Share News

భయం.. భయం

ABN , Publish Date - Apr 20 , 2024 | 11:27 PM

ఏటా గోదావరి వరద ముం పునకు గురవుతున్న ములుగు జిల్లా ఏటూరునాగారం, మంగపేట మండలాల్లోని తీర గ్రామాలకు రక్షణగోడ నిర్మించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పాలకుల పట్టింపులేని తనానికి.. కాంట్రాక్టు కంపెనీ నిర్లక్ష్యం తోడవ్వడంతో ఈసారి కూడా ముంపు ప్రమాదం పొంచి ఉంది. నిధుల కేటాయింపు, భూసేకరణ లాంటి పలు అవరోధాలను అధిగమించినా పనులు మొదల వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భయం.. భయం
గోదావరి ముంపునకు గురైన ఏటూరునాగారం (ఫైల్‌), మంగపేట పుష్కరఘాట్‌ వద్ద గోదావరి ప్రవాహ ధాటికి కోతకు గురైన ఒడ్డు (ఫైల్‌)

కరకట్ట నిర్మాణంలో ప్రభుత్వ నిర్లక్ష్యం

రెండేళ్ల క్రితం పూర్తయిన టెండర్లు

27.891 కిలోమీటర్లకు రూ.114.17 కోట్లు అగ్రిమెంటు

పనుల నిర్వహణలో జాప్యం

పలుచోట్ల బలహీనంగా కరకట్ట

ఏటూరునాగారం, మంగపేట మండలాలకు పొంచి ఉన్న ముప్పు

ఏటేటా కోతకు గురవుతున్న తీర భూములు

అమలుకాని గత సర్కారు పునరావాస హామీ

ములుగు, ఏప్రిల్‌ 20: ఏటా గోదావరి వరద ముం పునకు గురవుతున్న ములుగు జిల్లా ఏటూరునాగారం, మంగపేట మండలాల్లోని తీర గ్రామాలకు రక్షణగోడ నిర్మించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పాలకుల పట్టింపులేని తనానికి.. కాంట్రాక్టు కంపెనీ నిర్లక్ష్యం తోడవ్వడంతో ఈసారి కూడా ముంపు ప్రమాదం పొంచి ఉంది. నిధుల కేటాయింపు, భూసేకరణ లాంటి పలు అవరోధాలను అధిగమించినా పనులు మొదల వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామ న్నగూడెం, రాంనగర్‌, పొదుమూరు, అకినేపల్లి మల్లా రం, కత్తిగూడెం, చుంచుపల్లి వద్ద తీరం కోతకు గురవు తోంది. ప్రతీ వర్షాకాలంలో ఉగ్రరూపందాల్చే గోదావరి ఏటా వందల ఎకరాల భూములను తనలో కలుపుకుం టోంది. దీంతో తీర గ్రామాల ప్రజలు భయంతో వణు కుతున్నారు. 37ఏళ్లక్రితం వచ్చిన వరదలకు ఈరెండు మండలాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. హైదరాబాద్‌ రాష్ట్రంగా ఉన్న సమయంలో 1948 సెప్టెంబరులో వరదలకు ఏటూరునాగారం ప్రాంతం ముంపునకు గురైంది. తర్వాత 1986ఆగస్టులో, 1991, 2020, 2022 సంవత్సరాల్లో తీర గ్రామాలు మునిగిపోయాయి. రెండేళ్లక్రితం గోదావరికి వచ్చిన వరదలు చరిత్రలో నిలిచిపోయాయి. అత్యధికంగా 29లక్షల క్యూసెక్కుల వరద ప్రవహించడంతో ముంపు గ్రామాలు తుడిచిపె ట్టుకుపోతాయేమోననే ఆందోళన చెందారు. కానీ, రెండురోజుల తర్వాత వరద తగుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు పది రోజులు వేలాది మంది ప్రజలు పునరావాస కేంద్రాలలో తలదా చుకున్నారు. మంగపేట మండలకేంద్రంలోని పొదు మూరు కాలనీకి సమీపంలోని పుష్కరఘాట్‌ వద్ద గోదావరి ఒడ్డు భారీగా కోతకు గురవుతోంది. 2015లో జరిగి న పుష్కరాల సందర్భంగా ఇక్కడ నిర్మించిన స్నానఘట్టాలు, ఇతర నిర్మాణాలు నదిలో కలిసిపోయా యి. సుమారు 800మీటర్ల వరకు నది గ్రామంవైపుకు చొచ్చుకు వచ్చింది. తీరంవెంట రైతులు సాగుచేసుకుం టున్న పంటభూములు నదిలో కలిసిపోయాయి. 2022లో వచ్చిన వరదలకు రామన్నగూడెం వద్ద బుం గ పడింది. అయితే కొద్ది గంట ల వ్యవధిలో వరద తగ్గుముఖం పట్టడంతో ఈ గ్రామం ఉనికి ఇంకా మిగిలి ఉంది.

రక్షణ గోడతో ఊరట

2007లో అప్పటి రాష్ట్రప్రభుత్వం రాంనగర్‌-మంగపే ట మధ్య రూ.46.44కోట్ల వ్యయంతో రివిట్‌మెంట్‌, లాం చింగ్‌ ఆఫ్రాన్‌లతో కరకట్టను నిర్మించింది. ఎస్‌ఈ డబ్ల్యూ కన్‌స్ట్రక్షన్స్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో 68శాతం పనులు జరిగాయి. భూసేకరణ సమస్య ఎదురవ్వడం తో 2009 సెప్టెంబర్‌లో సదరు కంపెనీ కరకట్ట పనుల ను నిలిపివేసింది. మొత్తం 186 ఎకరాలకు (48ఎకరాల పట్టాభూమి, 138ఎకరాలు అసైన్డ్‌ భూమి) గాను పట్టా భూమికే నష్టపరిహారం చెల్లించారు. మిగిలిన పనులకో సం 2017లో సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ సీఈ, క్యూసీ సీఈల బృందం క్షేత్రపరిశీలన జరిపి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అప్పగించింది. అయితే పాత కాంట్రాక్టు కంపెనీతో చేసుకున్న అగ్రిమెంట్‌ను రద్దుచేసే విషయం లో దాటవేత ధోరణిని కొనసాగించింది. ఐదేళ్ల నిరీక్షణ తర్వాత 2022లో రూ.137.23కోట్లు మంజూరుచేస్తూ పరిపాలనా అనుమతులు జారీ అయ్యాయి. టెండర్లు నిర్వహించగా హర్ష కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, హెచ్‌ఈఎస్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలు ఉమ్మడిగా 3.99శాతం అధికానికి టెండర్లు దక్కించు కున్నాయి. మొత్తం రూ.114.17కోట్లకు అగ్రిమెంటు పూర్తయ్యింది. మంగపేట, ఏటూరునాగారం మండలా ల్లో కలిపి 27.891కిలోమీటర్ల పొడవునా కరకట్టను నిర్మించాల్సి ఉంది. రామన్నగూడెం వద్ద 10.916కిలోమీ టర్లు, రాంనగర్‌ వద్ద 6.05కిలోమీటర్లు, మంగపేట వద్ద 5.32కిలోమీటర్లు, చుంచుపల్లి వద్ద 2.1, కత్తిగూడెం వద్ద 1.80, అకినేపల్లి మల్లారం వద్ద 1.7కిలోమీటర్ల పొడవునా కట్టను నిర్మించనున్నారు. పూర్తిగా రాతి తెట్టతో గోడను కట్టాలి. కాగా, ఏటూరునాగారానికి గోదావరి బ్యాక్‌ వాటర్‌తో ఏర్పడుతున్న ముప్పును అరికట్టేందుకు జంపన్నవాగుపై కూడా కరకట్ట నిర్మించేలా డిజైన్‌ రూపొందించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది.

- పనులు మొదలవ్వవు.. పునరావాసం దక్కదు..

కరకట్ట నిర్మాణానికి రెండేళ్లక్రితం కాంట్రాక్టు కంపెనీతో అగ్రిమెంట్‌ పూర్తయినా పనులు మొదలుకాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నదిలో ప్రవాహం తక్కువ ఉన్నప్పుడే నిర్మాణానికి అనుకూలం. శీతాకాలం, వేసవిలోనే వేగంగా పనులు జరగాల్సి ఉంది. కానీ, కాంట్రాక్టు కంపెనీ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో ముందుకు సాగడంలేదు. రామన్నగూడెం వద్ద ఏర్పడ్డ బుంగకు తాత్కాలిక మరమ్మతులు చేయడం వరకే పరిమితమయ్యారు. పలుచోట్ల చిన్నచిన్న రివిట్‌వెంట్‌, వట్టి పనులను సబ్‌ కాంట్రాక్టర్లతో చేయించి చేతులు దులపుకొన్నారు. రాష్ట్రమంత్రి సీతక్క ఆదేశాలతో ఇటీవల ములుగు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి నీటిపారుదల, రెవెన్యూ అధికారులతో కలిసి గోదావరి తీరాన్ని సందర్శించారు. కరకట్ట నిర్మించాల్సిన ప్రదేశాలను పరిశీలించారు. కాగా, 2022జూలైలో వరద ముంపుకు గురైన తీర గ్రామాలలో అప్పటి సీఎం కేసీఆర్‌ పర్యటించారు. పప్కాపురం గ్రామాభివృద్ధికి రూ.50లక్షల సాయం ప్రకటిండంతోపాటు ముంపు గ్రామాల ప్రజలకు ఎత్తైన ప్రదేశంలో పునరావాస కాలనీని నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే ఈ పప్కాపురం గ్రామం 1986వరదల అనంతరం ఏర్పాటైన పునరావాస కాలనీ కావడం గమనార్హం. రామన్నగూడానికి చెందిన ముంపు బాధితులైన ఎస్టీ, ఎస్టీలకు అప్పటి రాష్ట్రప్రభుత్వం ఐటీడీఏ ద్వారా ఇళ్లు కట్టించి ఇచ్చింది. మిగతా సామాజికవర్గాలవారు కూడా గ్రామం వదిలి వెళ్లేందుకు సిద్ధమైనా వారికి అవకాశం కల్పించకపోవడంతో అక్కడే ఉండిపోయారు. రామన్నగూడెం, ఏటూరునాగారం టౌన్‌ మినహా మిగతా ప్రాంతమంతా 1/70చట్టం పరిధిలోకి వస్తుంది. అక్కడ ఏనిర్మాణం చేయాలన్నా అటవీశాఖ అనుమతులు తప్పనిసరి. ఈ క్రమంలో పునరావాసం ఎలా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రభుత్వమైనా స్పందించి కరకట్ట నిర్మాణ పనులు వేగవంతంగా జరిపించడంతోపాటు పునరావాస చర్యలను ముమ్మరం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Apr 20 , 2024 | 11:27 PM