సమస్యలపై లోక్‌సభలో ఎన్నడూ గ ళం విప్పని మాజీ ఎంపీ బూర దీన్ని సాధించాననడం హాస్యాస్పదమని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

ఎయిమ్స్‌ను కాంగ్రెస్‌ మంజూరు చేసింది

పేదోడికోసం పనిచేసే కాంగ్రె్‌సను గెలిపించాలి

కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

భువనగిరి అర్బన్‌, ఏప్రిల్‌ 24: బీబీనగర్‌ ఎయిమ్స్‌ను గత కాంగ్రెస్‌ ప్రభుత్వం మంజూరు చేసిందని, భువనగిరి ప్రజా సమస్యలపై లోక్‌సభలో ఎన్నడూ గ ళం విప్పని మాజీ ఎంపీ బూర దీన్ని సాధించాననడం హాస్యాస్పదమని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో నామినేషన్‌ దాఖ లు చేసిన అనంతరం మీడియా పాయింట్‌ వద్ద విలేకరులతో ఆయన మాట్లాడారు. మాజీ ఎంపీ బూర నర్స య్య ఇప్పటి వరకు ఎన్ని నిధులు తెచ్చాడని ఆయన ప్రశ్నించారు. ఆయన ఎన్నడూ ప్రజా సమస్యలపై లోక్‌సభలో మాట్లాడింది లేదన్నారు. సోషల్‌మీడియాకే మోదీ ప్రభుత్వం అంకితమైందని, బీజేపీకి మళ్లీ అధికారం ఇస్తే రాజ్యాంగాన్ని కూడా మారుస్తుందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రయత్నంలో బీజేపీ ఉందన్నారు. బీసీ జనగణన చేపట్టకుండా, బీసీలపై చిత్తశుద్ధి ఉన్నట్టు ఆ పార్టీ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ నిర్వీర్యం చేస్తోందన్నా రు. ఇచ్చిన హామీ మేరకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా వచ్చే ఆగస్టు 15 వరకు రైతులకు రూ.2లక్షల రుణమాఫీ హామీని కాంగ్రెస్‌ నెరవేరుస్తుందన్నారు. రాష్ట్రంలో సాగుతున్న ప్రజాపాలనను బీజేపీ, బీఆర్‌ఎస్‌ తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. 2014లో రాష్ట్ర విభజన హామీలో పేర్కొన్న నిధులు తేలేకే గంధమల్ల, బస్వాపురం రిజర్వాయర్లు పూర్తి కాలేదని, మూసీ ప్రక్షాళన జరగలేదన్నారు. తానను గెలిపిస్తే నిధులు సాధిస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాలను తుంగలో తొక్కిందన్నారు. పేదోడి కోసం పని చేసే, చిత్తశుద్ధితో అభివృద్ధి చేసే కాంగ్రె్‌సకు ఓటు వేసి గెలిపించాలన్నారు.

అట్టహాసంగా నామినేషన్‌

కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అట్టహాసంగా నామినేషన్‌ దాఖలు చేశారు. తొలుత యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకొని బీ-ఫాంకు ప్రత్యేక పూజలు చేయించారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, వేముల వీరేశం, గుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, మున్సిపల్‌ కౌన్సిలర్‌ ముక్కర్ల మల్లేశం, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు బందారపు భిక్షపతి, తదితరులు ఉన్నారు. నామినేషన్‌ సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు కలెక్టరేట్‌ వద్దకు తరలివచ్చారు.

నియంతృత్వ పాలన అంతమైపోయింది : తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌

తెలంగాణ అమరుల త్యాగఫలితంతో సీఎం పీఠాన్ని అధిష్ఠించిన కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ నియంతృత్వ పాలన అంతమైపోయిందని, ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియా ఇవ్వకుం టే కేసీఆర్‌ చిప్పకూడు తినేవాడివని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌ అన్నారు. సీఎం కాకముందు ఆయన కుటుంబ ఆస్తులు ఎన్ని, సీఎం అయ్యాక ఎన్ని కూడబెట్టారని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం రోజున ప్రగతి భవన్‌ ఇనుప కంచె తొలగించారని, ఫోన్‌ ట్యాపింగ్‌ నేరం కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులే ఒకరికి తెలియకుండా ఇంకొకరి ఫోన్‌ ట్యాపింగ్‌ చేసుకున్నారన్నారు. ఏమిలేని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ సంపన్నులు ఎలా అయ్యారన్నారు.

అత్యధిక మెజారిటీతో గెలుపు : ప్రభుత్వ విప్‌ బీర్ల

ఎన్నో సంక్షేమ పథకాలతో అభివృద్ధికి కాంగ్రెస్‌ పెద్దపీట వేసిందని, అత్యధిక మెజారిటీతో చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుపు ఖా యమైందని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. మోదీ పాలనలో రూ.1,05, 000కోట్ల అప్పులు కాగా, మత, కులాల నడుమ చిచ్చు పెడుతూ మనుషులను విడదీస్తున్న ప్రధాని ఓట్ల కోసం మళ్లీ ప్రజల్లోకి వస్తున్నాడని విమర్శించారు. చిత్తశుద్ధితో ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పని చేసే కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ లాగా కూలిపోయే ప్రాజెక్టులను కాంగ్రెస్‌ కట్టలేదన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 12:21 AM