Share News

బూత్‌ కమిటీలే పార్టీకి పునాదులు

ABN , Publish Date - Apr 24 , 2024 | 12:03 AM

బూత్‌ కమిటీలే పార్టీకి పునాదులని, పరీక్షలు రాసే విద్యార్థుల మాదిరి రానున్న 20రోజులు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.

బూత్‌ కమిటీలే పార్టీకి పునాదులు
మీర్‌పేట్‌లో ప్రచారం నిర్వహిస్తున్న విశ్వేశ్వర్‌రెడ్డి సతీమణి సంగీతారెడ్డి

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

తాండూరు, ఏప్రిల్‌ 23: బూత్‌ కమిటీలే పార్టీకి పునాదులని, పరీక్షలు రాసే విద్యార్థుల మాదిరి రానున్న 20రోజులు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. తాండూరులో మంగళవారం బీజేపీ ముఖ్య కార్యకర్తలతో మాట్లాడారు. అనంతరం పార్టీలోకి పలువురు చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. చిత్తశుద్ధితో పనిచేసి తన విజయానికి ప్రతీఒక్కరు కషి చేయాలని కోరారు. తాండూరులో బీజేపీ మొదటి స్థానంలో ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ మూడో స్థానానికి పరిమితం కానుందన్నారు. భవిష్యత్తులో ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటానని తెలిపారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సమక్షంలో తాండూరు పట్టణ సీనియర్‌ నాయకులు ముజీబ్‌ జీవని, మాజీ ఎంపీటీసీ మల్లికార్జున్‌, మంతటి సర్పంచ్‌ దశరథ్‌, గుండ్ల మడుగు తండా సర్పంచ్‌ యాదవ్‌, కాశీపూర్‌ సర్పంచ్‌ వెంకటయ్య, పర్వతపల్లి సర్పంచ్‌ చాంద్‌ పాషతో పాటు సుమారు 200 మంది వివిధ పార్టీలకు చెందిన పలువురు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్‌, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్‌, యాలాల ఎంపీపీ బాలేశ్వర్‌గుప్తా, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ నాగారం నర్సింహులు పాల్గొన్నారు.

బీజేపీలోకి మాజీ సర్పంచులు

బషీరాబాద్‌: మండలంలోని పలువురు మాజీ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పలువురు మంగళవారం బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. మంతట్టి మాజీ సర్పంచ్‌ విబూతి దశరథ్‌, పర్వత్‌పల్లి మాజీ సర్పంచ్‌ పిర్మాచంద్‌పాషా, కాశీంపూర్‌ మాజీ సర్పంచ్‌ సి.వెంకటయ్యలతో పాటు మంతట్టి నుంచి దశరథ్‌ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు బోయిని వెంకటేష్‌, పంతులు ప్రభాకార్‌, సంకు చిన్న నర్సప్ప, తలారి నర్సింహులు, నాటికేరి అనిల్‌, మోహన్‌, నరేష్‌, విజయ్‌, బుడగజంగం యువకులు పలువురు బీజేపీలో చేరారు. తాండూరులోని పార్టీ సమావేశంలో కొండా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కేంద్ర పథకాలే బీజేపీ గెలుపునకు నాంది

చేవెళ్ల : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గెలుపునకు నాంది పలుకుతాయని బీజేపీ చేవెళ్ల మండలాధ్యక్షుడు దేవర పాండురంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎ.అనంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం చేవెళ్ల మండల కేంద్రంలోని ఆయా కాలనీల్లో నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. వారు మాట్లాడుతూ దేశంలోని బీజేపీ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. విశ్వేశ్వర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల నేతలను ఓడించాలని పిలుపునిచ్చారు. నాయకులు అడెట్ల శ్రీనివాస్‌, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి, దేవుని శర్వలింగం, బబ్లు గణేశ్‌, ఎం. వైభవ్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, భార్గవ్‌రెడ్డి, కార్యకర్తలు తదితరులున్నారు.

కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి : సంగీతారెడ్డి

సరూర్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో అమలవుతున్న పలు పథకాలకు నిధులు ఇస్తున్నా.. ఇక్కడి ప్రభుత్వం మాత్రం వాటిని పక్కదారి పట్టిస్తూ ప్రజలను మోసం చేస్తున్నదని విశ్వేశ్వర్‌రెడ్డి సతీమణి సంగీతారెడ్డి ఆరోపించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్‌పేట్‌ కార్పొరేషన్‌లో ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరిగి కేంద్రంలో అమలు చేస్తున్న పథకాలు, రాష్ట్రంలో అమలు చేయబోయే పథకాలతో ముద్రించిన కరపత్రాలు స్థానికులకు పంపిణీ చేశారు. విశ్వేశ్వర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. బీజేపీ మీర్‌పేట్‌ శాఖ అధ్యక్షుడు నర్సింహ, కీసరి గోవర్ధన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

హనుమాన్‌ శోభాయాత్రలో పాల్గొన్న విశ్వేశ్వర్‌రెడ్డి

శంషాబాద్‌ : శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలో నిర్వహించిన హనుమాన్‌ శోభాయాత్రలో కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ శోభాయాత్రలతో దేశ సంస్కృతీ సాంప్రదాయాలు పెరుగుతాయన్నారు. దేశభక్తి కూడా పెంపొందుతుందన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ హనుమాన్‌ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ నాయకులు డాక్టర్‌ ప్రేమ్‌రాజ్‌, చేవెళ్ల మహేందర్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2024 | 12:03 AM