Share News

రైతులను ముంచిన వాన

ABN , Publish Date - Apr 20 , 2024 | 11:21 PM

జిల్లాలో అకాల వర్షం అన్నదాతను ఆగమాగం చేసింది. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పలు ప్రాంతాల్లో స్వల్ప నుంచి మోస్తరు వానలు కురిశాయి. బలమైన ఈదురుగాలులకు తోడు ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. పలు చోట్ల పిడుగులు పడ్డాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా జిల్లాలో ఆయా ప్రాంతాల్లో చేలల్లో వరి పంటలు నేలకొరిగాయి.

రైతులను ముంచిన వాన
జఫర్‌గడ్‌ మండలం ఉప్పుగల్లులో నేలకొరిగిన వరి పంట

జిల్లాలో పలుచోట్ల మోస్తరు వర్షం

ఈదురుగాలుల ధాటికి నేలకొరిగిన వరి

కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం

పలుచోట్ల పిడుగుపాట్లు

జిల్లాలో సగటు వర్షపాతం 8.77మి.మీ.

జనగామ, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అకాల వర్షం అన్నదాతను ఆగమాగం చేసింది. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పలు ప్రాంతాల్లో స్వల్ప నుంచి మోస్తరు వానలు కురిశాయి. బలమైన ఈదురుగాలులకు తోడు ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. పలు చోట్ల పిడుగులు పడ్డాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా జిల్లాలో ఆయా ప్రాంతాల్లో చేలల్లో వరి పంటలు నేలకొరిగాయి. నేడో, రేపో కోతకు వచ్చిన పంట ఈదురుగాలులతో నేలకొరగడంతో అన్నదాతకు తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారు గంటకు పైగా కురిసిన వానతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. పిడుగుపాటు కారణంగా విద్యుత్‌ స్తంభాలపై ఇన్స్యులేటర్లు ధ్వంసం కావడంతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

తడిసిన ధాన్యం.. నేలకొరిగిన వరి

అకాల వర్షం కారణంగా జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. చాలా వరకు కొనుగోలు కేంద్రాలను లోతట్టు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడంతో వర్షపు నీరు నిలిచింది. గత ఏడాది చాలా సెంటర్లలో వర్షపు నీరు నిలవడం వల్ల వడ్ల కుప్పలు మునిగిపోయాయి. కొన్చిచోట్ల కొట్టుకుపోయాయి. ఈ సారి కూడా లోతట్టు ప్రాంతాల్లో సెంటర్లను తెరవడంతో చిన్నపాటి వర్షానికే నీరు నిలిచింది. వడ్లకుప్పల కింది నుంచి నీరు ప్రవహించి ధాన్యం తడిసిపోయింది. ఇవ్వాలో, రేపో కాంటా అవుతుందనుకుంటున్న సమయంలో వర్షం పడి తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతున్నారు. కాగా.. ఈదురుగాలుల ప్రభావంతో పలు చోట్ల వరి పంట నేలకొరిగింది. పలు గ్రామాల్లో మామిడికాయలు రాలిపోయాయి.

విద్యుత్‌కు అంతరాయం..

జిల్లాలో వర్షం సమయంలో పలు చోట్ల పిడుగులు పడ్డాయి. జఫర్‌గడ్‌ మండలంలో ఎక్కువగా పిడుగులు పడ్డాయి. కూనూరు, ఉప్పుగల్లు, తిమ్మంపేట గ్రామాల్లో వర్షం ఎక్కువగా పడింది. కూనూరులో ఓ సెల్‌టవర్‌ జనరేటర్‌పై పిడుగు పడడంతో మంటలు లేచాయి. తిమ్మంపేటలో తాటిచెట్టుపై, ఉప్పుగల్లులో ఆకేరు వాగులో పిడుగులు పడ్డాయి. పిడుగుల కారణంగా 33కేవీ విద్యుత్‌ స్తంభాలపై ఉన్న ఇన్స్యులేటర్లు ధ్వంసం అయ్యాయి. ఉప్పుగల్లులో ఈదురుగాలులతో కరెంట్‌ తీగలపై చెట్టు కూలడంతో ఐదు స్తంభాలు నేలకొరిగాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చిలుపూర్‌లో పిడుగుపాటుకు ఓ ఇంట్లోని ఫ్రిడ్జ్‌ ధ్వంసమైంది.

నర్మెటలో 49.5 మి.మీ వర్షపాతం

జిల్లా వ్యాప్తంగా శనివారం 8.77మి.మీ. వర్షపాతం నమోదు కాగా జఫర్‌ఘడ్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌, నర్మెట, త రిగొప్పుల మండలాల్లో వర్షం దంచికొట్టింది. జనగామ, బచ్చన్నపేట, దేవరుప్పుల, లింగాలఘణపురం, చిలు పూర్‌ మండలాల్లో స్వల్ప వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో స్వల్ప వర్షంతో మబ్బు పట్టింది. అత్యధికంగా నర్మెట మండలంలో 49.5 మి.మీ, జఫర్‌గడ్‌ మండ లం కూనూరులో 45 మి.మీ, స్టేషన్‌ఘన్‌పూర్‌ మండ లం తాటికొండలో 40.8 మి.మీ, తరిగొప్పులలో 27.8 మి.మీ, దేవరుప్పుల మండలం కోలుకొండలో 6.3 మి.మీ, లింగాలఘణపురంలో 4.8 మి.మీ, జఫర్‌గడ్‌లో 1.3 మి.మీ వర్షం కురిసింది.

Updated Date - Apr 20 , 2024 | 11:21 PM