Share News

తెల్లం, కడియంపై అనర్హత వేటు వేసేలా ఆదేశించండి

ABN , Publish Date - Apr 25 , 2024 | 04:25 AM

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచి కాంగ్రె్‌సలో చేరిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై అనర్హత వేటు వేసేలా ఆదేశాలు ఇవ్వడంతోపాటు తాము దాఖలు చేసే అనర్హత పిటిషన్‌లను స్వీకరించేలా అసెంబ్లీ స్పీకర్‌,

తెల్లం, కడియంపై అనర్హత వేటు వేసేలా ఆదేశించండి

పిటిషన్‌లను స్పీకర్‌ తీసుకోవడం లేదు

హైకోర్టులో ఎమ్మెల్యే వివేకానంద్‌ పిటిషన్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచి కాంగ్రె్‌సలో చేరిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై అనర్హత వేటు వేసేలా ఆదేశాలు ఇవ్వడంతోపాటు తాము దాఖలు చేసే అనర్హత పిటిషన్‌లను స్వీకరించేలా అసెంబ్లీ స్పీకర్‌, కార్యదర్శికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మె ల్యే కేపీ వివేకానంద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని షెడ్యూల్‌ 10 ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్‌, అసెంబ్లీ కార్యదర్శులకు తాము రిజిస్టర్‌ పోస్టు ద్వారా, ఈ-మెయిల్‌ ద్వారా అనర్హత పిటిషన్‌లు పంపామని.. అయితే వారు వాటిని స్వీకరించడం లేదని.. పిటిషన్‌లు స్వీకరించినట్లు అకనాలెడ్జ్‌మెంట్‌ ఇవ్వడంలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్లు స్వీకరించకపోవడం.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వకపోవడం.. వారి వివరణ తీసుకోకపోవడం అక్రమమని, రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. పిటిషన్‌లను స్వీకరించే వ్యవహారంలో స్పీకర్‌ దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని.. రిజిస్టర్‌ పోస్టు ద్వారా పంపిన పిటిషన్‌లు సైతం ‘అడ్రెసీ ఆప్సెంట్‌’ అని తిరిగి వస్తున్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగ నియమాల ప్రకారం అనర్హత పిటిషన్‌లపై విచారణ చేపట్టడం, నిర్ణయం తీసుకోవడం స్పీకర్‌ విధి అని.. ఈ విషయంలో స్పీకర్‌ ఎలాంటి వివక్ష ఉండకూడదని పిటిషన్‌లో తెలిపారు. మూడునెలలకు మించకుండా అనర్హత పిటిషన్‌లను పరిష్కరించాలని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టంచేసిందన్నారు. పదో షెడ్యూల్‌ 6(1) ప్రకారం స్పీకర్‌ క్వాసీ జ్యుడీషియల్‌ అథారిటీ అని.. ఆయన ఒక ట్రైబ్యునల్‌ అని.. ట్రైబ్యునల్‌ తరహాలో నిర్ణీతకాలంలో తన ఎదుట ఉన్న అనర్హత పిటిషన్లను పరిష్కరించి తీర్పు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌ త్వరలో హైకోర్టు ఎదుట విచారణకు రానుంది. కాగా, పార్టీ మారిన మరో ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇప్పటికే ప్రభుత్వానికి, ఈసీకి హైకోర్టు నోటీసులు జారీచేసింది.


సురేఖపై ఫిర్యాదును పరిశీలిస్తాం: ఈసీ

మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో దాఖలైన ఫిర్యాదును పరిశీలిస్తామని ఈసీ హైకోర్టుకు తెలియజేసింది. ఈనెల 26లోగా ఫిర్యాదును పరిష్కరిస్తామని తెలిపింది. కేటీఆర్‌ వ్యక్తిగత జీవితంపై, ఫోన్‌ట్యాపింగ్‌లో జైలుకు వెళ్తారని అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి సురేఖపై చర్యలు తీసుకునేలా ఈసీ ఆదేశాలు జారీచేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Updated Date - Apr 25 , 2024 | 04:25 AM