Share News

వేదాంత మైనింగ్‌ను అడ్డుకున్న సైనికుడు రాహుల్‌

ABN , Publish Date - May 04 , 2024 | 05:22 AM

ఒడిసాలో బాక్సైట్‌ తవ్వకాలకు వేదాంత కంపెనీ సిద్ధమైతే.. రాహుల్‌గాంధీ ఢిల్లీ నుంచి వచ్చి ఓ సైనికుడిలా అడ్డుకున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర వనరులు

వేదాంత మైనింగ్‌ను అడ్డుకున్న సైనికుడు రాహుల్‌

మోదీ, పట్నాయక్‌తో ఒడిసాకు నష్టం

బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు

రాయగడ ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, మే 3 (ఆంధ్రజ్యోతి): ఒడిసాలో బాక్సైట్‌ తవ్వకాలకు వేదాంత కంపెనీ సిద్ధమైతే.. రాహుల్‌గాంధీ ఢిల్లీ నుంచి వచ్చి ఓ సైనికుడిలా అడ్డుకున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర వనరులు స్థానిక ప్రజలకే చెందాలంటూ ఆయన చేసిన గట్టి పోరాటం వల్లే బాక్సైట్‌ గనులు సురక్షితంగా ఉన్నాయన్నారు. ఒడిసాలోని రాయగడ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాహుల్‌గాంధీ ఈ సభకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ రాయ్‌బరేలిలో నామినేషన్‌ వేసే కార్యక్రమం ఉండడంతో హాజరు కాలేకపోయారు. దాంతో సభలో భట్టి విక్రమార్క ప్రధాన వక్తగా మాట్లాడారు. మోదీ, అమిత్‌షా, ఒడిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఒకవైపు ఉండగా, మరోవైపు రాహుల్‌గాంధీ ఈ ఎన్నికల్లో పోరాడుతున్నారని తెలిపారు. ప్రధాని దేశ సంపదను అంబానీ, ఆదానీ వంటి కొద్ది మంది తన మిత్రులకే పంచిపెడుతుండగా.. ఆ సంపద మొత్తం ఈ దేశవాసులకే జనాభా దామాషా పద్ధతిలో చెందాలంటూ రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర చేపట్టారని చెప్పారు. కరువు ప్రాంతమైన ఒడిసాకు గాంధీల కుటుంబం ఆది నుంచి అత్యధిక ప్రాధాన్యమిస్తోందని, గతంలో ఇక్కడ కరువు ఏర్పడినప్పుడు దివంగత ప్రధానులు నెహ్రూ, రాజీవ్‌గాంధీలు పర్యటించి నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు.

కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దువుతాయని, వాటిని కాపాడుకునేందుకు కాంగ్రె్‌సకు మద్దతు ఇవ్వాల ని కోరారు. బీజేపీ, నవీన్‌ పట్నాయక్‌ ఓ కుటుంబంలో కలిసి ఉంటున్నారని, వారి కలయిక దశాబ్దాలుగా ఒడిసా ప్రజలకు నష్టం చేకూరుస్తోందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు నెలకు రూ.2000, ఎస్సీ, ఎస్టీ మహిళలకు మరో వెయ్యి జోడించి రూ.3000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తామని చె ప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న వనరుల దోపిడీని అడ్డుకునేందుకు ఉన్నత విద్యావంతుడు బీఎస్‌ సప్తగిరిని గెలిపించాలని భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. సభలో ఏఐసీసీ నాయకులు భక్త చరణ్‌ దాస్‌, ఆర్సీ కుంతియా, మీనాక్షి నటరాజన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2024 | 05:22 AM