Share News

సీట్ల దందా!

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:15 AM

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కార్పొరేట్‌ జూనియర్‌ కాలేజీల యాజమన్యాలు సీట్లు అయిపోతున్నాయంటూ కృత్రిమ డిమాండ్‌ సృష్టించి అక్రమంగా ఫీజులు పెంచుతూ సొమ్ము చేసుకుంటున్నారు.

సీట్ల దందా!

కార్పొరేట్‌ కాలేజీల మాయ

టెన్త్‌ ఫలితాలకు ముందే ప్రవేశాలు

రూ.లక్షల్లో ఫీజుల వసూలు!

ఆన్‌లైన్‌ తరగతులూ షురూ

అపార్ట్‌మెంట్లు, ఇరుకైన గదుల్లో బోధన

పట్టించుకోని ఇంటర్‌ బోర్డు అధికారులు

వేసవి వచ్చిందంటే ప్రైవేట్‌/కార్పొరేట్‌ కాలేజీలకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు దండుకునే సమయం వచ్చినట్టే. అటు పదో తరగతి పరీక్షలు పూర్తయితావో లేదో.. ఇటు ప్రైవేట్‌ కాలేజీల్లో అడ్మిషన్లు మొదలెడతారు. నిజానికి పదో తరగతి పరీక్ష ఫలితాలొచ్చిన తరువాతే.. అదీ ఇంటర్‌ బోర్డు ఉత్తర్వుల మేరకే అడ్మిషన్లు తీసుకోవాలి. కానీ, కార్పొరేట్‌ కాలేజీల యాజమాన్యాలు అవేమీ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ, ఇంటర్‌ బోర్డు నిబంధనలను లెక్కచేయడం లేదు. పైగా.. సీటు ముందస్తు రిజర్వ్‌ పేరిట విద్యార్థుల నుంచి రూ.10,500 వసూలు చేస్తున్నారు. డే స్కాలర్‌/హాస్టల్‌ విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులుగుంజుతున్నారు. అరకొర వసతులున్న కాలేజీలో డే స్కాలర్‌కు రూ.లక్ష నుంచి 1.2లక్షల వరకు, హాస్టల్‌ విద్యార్థులకు కల్పించే వసతులను బట్టి రూ.2.5లక్షల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్‌ కాలేజీల ఫీజు దందాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

రంగారెడ్డి అర్బన్‌, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కార్పొరేట్‌ జూనియర్‌ కాలేజీల యాజమన్యాలు సీట్లు అయిపోతున్నాయంటూ కృత్రిమ డిమాండ్‌ సృష్టించి అక్రమంగా ఫీజులు పెంచుతూ సొమ్ము చేసుకుంటున్నారు. అడ్వాన్స్‌ బుకింగ్‌ పేరుతో సీట్లను బ్లాక్‌ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శివారులోని కాలేజీల్లో ఇప్పటికే 2024-25 సంవత్సరానికి ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్మిషన్లు అయిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పుడు ప్రవేశాలు తీసుకుంటేనే ఫీజు రాయితీ ఇస్తాం.. లేదంటే తర్వాత ఫీజు పెరుగుతుందంటూ తల్లిదండ్రులను, విద్యార్థులను కాలేజీల యాజమాన్యాలు పరుగులు పెట్టిస్తున్నారు. ఆలస్యంగా వచ్చిన వారినుంచి భారీగా ఫీజులు దండుకుంటున్నారు. మంచి కాలేజీలో సీటు దొరకదేమోనన్న ఆందోళనలో తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యం చెప్పినంత ఫీజు చెల్లించి సీట్లు పొందుతున్నారు. ముందస్తు సీటు రిజర్వేషన్‌ పేరిట రూ.10,500 తీసుకుంటున్నారు. అలాగే హాస్టల్లో ఉండబోయే విద్యార్థుల నుంచి భారీగా ఫీజు వసూలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో గ్రూపులో 60 మందికి పైగా విద్యార్థులను కూర్చోబెట్టి చదువు చెబుతున్నారు. ఇంతగా ఫీజు కట్టి విద్యార్థులు కాలేజీల్లో చేరినా.. వారిపై వ్యక్తిగత శ్రద్ధ అనేదే లేకుండాపోతోంది. 2024-25 జూనియర్‌ కాలేజీల విద్యా సంవత్సరాన్ని జూన్‌ ఒకటి నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం, ఇంటర్‌ బోర్డు ఇప్పటికే ఖరారు చేసినా.. సెలవు రోజుల్లోనే కార్పొరేట్‌ కళాశాలలు ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించి ఫీజులు రాబడుతున్నాయి. ఇంటర్‌ బోర్డు నిబంధనలను, నిర్ణయాలను ప్రైవేట్‌, కార్పొరేట్‌ కాలేజీలు ఏమాత్రం లెక్కచేయడం లేదనేదానికి ఇవన్నీ నిదర్శనాలే! అపార్ట్‌మెంట్లలో, ఇరుకిరుకు గదుల్లో కాలేజీలు కొనసాగుతున్నా.. అధికారులు అస్సలు పట్టించుకోవడం లేదు. కాలేజీ నిర్వహణకు అనుకూలంగా లేని ప్రదేశాలు, బిల్డింగుల్లో ప్రైవేట్‌ కాలేజీలను నడుపుతున్నారు. వాటిల్లో విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు. జైల్లో ఖైదీలను వేసినట్టుగా గదుల్లో కూర్చోబెట్టి బోధన సాగిస్తున్నారు. విద్యార్థులు ఉదయం 9గంటలకు కాలేజీల్లోకి వెళ్లారంటే సాయంత్రం ఐదు తర్వాతే బయటకొస్తున్నారు. కాలేజీలకు గ్రౌండ్‌ గానీ, చుట్టూ ఖాళీ ప్రదేశాలు గానీ లేని కమర్షియల్‌ బిల్డింగుల్లో రోడ్ల పక్కన కాలేజీలు నిర్వహిస్తున్నారు. వాహనాల రణగొణ ధ్వనుల మధ్య ఉన్న బిల్డింగుల్లో కొనసాగుతున్న కాలేజీలతో విద్యార్థుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. అధ్యాపకులు చెప్పింది విని అర్థం చేసుకునే ప్రశాంత పరిస్థితి సైతం కొన్ని కాలేజీల్లో ఉండడం లేదంటే అతిశయోక్తి కాదు. ఫీజుల్లో తగ్గింపే లేదు.

అడ్మిషన్‌ షెడ్యూల్‌కు ముందుగానే ప్రవేశాలు

షెడ్యూల్‌ ప్రకటనకు ముందుగానే అడ్మిషన్లు ఇస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవడంలో ఇంటర్‌ బోర్డు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కార్పొరేట్‌ కాలేజీల దందాను అరికట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటర్‌ బోర్డు అధికారులను కోరుతున్నారు. వాస్తవానికి పదో తరగతి పరీక్షలు ముగిసి, ఫలితాలు వెల్లడించిన తర్వాతే ఇంటర్‌ బోర్డు ప్రవేశాల నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. అప్పుడే ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. కానీ, కార్పొరేట్‌ కాలేజీలు ఇప్పటికే అడ్మిషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకుంటున్నాయి. ఇది బోర్డు నిబంధనలకు విరుద్ధం. ‘అడ్మిషన్లు ప్రారంభించబడినవి’ అని ఫ్లెక్సీలు, బోర్డులు పెట్టుకొని, కరపత్రాలు, వాల్‌పోస్టర్ల ద్వారా, వివిధ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రచారం చేసుకుంటున్నా అధికారులు తీసుకుంటున్న చర్యలు శూన్యం. ఇంటర్‌ బోర్డు అధికారుల పర్యవేక్షణ లోపం, కాలేజీలను అదుపుచేయకే ప్రైవేట్‌, కార్పొరేట్‌ కాలేజీల ఇష్టారాజ్యం నడుస్తోందని, ప్రైవేట్‌ విద్యా వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ లేకుండా పోతోందని, కాలేజీలు ఇష్టారాజ్యంగా ఫీజుల వసూళ్లు, తరగతుల నిర్వహణ, ముందుగానే అడ్మిషన్లు వంటి చట్ట విరుద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫీజులు తడిసి మోపెడు!

కార్పొరేట్‌ కళాశాలల్లో గ్రూపులను బట్టి ఫీజులు నిర్ణయిస్తున్నారు. క్లాస్‌ రూమ్‌లలో ఏసీ, సెమీ ఏసీల పేరిట ఒక్కో విద్యార్థి నుంచి ఫీజు వసూలు చేస్తున్నారు. ప్రవేశాలు పొందిన విద్యార్థుల నుంచి రూ.3లక్షలపైన వసూలు చేస్తున్నారు. ఐఐటీ, మెయిన్స్‌, జేఈఈ, నీట్‌ కోచింగ్‌కు ప్రత్యేకం. ఒక్కో విద్యార్థి వద్ద రూ.2.3లక్షల నుంచి రూ.2.6లక్షల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. హాస్టల్‌ విద్యార్థులకు అదనంగా రూ.26వేల వరకు దోబీ, ఇతరత్రా అవసరాల పేరిట దండుకుంటున్నారు. నాన్‌ ఏసీకి రూ.1.9లక్షల నుంచి రూ.2లక్షల వరకు వసూలు చేస్తున్నారు. అయితే, ఇంత మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నా.. విశాలమైన స్థలం లేకపోగా అపార్టుమెంట్‌లో, ఇరుకు గదుల్లోనే తరగతులు కొనసాగిస్తున్నారు.

అనుమతి లేకున్నా..

ఇంటర్‌ ప్రవేశాలపై కళాశాలల యాజమాన్యాలు మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నాయి. అఫిలియేషన్‌(అనుమతి) లేకున్నా తమ కళాశాలలో చేరాలంటూ విద్యార్థులపై ప్రలోభాలు, ఒత్తిడి తెస్తున్నాయి. విద్యార్థి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు లేకుండానే అడ్మిషన్లు చేపడుతున్నారు. గుర్తింపు పొందాలంటే ఆట స్థలం(ప్లేగ్రౌండ్‌), అగ్నిమాపక అనుమతులు, కాలుష్యం భవన పటిష్టత, ట్రాఫిక్‌ తదితర ధ్రువీకరణ పత్రాలు అవసరం. బోధకులు, సిబ్బంది, వివరాలన్నీ ఉంటేనే అనుబంధ గుర్తింపు లభిస్తుంది. కళాశాలల్లో అన్ని సౌకర్యాలుంటేనే అనుమతులు ఇస్తారు. ఇందులో గుర్తింపు సిఫారసు చేయరు. ఒకచోట బోధన చేస్తున్న అధ్యాపకులు, మరోచోట పనిచేయడానికి వీల్లేదు. అనుమతి పొందిన వారే కళాశాలలు నిర్వహించాల్సి ఉంటుంది.

Updated Date - Apr 28 , 2024 | 12:31 AM