Share News

రైతులకు అన్యాయం చేస్తోన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:37 AM

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేస్తోందని మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. బుధవారం సాయంత్రం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుంచి రోడ్‌షోకు వెళుతూ, అనంతరం అక్కడి నుంచి సూర్యాపేట జిల్లా కేంద్రానికి వెళ్లారు. ఈ సందర్భంగా నల్లగొండ, తిప్పర్తి, మాడ్గులపల్లి, నకిరేకల్‌ ప్రాంతాల్లో మాట్లాడారు. తిప్పర్తి , తిప్పర్తి కేంద్రాల్లో పార్టీ కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు.

రైతులకు అన్యాయం చేస్తోన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం
అన్నెపర్తి వద్ద స్థానికులతో మాట్లాడుతున్న కేసీఆర్‌

రోడ్‌షోలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌

నల్లగొండ రూరల్‌ / తిప్పర్తి/ నకిరేకల్‌/ మాడ్గులపల్లి, ఏప్రిల్‌ 24 : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేస్తోందని మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. బుధవారం సాయంత్రం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుంచి రోడ్‌షోకు వెళుతూ, అనంతరం అక్కడి నుంచి సూర్యాపేట జిల్లా కేంద్రానికి వెళ్లారు. ఈ సందర్భంగా నల్లగొండ, తిప్పర్తి, మాడ్గులపల్లి, నకిరేకల్‌ ప్రాంతాల్లో మాట్లాడారు. తిప్పర్తి , తిప్పర్తి కేంద్రాల్లో పార్టీ కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బస్సులో నుంచి కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో నీటిఎద్దడి రైతులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. భవిష్యత రోజుల్లో ఉపయోగపడేలా నల్లగొండ జిల్లాకు దామరచర్ల వద్ద యాదాద్రి థర్మల్‌ ప్రాజెక్టును తమ ప్రభుత్వ హయాంలో చేపట్టామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం ఎన్నికల ముందు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి గెలిచాక మరిచిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 204 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఈ విషయాన్ని సీఎంకు తెలియజేస్తే 72గంటల్లో న్యాయం చేస్తాం వివరాలు చెప్పాలని సవాల్‌ చేశారన్నారు. అయితే వారు అడిగిన 4 గంటలలోపే ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల వివరాలు అందజేస్తే ఇప్పటివరకు ఆదుకోలేదన్నారు. ఎన్నికల్లో వాగ్ధానాలు చేసిన తులం బంగారం ఇచ్చారా అని ప్రజలను అడిగారు. ఇలా ఎన్నో హామీలను పక్కన పట్టిన కాంగ్రెస్‌ పార్టీని పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓడించాలన్నారు. కంచర్ల కృష్ణారెడ్డికి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని కోరారు. కేసీఆర్‌కు బుధవారం రాత్రి నకిరేకల్‌లోని చీమలగడ్డలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. రోడ్‌షో అనంతరం సూర్యాపేటకు వెళ్లారు. ఆయా కార్యక్రమాల్లో కేసీఆర్‌ వెంట మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీ్‌షరెడ్డి, నల్లగొండ పార్లమెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, బీఆర్‌ఎస్‌ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత రవీంద్రకుమార్‌, నల్లగొండ మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, రాష్ట్ర నాయకులు చకిలం అనిల్‌కుమార్‌, తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదులుగౌడ్‌, బీఆర్‌ఎస్‌ తిప్పర్తి మండల అధ్యక్షుడు పల్‌రెడ్డి రవీందర్‌రెడ్డి,ప్రధానకార్యదర్శి వనపర్తి నాగేశ్వర్‌రావు, కందుల లక్ష్మయ్య, గుండెబోయిన సైదులు, సైదులు పాల్గొన్నారు.

- నకిరేకల్‌లో భువనగిరి పార్లమెంట్‌ అభ్యర్థి క్యామ మల్లే్‌షయాదవ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, బూడిద భిక్షమయ్యగౌడ్‌, నకిరేకల్‌ మునిసిపల్‌ చైర్మన రాచకొండ శ్రీనివా్‌సగౌడ్‌, జడ్పీటీసీ మాద ధనలక్ష్మి పాల్గొన్నారు.

రైతులతో మాటామంతీ

బస్సుయాత్రలో భాగంగా మిర్యాలగూడకు వెళ్తున్న కేసీఆర్‌కు నల్లగొండ పరిధిలోని అన్నెపర్తి స్టేజీ వద్ద గ్రామ రైతులు, కార్యకర్తలు, మాజీ సర్పంచ అరవింద్‌రెడ్డి స్వాగతంపలికారు. ఈ సందర్భంగా రైతులతో కేసీఆర్‌ ముచ్చటిస్తూ పంటలు ఏవిధంగా పండాయని, కరెంట్‌ సరఫరా ఏవిధంగా ఉందని, నీటి సమస్య ఏమైనా ఉందా అని వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నల్లగొండ పట్టణ పరిధిలోని ఆర్జాలభావి పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్ర వద్ద రైతులు, హమాలీలతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

మాడ్గులపల్లిలో టీ, స్నాక్స్‌ తీసుకున్న కేసీఆర్‌

మాడ్గులపల్లిలోని విడిది హోటల్‌లో కేసీఆర్‌ కాసేపు ఆగారు. స్నాక్స్‌, టీ తీసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ మండల నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. హోటల్‌లో కేసీఆర్‌ 35 నిమిషాల పాటు ఉన్నారు.

చౌటుప్పల్‌ నుంచి వెళ్లిన కేసీఆర్‌ బస్‌ యాత్ర

చౌటుప్పల్‌ టౌన: బస్సు యాత్రలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్‌ యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మీదుగా మిర్యాలగూడకు వెళ్లారు. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి వెంట బస్‌లో ముందు సీట్లో కూర్చున్న కేసీఆర్‌ అభివాదం చేసుకుంటు ముందుకు సాగారు.

Updated Date - Apr 25 , 2024 | 12:37 AM