Share News

క్షీరం.. క్షేమమేనా?

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:50 PM

అనేక రకాల పోషకాలు లభిస్తాయనే నమ్మకం తో అందరూ పాలు తాగుతారు. ముఖ్యంగా పిల్లలు, అనారోగ్యం బారిన పడినవారు, బలహీనంగా ఉన్నవారు పాలు తాగితే ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు సూచిస్తుంటారు. కానీ పాలు సైతం విషతుల్యమవుతున్నాయనేది చేదునిజం. అధిక పాల ఉత్సత్తి కోసం పాడి పశువుల డెయిరీలను నిర్వహిం చే వారు అడ్డదారులు తొక్కుతున్నారు.

క్షీరం.. క్షేమమేనా?
బీరు వ్యర్థాలు కలిపిన కుడితిని తాగుతున్న ఆవులు

విషతుల్యమవుతున్న పాలు

అధిక ఉత్పత్తి కోసం డెయిరీల అడ్డదారులు

పాడి పశువులకు అక్సిటోసిన్‌ ఇంజక్షన్లు

బీరు వ్యర్థాలు తాగిస్తున్న వైనం

జీవాల జీవిత కాలాన్ని హరిస్తున్న పోషకులు

బచ్చన్నపేట, ఏప్రిల్‌ 19 : అనేక రకాల పోషకాలు లభిస్తాయనే నమ్మకం తో అందరూ పాలు తాగుతారు. ముఖ్యంగా పిల్లలు, అనారోగ్యం బారిన పడినవారు, బలహీనంగా ఉన్నవారు పాలు తాగితే ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు సూచిస్తుంటారు. కానీ పాలు సైతం విషతుల్యమవుతున్నాయనేది చేదునిజం. అధిక పాల ఉత్సత్తి కోసం పాడి పశువుల డెయిరీలను నిర్వహిం చే వారు అడ్డదారులు తొక్కుతున్నారు. అత్యాశతో అధిక పాల ఉత్పత్తి కోసమంటూ పశువులకు ఇంజక్షన్‌లు చేయిస్తున్నారు. గ్రామాల్లో గాలికుంటు వ్యాధి బారిన పడితేనే రైతులు పది రోజుల పాటు పశువులకు పాలుపిండి పారబోస్తారు. అట్లాంటిది అధిక పాలకోసం హర్మోన్‌ ఇంజక్షన్‌లు ఇస్తూ విషతుల్యమవుతున్న పాల ఉత్పత్తికి తెరలేపుతున్నారు డెయిరీ నిర్వాహకులు. పాలల్లో వెన్నశాతంలో తేడాలు చూపేందుకు ఉప్పు, యూరియా లాంటివి మిళితం చేస్తున్నారు. ప్రజారోగ్యానికి ముప్పు అని తెలిసినా తమ స్వార్థానికి, లాభార్జన కోసం అడ్డదారుల్లో వెళుతున్నారు. పెంపకందారుల అత్యాశ పాడి పశువులకు ప్రాణంతకంగా పరిణమిస్తోంది. రెట్టింపు పాల కోసం గేదెలకు, పాడి ఆవులకు అక్సిటోసిన్‌ ఇంజక్షన్‌లు ఇప్పించటంతో పాటు, ఈ మధ్య కాలంలో బీరు వ్యర్థ ద్రావకాలను ట్యాంకర్ల ద్వారా తెప్పించుకుని మరీ పాడి పశువులకు తాగిస్తున్నారు. బీరు వ్యర్థాన్ని తాగించి మూగజీవుల జీవిత కాలాన్ని హరించి వేస్తున్నారు. వాటి పునరోత్పత్తి సామర్థ్యం కోల్పోయేలా చేస్తున్నారు. ఇంజక్షన్‌లతో పాటు, వ్యర్థాలు సేవించిన పశువుల పాలు తాగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని వైద్య వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

పశువులకు బీరు వ్యర్థాలు..

బీరు పరిశ్రమలోని వ్యర్థ పదార్థమైన గోధుమ పిప్పి(స్పెంట్‌మాల్ట్‌)ను పాడి పశువులకు దాణాగా ఉపయోగించి అధిక పాల ఉత్పత్తిని సాధించవచ్చని కొందరు వ్యాపారులు రైతుల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మాయలో పడిన కొందరు రైతులు తమ జీవనాధారమైన పశువులకు విషపు దాణా పెడుతున్నారు. పాలు ఎక్కువ ఇస్తాయని ఆశపడి బీరు తయారీలో మిగిలే వ్యర్ధమైన పొడిని తినిపించి తమకు తామే నష్టం కలుగజేసుకుంటున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న దళారులు కాసులు పండించుకుంటున్నారు. 40 కిలోల బరువున్న బీరు పొడిని రూ.550 నుంచి రూ. 650లకు పాడి రైతులకు అమ్ముతున్నారు. ఫ్యాక్టరీల నుంచి వెలువడే వ్యర్థ పదార్థాలను బయటకు తీసుకెళ్లి పడేయాల్సిందిపోయి దాన్ని ఇలా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అలాగే బీరు తయారీ అనంతరం వెలువడే వేస్ట్‌ లిక్విడ్‌ను వ్యాపారులు ట్యాంకర్ల ద్వారా రైతులకు చేరవేస్తున్నారు. లిక్విడ్‌ను రైతులు కుడితిలో పోసి పశువులకు తాగిస్తున్నారు.

వ్యర్థాలు ప్రమాదకరం..

బీరు వ్యర్థద్రావకం నిల్వల్లో ప్రాణాంతక సూక్ష్మజీవులు చేరుతాయని, కంటికి కనిపించని ఫంగస్‌ తయారై పశువు కడుపులోకి చేరి జీర్ణ వ్యవస్థపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తుందని పశువైద్యాధికారులు చెబుతున్నారు. ఈ మత్తు పదార్థం తాగటం వల్ల తాత్కాలికంగా పాలు ఎక్కువగా ఇచ్చినా.. ఉత్పత్తి కూడా అంతే త్వరగా తగ్గిపోతుందని చెబుతున్నారు. అసాధారణంగా అధిక పాలను ఇవ్వటం వల్ల తన శరీరంలోని శక్తిని గేదె గానీ, ఆవుగానీ త్వరగా కోల్పోయి పునరుత్పత్తి సామర్థ్యం కూడా తగ్తిపోతుందంటున్నారు. 15 నుంచి 16 సంవత్సరాలు జీవించాల్సిన పాడి పశువులు కేవటం 7 నుంచి 8 ఏళ్లకే మరణిస్తాయని చెబుతున్నారు. పైగా బీరునీరు తాగిన పశువుల నుంచి వచ్చే పేడ, మూత్రం తీవ్ర దుర్వాసనగా ఉండటమే కాకుండా పరిసరాలు కాలుష్యమవుతాయని హెచ్చరిస్తున్నారు. అధిక పాల కోసం బీరు వ్యర్థాలను తాగిస్తే కొన్ని నెలల పాటు అధికంగా పాలిచ్చినా తొందరగా బక్కచిక్కిపోయి మృత్యువాత పడుతున్నాయని పశువైద్యులు హెచ్చరిస్తున్నారు.

- ఇతర మార్గాల అన్వేషణ సరికాదు..

రామారావు, పశువైద్యాధికారి, పడమటికేశ్వాపూర్‌

పాలకు సంపూర్ణ ఆహారంగా పేరుంది. అధిక పాల కోసమంటూ బీరు వ్యర్థాలు, ఇంజక్షన్‌లు ఇప్పించడం, ఇతర మార్గాలు అన్వేషించడం సరికాదు. ఏదైనా మోతాదుకు మించితే ప్రమాదమే. ముఖ్యంగా రసాయనాలు పశువు జీవిత కాలాన్ని, పునరుత్పత్తి సామర్థ్యాన్ని హరించి వేస్తాయి. పాలు తాగిన వారికి సైతం సైడ్‌ ఆరోగ్య సమస్యలు వస్తాయి. డెయిరీ నిర్వాహకులకు తాము బీరు వ్యర్థాలు, హార్మోన్‌ ఇంజక్షన్‌లు వేయించటం మంచిది కాదని వారికి అవగాహన కల్పిస్తున్నాం.

Updated Date - Apr 19 , 2024 | 11:50 PM