Share News

CM Revanth : కేసీఆర్‌.. కాళేశ్వరంలోనే చర్చ పెడదామా?

ABN , Publish Date - Apr 25 , 2024 | 04:52 AM

‘కాళేశ్వరం పోదాం... అక్కడే నీవు కట్టిన అద్భుతమేందో.. ఆ అద్భుతం తెలంగాణకు ఏ రకంగా ఉపయోగపడుతుందో చర్చ పెడదాం రా..’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌కు సవాల్‌ చేశారు. నిపుణులు,

CM Revanth : కేసీఆర్‌.. కాళేశ్వరంలోనే చర్చ పెడదామా?

మీరు కట్టిన ఆ అద్భుతమేంటో చూసి వద్దాం

కాంగ్రెస్‌ కట్టిన ప్రాజెక్టులెలా ఉన్నాయో చూద్దాం

అసెంబ్లీకి రారుగానీ.. టీవీలో 4 గంటలు సొల్లు

బీఆర్‌ఎస్‌కు ఎక్కడైనా డిపాజిట్‌ వస్తుందా?

రామప్ప శివుడు, సమ్మక్క, సారలమ్మ సాక్షిగా..

పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తా

హరీశ్‌.. రాజీనామా పత్రంతో సిద్ధంగా ఉండు

బిడ్డ బెయిల్‌ కోసం బీజేపీకి సికింద్రాబాద్‌ తాకట్టు

మతచిచ్చు పెట్టి గెలవాలని చూస్తున్న బీజేపీ

రాజ్యాంగంపై ప్రమాణం చేసి.. ప్రధాని పచ్చి అబద్ధాలు మాట్లాడడం మంచిదా?

ఒకరి ఆస్తిని మరొకరు ఎలా గుంజుకుంటారు?

హైదరాబాద్‌ అభివృద్ధిపై చర్చకు కిషన్‌రెడ్డి, కేటీఆర్‌ సిద్ధమా?: రేవంత్‌రెడ్డి

వరంగల్‌, సికింద్రాబాద్‌ సభల్లో సీఎం వ్యాఖ్యలు

వరంగల్‌/హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘కాళేశ్వరం పోదాం... అక్కడే నీవు కట్టిన అద్భుతమేందో.. ఆ అద్భుతం తెలంగాణకు ఏ రకంగా ఉపయోగపడుతుందో చర్చ పెడదాం రా..’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌కు సవాల్‌ చేశారు. నిపుణులు, మేధావులను కూడా వెంట తీసుకెళదామని, అందుకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలిందని, మేడిగడ్డ మేడిపండు అయిందని, సుందిళ్ల సున్నమైందని, అన్నారం ఆకాశంలో కలిసిందని, పదేళ్లు అవకాశమిస్తే ఆయన కట్టింది ఇదీ అని ఎద్దేవా చేశారు. ‘కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో, మీరు కట్టిన కాళేశ్వరం ఎలా ఉందో చూసొద్దాం రమ్మని’ సవాల్‌ చేశారు. బుధవారం హనుమకొండ జిల్లా మడికొండలో జరిగిన కాంగ్రెస్‌ జనజాతర సభలో, సికింద్రాబాద్‌ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా దానం నాగేందర్‌ నామినేషన్‌ దాఖలు సందర్భంగా కార్నర్‌ మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. మడికొండలో ఆయన మాట్లాడుతూ.. మామా అల్లుళ్లు కేసీఆర్‌, హరీశ్‌రావు తోకతెగిన బల్లుల్లా ఎగిరిపడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ అసెంబ్లీకి రారు గానీ.. టీవీ చానల్‌లో మాత్రం నాలుగు గంటలు సొల్లు చెప్పారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ఇప్పుడు చచ్చిన పాము లాంటిదని, ఆ పార్టీకి ఎక్కడా డిపాజిట్‌ వచ్చే పరిస్థితి లేదని అన్నారు. కేసీఆర్‌, నరేంద్రమోదీ తోడు దొంగలు అని, ఇద్దరూ తెలంగాణకు ద్రోహం చేశారని ఆరోపించారు. కేసీఆర్‌కు చెప్పినట్లే పార్లమెంట్‌ ఎన్నికల్లో మోదీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.


బీజేపీకి ఓటు అడిగే హక్కు ఉందా?

మోదీ ఇచ్చిన హమీలేమైనా అమలయ్యాయేమో బీజేపీ నేతలు చెప్పాలని సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రతి ఏటా 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ.. పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. పార్లమెంటులో తాను అడిగిన ప్రశ్నకు 7,21,680 ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారని, మిగతా ఉద్యోగాలు ఏవి? అని ప్రశ్నించారు. స్విస్‌ బ్యాంకులో నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో రూ.10 లక్షలు జమ చేస్తామని హామీ ఏమైందని నిలదీశారు. నల్లచట్టాలు తీసుకొచ్చి రైతుల ప్రయోజనాలను అంబానీ, అదానీలకు తాకట్టు పెడితే.. 16 నెలలు లక్షలాది మంది రైతులు సైనికుల్లా మోదీపై యుద్ధం ప్రకటించారని తెలిపారు. మోదీతో క్షమాపణలు చెప్పించిన చరిత్ర రైతులకు ఉందన్నారు. ఇలాంటి బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. చేనేత పరిశ్రపై జీఎ్‌సటీ వేసి చేనేత కార్మికులకు అన్యాయం చేశారని, చివరకు అగరుబత్తులపై కూడా జీఎ్‌సటీ వేశారని విమర్శించారు. ఇంతకంటే దుర్మార్గుడైన భక్తుడు దేశంలో ఎవరైనా ఉంటారా? అని మండిపడ్డారు. బీజేపికి మత పిచ్చి పట్టుకుందని, ప్రజల మధ్య, మతాల మద్య చిచ్చు పెట్టి ఎన్నికల్లో నెగ్గాలని ఆలోచిస్తోందని ఆరోపించారు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలని, దేవుడి పేరుతో రాజకీయం చేయొద్దని హితవు పలికారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న మాజీ మంత్రి హరీశ్‌రావు.. అందుకు సిద్ధంగా ఉండాలని రేవంత్‌రెడ్డి అన్నారు. రామప్ప శివుడు, వెయ్యి స్తంభాల గుడి, సమ్మక్క సారలమ్మల సాక్షిగా రైతులకు పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతానని ప్రకటించారు.


బిడ్డకు బెయిల్‌ కోసం బీజేపీకి తాకట్టు..

బీఆర్‌ఎ్‌సకు ఓటేస్తే మూసీలో వేసినట్లేనని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బిడ్డకు బెయిల్‌ కోసం సికింద్రాబాద్‌ సీటును బీజేపీకి కేసీఆర్‌ తాకట్టు పెట్టారని ఆరోపించారు. సికింద్రాబాద్‌ స్థానానికి దానం నాగేందర్‌ నామినేషన్‌ దాఖలు సందర్భంగా మహంకాళి ఆలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించి కార్నర్‌ మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీలో ఉన్న పద్మారావు మంచోడేనని, కానీ.. కేసీఆర్‌ను నమ్ముకుంటే ఆయన మునిగినట్లేనని అన్నారు. పద్మారావుకు ఓటేస్తే అది చీలిపోయి కిషన్‌రెడ్డికి లాభం జరుగుతుందని, ఆయన పరువు తీయడానికే కేసీఆర్‌ ఎన్నికల్లో నిలబెట్టారని వ్యాఖ్యానించారు. పద్మారావు నామినేషన్‌కు కేసీఆర్‌, కేటీఆర్‌ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. 2004లో అంజన్‌కుమార్‌ యాదవ్‌ సికింద్రాబాద్‌లో గెలిస్తే కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. మళ్లీ 20 ఏళ్ల తర్వాత ఆనాటి రోజులను పునరావృతం చేయడానికి దానం నాగేందర్‌ గెలుస్తారని, కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యత నిర్వహిస్తారని అన్నారు. ఆ బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. బీజేపీ నాయకులు గెలిచి కేంద్ర మంత్రులైనా.. హైదరాబాద్‌కు చేసిందేమిటని ప్రశ్నించారు. వరదలు వచ్చి హైదరాబాద్‌ అతలాకుతలమైతే కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి నగరానికి చిల్లి గవ్వ తేలేదని విమర్శించారు. హైదరాబాద్‌ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని కిషన్‌రెడ్డికి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్‌ చేశారు.


ప్రధానమంత్రి ఇలా మాట్లాడొచ్చా?

హిందువుల ఆస్తులను గుంజుకొని ముస్లింలకు పంచుతారంటూ ప్రధాని మోదీ మాట్లాడటంపై సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. తండ్రి ఆస్తి కొడుక్కి ఇవ్వాలన్నా సబ్‌ రిజిస్ర్టార్‌ ఆఫీసుకు పోయి రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలని, కానీ.. ఒకరి ఆస్తిని మరొకరు గుంజుకునే పరిస్థితి ఉంటుందా? అని ప్రశ్నించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ప్రధాని ఇలా పచ్చి అబద్ధాలు మాట్లాడటం మంచిదేనా? అని రేవంత్‌ అగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి నమ్మకం, విశ్వాసం వారివని, దేవుడిని బజారులోకి తీసుకొచ్చి, గోడల మీద రాసి.. డబ్బాలో ఓట్లు వేసుకోవడానికి మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మతచిచ్చు పెట్టి ఎన్నికల్లో నెగ్గాలని బీజేపీ చూస్తోందని, మత సామరస్యాన్ని తాము కాపాడుకుంటామని తెలిపారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు గద్వాల విజయలక్ష్మీ, రోహిన్‌రెడ్డి, కోట నీలిమ తదితరులతో కలిసి దానం నాగేందర్‌ ఎన్నికల అధికారికి నామినేషన్‌ పత్రాలను అందజేశారు.


కాంగ్రె్‌సలో చేరికల కోసం త్రిసభ్య కమిటీ

జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్‌ గౌడ్‌, కోదండరెడ్డిలతో ఏర్పాటు

లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలను మరింతగా ప్రోత్సహించేందుకు త్రిసభ్య కమిటీని గురువారం సీఎం రేవంత్‌ రెడ్డి ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ భావజాలం.. సిద్ధాంతం పట్ల నమ్మకం, అవగాహన ఉన్న నేతలను పార్టీలో చేర్చుకునేందుకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్‌, కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డిలతో కమిటీ ఏర్పాటైంది. ఇటీవల ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు పార్టీలో చేరికలను వేగవంతం చేయాలని సూచించారు. ఆయన సూచన మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఈ కమిటీని నియమించారు.


కాంగ్రెస్‌ గూటికి ఎల్లారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్‌ బీఆర్‌ఎస్‌ చైర్మన్‌ కుడుముల సత్యనారాయణ బుధవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజనర్సింహ ఆధ్వర్యంలో మున్సిపల్‌ చైర్మన్‌ సత్యనారాయణ కాంగ్రెస్‌ గూటికి వెళ్లారు. ఈ సందర్భంగా చైర్మన్‌కు మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే చైర్మన్‌ కాంగ్రె్‌సలో చేరడాన్ని నిరసిస్తూ 10 మంది బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టారు. ఎల్లారెడ్డి మున్సిపల్‌ పరిధిలో మొత్తం 12 మంది కౌన్సిలర్లు ఉండగా ఇందులో బీఆర్‌ఎస్‌ నుంచి 10 మంది, కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఒక్కరు ఉన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 04:56 AM