Share News

TS Politics: రఘురామరెడ్డికే ఖమ్మం సీటు

ABN , Publish Date - Apr 25 , 2024 | 04:46 AM

ఖమ్మం సీటుపై మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. ఆయన వియ్యంకుడు, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్‌రెడ్డి కుమారుడు రఘురామరెడ్డిని ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థిగా అధిష్ఠానం నిర్ణయించింది. ఖమ్మం సీటుకు

TS Politics: రఘురామరెడ్డికే ఖమ్మం సీటు

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం సీటుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. ఆయన వియ్యంకుడు, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్‌రెడ్డి కుమారుడు రఘురామరెడ్డిని ఖమ్మం కాంగ్రెస్‌ (Congress) అభ్యర్థిగా అధిష్ఠానం నిర్ణయించింది. ఖమ్మం సీటుకు రామసహాయం రఘురామరెడ్డిని, కరీంనగర్‌ సీటుకు వెలిచాల రాజేందర్‌రావును, హైదరాబాద్‌ స్థానం నుంచి డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్‌ వలీవుల్లా సమీర్‌ను అభ్యర్థులుగా నిర్ణయించింది. అదేవిధంగా.. ఖమ్మం-వరంగల్‌-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఉప ఎన్నికల అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న పేరును ప్రకటించింది. వాస్తవానికి ఖమ్మం సీటును తన భార్య నందినికి ఇప్పించేందుకు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, తన సోదరుడు ప్రసాదరెడ్డి కోసం పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, తన కుమారుడు యుగంధర్‌ కోసం మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రయత్నాలు చేశారు. అయితే మంత్రుల కుటుంబ సభ్యులకు సీటు కేటాయించవద్దన్న వాదన ముందుకు రావడంతో.. తన వియ్యంకుడు రామసహాయం సురేందర్‌రెడ్డి పేరును పొంగులేటి తెరపైకి తెచ్చారు.

Bhatti-And-Ponguleti.jpg

బీసీ నేత వి.హన్మంతరావు కూడా ఈ సీటు కోసం ప్రయత్నించారు. అయితే జిల్లాలో కమ్మసామాజిక వర్గం బలంగా ఉన్న నేపథ్యంలో.. స్థానికంగా ఆ సామాజిక వర్గం నేత రాయల నాగేశ్వర్‌రావుకు టికెట్‌ ఇవ్వాలని భట్టివిక్రమార్క ప్రతిపాదించారు. ఈ సీటు వ్యవహారం శిరోభారంగా మారడంతో.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ బాధ్యతను అధిష్ఠానానికే అప్పగించారు. భట్టి విక్రమార్కతోపాటుగా రాష్ట్ర ముఖ్య నాయకులు, ఎంపీ రేణుకాచౌదరి, మంత్రి తుమ్మలనాగేశ్వర్‌రావు, జిల్లా ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకున్న అధిష్ఠానం.. చివరికి రామసహాయం రఘురామరెడ్డి పేరును ఖరారు చేసింది. నిజానికి రఘురామరెడ్డి తండ్రి సురేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేశారు. పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి కాంగ్రె్‌సలో చేరడం వెనకా.. సురేందర్‌రెడ్డి మంత్రాంగం ఉంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి, సురేందర్‌రెడ్డి కారణంగా ఖమ్మంలో పలు శాసనసభ స్థానాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకోగలిగింది. ఈ సమీకరణలతో రఘురామరెడ్డి వైపు అధిష్ఠానం మొగ్గుచూపినట్లు స్పష్టమవుతోంది. కాగా.. ఖమ్మం సీటును రెడ్డి సామాజికవర్గానికి కేటాయిస్తే.. కరీంనగర్‌ను వెలమలకు ఇవ్వాలని అధిష్ఠానం ముందే నిర్ణయించింది. ఈ మేరకు కరీంనగర్‌ స్థానానికి వెలిచాల రాజేశ్వర్‌రావు పేరును ఖరారు చేసింది. అయితే.. పేర్ల ప్రకటన జరగక ముందే.. రఘురామరెడ్డి, వెలిచాల రాజేశ్వర్‌రావు పార్టీ తరఫున నామినేషన్లను దాఖలు చేసిన విషయం తెలిసిందే..!

Untitled-5.jpg

Read Latest Election News and Telugu News.

Updated Date - Apr 25 , 2024 | 07:32 AM