Share News

కాంగ్రెస్‌ రాగానే కరెంట్‌ బందైంది

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:19 AM

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగా నే కట్‌కా బంద్‌జేసినట్టు కరెంటు మాయమైందని మాజీ సీ ఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. బుధవారం పట్టణం లో హనుమాన్‌పేట ప్లైఓవర్‌ నుంచి రాజీవ్‌చౌక్‌ వరకు రోడ్‌ షో నిర్వహించారు.

కాంగ్రెస్‌ రాగానే కరెంట్‌ బందైంది

రుణమాఫీపై ప్రభుత్వం కల్లిబొల్లి కబుర్లు

పదేళ్లలో 18 పంటలకు నీళ్లిచ్చాం

కృష్ణా నీళ్లపై బోర్డుకు కాంగ్రెస్‌ అధికారం ఇచ్చింది

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌

మిర్యాలగూడ, ఏప్రిల్‌ 24: కాంగ్రెస్‌ అధికారంలోకి రాగా నే కట్‌కా బంద్‌జేసినట్టు కరెంటు మాయమైందని మాజీ సీ ఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. బుధవారం పట్టణం లో హనుమాన్‌పేట ప్లైఓవర్‌ నుంచి రాజీవ్‌చౌక్‌ వరకు రోడ్‌ షో నిర్వహించారు. రాజీవ్‌చౌక్‌ వద్ద ప్రజలను ఉద్దేశించి మా ట్లాడారు. 1956 నుంచి తెలంగాణకు శత్రువు కాంగ్రెసే అని అన్నారు. ఏపీలో విలీనం చేసి మనల్ని ఇబ్బందులకు గురిచేస్తే నిధులు, నీళ్లు, కరెంటు కోసం 58 ఏళ్లు పోరాడాల్సి వచ్చిందన్నా రు. తిరిగి 420 హామీలతో ప్రజలను మభ్యపెట్టిందన్నారు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతామని జిల్లా మంత్రి పేర్కొనడాన్ని అందరం చూశామన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో 18పంటలకు కృష్ణానది నుంచి నీరిచ్చామన్నారు.సాగర్‌లో నీళ్లు ఉన్నా పంటలకు ఇవ్వలేని దద్దమ్మ మంత్రులు ప్రాజెక్టును కేఆర్‌ఎంబీకీ అప్పగించారని విమర్శించారు. రాష్ట్రంలో మిగులు కరెంట్‌ ఉండగా, ఆగం చేసి ప్రజలను, రైతులను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. మిషన్‌ భగీరథ ద్వారా అర్బన్‌ ఏరియాల్లో, మునిసిపాలిటీల్లో ఒక్క రూపాయికే నల్లా కలెక్షన్‌లు ఇచ్చి తాము తాగునీటి ఇబ్బందు లు తొలగించామన్నారు. దాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వం ఎం దుకు నడపలేకపోతోందో అర్థం కావడం లేదన్నారు. కేసీఆర్‌ దిగిన నాలుగైదు నెలల్లోనే ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టారని అన్నారు. పాలన చేతగాక కేవలం కేసీఆర్‌ను తిట్టడంతోనే పబ్బం గడుపుతున్నారని అన్నారు. రైతుబంధును 5 ఎకరాలకే పరిమితం చేస్తామని అంటున్నారని, రైతులకు ఇస్తే వీరి సొ మ్ము ఏం పోతోందో అర్థం కావడం లేదన్నారు. డిసెంబరు 9న 12గంటల వరకు రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభు త్వం ఇంతవరకు చేయలేదన్నారు. రూ.4వేల నిరుద్యోగ భృతిపై డిప్యూటీ సీఎం భట్టి మాటమార్చారన్నారు. మహిళలకు రూ. 2,500 ఆర్థిక చేయూత అమలు కాలేదన్నారు. కళ్యాణలక్ష్మి పథకంలో లక్ష రూపాయలకు తోడు తులం బంగారం ఇస్తామని చెప్పి ఇనుము కూడా ఇవ్వడం లేదన్నారు. 20 రోజులైనా ఐకే పీ కేంద్రాల్లోని ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని రైతులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు.తమ ప్రభుత్వ హ యాంలో కేంద్రంలో మోదీ ధాన్యాన్ని కొనుగోలుచేసేది లేదని మొండికేస్తే ఢిల్లీలో ధర్నాచేసి మెడలు వంచి కొనిపించామన్నారు.

పోరాటం కొత్త కాదు

పార్లమెంట్‌ ఎన్నికల తరువాత కేసీఆర్‌ను జైలుకు పంపుతామని, పేగులు మెడలో వేసుకుంటమని, గుళ్లతో గోళీలు ఆడుకుంటామని సీఎం హోదాలో అభ్యతంరకరంగా మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్‌కు పోరాటం కొత్తకాదన్నారు. చావునోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించానన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల్ని గెలిపిస్తే హామీల అమలు కోసం భూమి, ఆకాశాన్ని ఏకం చేసి పోరాడతానని అన్నారు. కారు గుర్తుపై ఓటు వేసి నల్లగొండ ఎంపీగా కంచర్ల కృష్ణారెడ్డిని గెలిపించాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య పంచాయితీ మొదలైందని, మీరు బలం ఇస్తే పంచాయితీ పెద్దగా ఉండి కాంగ్రెస్‌ మెడలు వంచి సమస్యలను పరిష్కారం అయ్యేలా చూస్తానని అన్నారు.

అంబేడ్కర్‌ను అవమానించారు

రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ దయవల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని కేసీఆర్‌ అన్నారు. ఆర్టికల్‌ 3 ప్రకారం తెలంగాణ ఏర్పాటైందని, ఆ మహనీయుడి 125 అడుగుల విగ్రహాన్ని రాజధాని నడిబొడ్డులో ఏర్పాటుచేస్తే కేసీఆర్‌ ఆనవాళ్లు కానరావద్దనే తలంపుతో అంబేడ్కర్‌ జయంతి రోజున సీఎం అక్కడకు వెళ్లకపోగా, గేటుకు తాళం వేయించారని విమర్శించారు. మిర్యాలగూడ ప్రజలు చూపిన ఆపూర్వ ఆదరణ, ప్రేమను జన్మలో మరువలేనని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో సాగర్‌ నీళ్ల కోసం కోదాడ-హాలియా పాదయాత్రలో భాగంగా మిర్యాలగూడ వచ్చినప్పడు ఇదే రీతిలో స్వాగతం పలికారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు బి.లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎ మ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, భూపాల్‌రెడ్డి, కిశోర్‌, రవీంద్రకుమార్‌, భగత్‌, విజయసింహారెడ్డి, నాయకులు నల్లమోతు సిద్దార్ధ, చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, పా ల్గొన్నారు.

నేడు భువనగిరిలో కేసీఆర్‌ రోడ్‌షో

యాదాద్రి, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): మా జీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రోడ్‌షో గురువారం భువనగిరిలో సాగనుంది. ఆయన గురువారం మధ్యాహ్నం సూర్యాపేట నుంచి బయలుదేరి కేతేపల్లి, నకిరేకల్‌ బైపాస్‌, నార్కట్‌పల్లి బైపాస్‌ రోడ్డు, చిట్యాల చౌరస్తా, రామన్నపేట, వలిగొండ మీదుగా భువనగిరికి సాయంత్రం 5గంటలకు చేరుకుంటారు. రోడ్‌షో అనంతరం పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ రోడ్‌షోను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రజలను పెద్ద సంఖ్యలో తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రోడ్‌షో ఏర్పాట్లను బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్‌, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి, తదితరులు పర్యవేక్షిస్తున్నారు.

30ఏళ్ల మూసీ నీటి నుంచి పేట ప్రజలకు విముక్తి

(ఆంధ్రజ్యోతి, సూర్యాపేట): 30 ఏళ్ల మూసీ మురికి నీటి నుంచి పేట ప్రజలకు విముక్తి కల్పించి స్వచ్ఛమైన మిషన్‌ భగీరథ నీటిని అందించామని కేసీఆర్‌ అన్నారు. బుధవారం రాత్రి సూర్యాపేట పట్టణంలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు బీళ్లుగా ఉన్న సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని వ్యవసాయ భూములకు కాళేశ్వరం ద్వారా నీటిని అందించి సస్యశ్యామలం చేశామన్నారు. అనేక చెరువులు, కుంటలను కాళేశ్వరం జలాలతో నింపామని, గతంలో అవన్నీ ఎండిపోయి ఉండేవన్నారు. సూర్యాపేట పోరాటాల ఖిల్లా అని, జగదీ్‌షరెడ్డి నాయకత్వంలో సూర్యాపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. మెడికల్‌ కళాశాలను ఏర్పాటుచేశామని, ఒకప్పుడు కంపచెట్లతో నిండిన సద్దుల చెర్వును సుందరంగా తీర్చిదిద్దడంతో నేడు చూడముచ్చటగా ఉందన్నారు. జిల్లాలో ఉన్న రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిద్రావస్థలో ఉన్నారని, టెయిల్‌పాండ్‌ నుంచి అక్రమంగా ఐదు టీఎంసీల నీటిని ఏపీ తరలించుకుపోతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అలవికాని హామీలు ఇచ్చి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తాము 1,100 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన ఆహారంతో పాటు విద్యనందించామన్నారు. కానీ నేడు గురుకుల పాఠశాలల్లో సరైన ఆహారం లేక, కలుషిత ఆహారం తినడంతో ఎంతో మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో పాటు కొందరు మృతి చెందారన్నారు. ప్రజలను బాధపెడితే ఊరుకునేది లేదని, ప్రాణాలు పోయినా ఫర్వాలేదు కానీ ఎంత వరకు అయినా తెగిస్తానని స్పష్టం చేశారు. కేసీఆర్‌ రోడ్‌షోకు తాళ్లగడ్డ నుంచి ప్రధాన పోస్టాఫీస్‌ వరకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. పూలు చల్లి, బాణాసంచాలు కాల్చారు. సీఎం కేసీఆర్‌ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. కేసీఆర్‌ ప్రసంగించే సమయంలో మైక్‌ మొరాయించడంతో ఈ మైక్‌ మనోడు పెట్టిందేనా అంటూ తన సహజమైన రీతిలో సెటైర్‌ వేశారు.

Updated Date - Apr 25 , 2024 | 12:19 AM