Share News

కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:05 AM

మోత్కూరు వ్యవసాయ మార్కెట్లో సిం గిల్‌విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో మిల్లర్లు, లారీల యజమానులు(డ్రైవర్లు), హమాలీ, చాట వారు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని మోత్కూరు పట్టణానికి చెందిన రైతు అవిశెట్టి కిరణ్‌కుమార్‌తోపాటు పలువురు రైతులు ఆరోపించారు.

కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ

అక్రమాలను అరికట్టాలని రైతు డిమాండ్‌

మోత్కూరు, ఏప్రిల్‌ 27: మోత్కూరు వ్యవసాయ మార్కెట్లో సిం గిల్‌విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో మిల్లర్లు, లారీల యజమానులు(డ్రైవర్లు), హమాలీ, చాట వారు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని మోత్కూరు పట్టణానికి చెందిన రైతు అవిశెట్టి కిరణ్‌కుమార్‌తోపాటు పలువురు రైతులు ఆరోపించారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. గత నెల (మార్చి) 28న కిరణ్‌కుమార్‌ మార్కెట్‌కు ధాన్యం తెచ్చి, ఆరబెట్టి, ప్యాడీ క్లీనర్‌తో శుభ్రం చేసినట్లు తెలిపారు. 19 రోజులకు ఈ నెల 16 తన ధాన్యం కాంటా వేశారన్నారు. బస్తాకు 40 కిలోలు తూకం వేయాల్సి ఉండగా 41.50 కిలోలు తూకం వేసినట్లు తెలిపారు. తూకం వేసిన తర్వాత ఆరు రోజులకు ఆయన ధాన్యంతోపాటు మరో ఇద్దరు రైతుల బస్తాలు లారీకి ఎత్తి మిల్లుకు పంపగా మిల్లు యజమాని ఐదు బస్తాలు (రెం డు క్వింటాళ్లు) కోత పెట్టాడని వివరించారు. తనవి 378 బస్తాలు అ య్యాయని, 40 కిలోలకు బదులు 41 కిలోలు తూకం వేయడంతో బ స్తాకు కిలో చొప్పున 3.78 క్వింటాళ్లు నష్టపోయినట్లు తెలిపారు. మిల్లు యజమాని తన 378 బస్తాలకు 80 కోత పెట్టాడన్నారు. ధాన్యం తూ కం వేసినందుకు హమాలీలు బస్తాకు (40 కిలోలకు) రూ.18 చొప్పున హమాలి తీసుకోవడంతోపాటు సుమారు ఒక క్వింటా ధాన్యం, చాట మహిళలు సుమారు ఒక క్వింటా ధాన్యం తీసుకున్నారని వాపోయా డు. బస్తాలు లారీలో ఎగుమతి చేయడానికి బస్తాకు రూ.3చొప్పున ఇస్తేనే తీసుకెళ్తానన్నారని, తాను కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో తీసుకోలేదన్నారు. ఇతర రైతుల వద్ద బస్తాకు రూ.3 చొప్పున వ సూలు చేస్తున్నారన్నారని ఆరోపించారు.అదనపు తూకం,మిల్లరు కోత, హమాలీలు, చాట మహిళలు తీసుకున్న ధాన్యాన్ని లెక్కిస్తే ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చి తాను రూ.14,364 నష్టపోయానన్నారు. సంబంధిత ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి రైతులను దోచుకుంటున్న వారిపై చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరాడు. ఇది తన సమస్యే కాదని, రైతులందరి సమస్య అన్నారు.

సింగిల్‌ విండో సీఈవో వివరణ

ఈ విషయాలపై ధాన్యం కొనుగోలుకేంద్రం నిర్వహిస్తున్న సింగిల్‌విండో సీఈవో కె.వరలక్ష్మీని వివరణ కోరగా బస్తాకు 41.50 కిలోలు తూకం వేయడం లేదని, 41 కిలోలు తూకం వేస్తున్నామని, అందులో బస్తా బరువు కూడా ఉంటుందన్నారు. కిరణ్‌కుమార్‌ ధాన్యం కాంటా వేశాక ఆరేడు రోజుల వరకు లారీలు రాకపోవడంతో ఎండలకు ధాన్యం ఎండి మిల్లుకు వెళ్లేటప్పటికి తూకం తగ్గిందన్నారు. శివసాయిమల్లికార్జున రైస్‌ మిల్లు యజమాని తాను దిగుమతి చేసుకున్నప్పుడు ఉన్న తూకం ప్రకారం లెక్క ఇచ్చాడన్నారు. హమాలీలు, చాట మహిళలు అడిగితే ధాన్యం ఇవ్వకుండా ఉండాల్సిన బాధ్యత రైతులదేనన్నారు. లారీలు వచ్చేవరకూ ఆగకుండా కొందరు రైతులు వెళ్లి అదనంగా డబ్బులు ఇస్తామని చెప్పి లారీలు మాట్లాడి తెచ్చుకుని వారు డబ్బులు అడుగుతున్నారని చెప్పడం సరికాదన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 12:06 AM