Share News

తోటలు ఏవీ..?

ABN , Publish Date - Apr 24 , 2024 | 12:24 AM

గిరిజనులకు పెద్ద దిక్కుగా ఉన్న ఐటీడీఏ క్రమేపీ తన అస్తిత్వాన్ని కోల్పోతోందా..? అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు ఏర్పడిన ఐటీడీఏ లక్ష్యానికి దూరంగా వెళ్తుందనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. 32 శాఖల ద్వారా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని గిరిజనుల బతుకులు మార్చేందుకు ఐటీడీఏకు అంకురార్పణ జరగ్గా క్రమేణా కొన్ని శాఖలు పూర్తిగా కనుమరుగయ్యాయి.

తోటలు ఏవీ..?
ఎక్కెలలో ఖాళీగా దర్శనమిస్తున్న ఉద్యానవన భూములు

ఉద్యాన పంటలపై పట్టింపులేని ఐటీడీఏ

గాడితప్పిన హార్టికల్చర్‌

పండ్ల తోటల సాగుపై దృష్టిసారించని అధికారులు

స్వయం ఉపాధి కోల్పోతున్న గిరిజనులు

ఏటూరునాగారం రూరల్‌, ఏప్రిల్‌ 23: గిరిజనులకు పెద్ద దిక్కుగా ఉన్న ఐటీడీఏ క్రమేపీ తన అస్తిత్వాన్ని కోల్పోతోందా..? అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు ఏర్పడిన ఐటీడీఏ లక్ష్యానికి దూరంగా వెళ్తుందనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. 32 శాఖల ద్వారా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని గిరిజనుల బతుకులు మార్చేందుకు ఐటీడీఏకు అంకురార్పణ జరగ్గా క్రమేణా కొన్ని శాఖలు పూర్తిగా కనుమరుగయ్యాయి. మరికొన్ని నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ప్రభుత్వాల చిన్నచూపు ఐటీడీఏకు శాపం కాగా.. వనరులు ఉన్నా అధికారుల్లో చిత్తశుద్ధి లోపించడంతో గిరిజనులు స్వయం ఉపాధికి దూరమవుతున్నారు. వందలాది ఎకరాల్లో భూములున్నప్పటికీ ఉద్యాన శాఖ కుంటుపడుతోంది. ఉద్యాన పంటలతో ఆర్థిక స్వావలంబన సాధించుకోవాలనుకుంటున్న రైతుల ఆశలు నీరుగారుతున్నాయి. ఐటీడీఏలోని ఉద్యాన శాఖ(హార్టికల్చర్‌)పై ఐటీడీఏ అధికారుల చిన్నచూపుతో ఆ శాఖ క్రమేణా కనుమరుగవుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భూములు ఉన్నప్పటికీ గిరిజనుల ఉపాధి కల్పనకు ఊతమిచ్చే పండ్ల తోటల పెంపకంపై ఆ శాఖ దృష్టి పెట్టడం లేదు. నిధులలేమి సాకుతో ఆ శాఖకు ఉన్న భూములను గాలికొదిలేశారు. మూడేళ్లుగా ఆ శాఖకు ఉన్న భూములన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. గిరిజన రైతులకు భూములను లీజుకిస్తే ఆ భూముల్లో పండ్ల తోటల పెంపకానికి గిరిజనులు ముందుకొచ్చేవారని పలువురు తెలుపున్నారు. పండ్ల తోటల పెంపకంపై ఐటీడీఏ దృష్టిపెడితే గిరిజనులకు ఎంతో లబ్ధిచేకూరుతుందని గిరిజనులు అంటున్నారు.

భూములున్నా.. ఫలితం శూన్యం

హార్టికల్చర్‌ శాఖ పరిధిలో భూములున్నప్పటికీ ఫలితం మాత్రం శూన్యంగా కనిపిస్తోంది. ఏటూరునాగారంలోని ఎక్కెలలో సుమారు 20 ఎకరాలు, రామన్నగూడెం వైపు వెళ్లే రహదారికి ఆనుకుని సుమారు ఆరెకరాల హార్టికల్చర్‌ భూములున్నాయి. ప్రస్తుతానికి ఆ భూములన్నీ ఖాళీగానే ఉన్నాయి. మండలకేంద్రంలోని వారే కాకుండా ఐటీడీఏ పరిధిలోని ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి ఏ ప్రాంతానికి చెందిన గిరిజనులకైనా ఇక్కడికి వచ్చి ఉద్యాన పంటలు పండించి ఉపాధి పొందే అవకాశం ఉంది. అయితే అధికారులు ఆ దిశగా గిరిజన రైతులను ప్రోత్సహించడం లేదు. ఐటీడీఏ కార్యాలయానికి సమీప దూరంలోనే సుమారు 25 ఎకరాల భూములున్నా అవి నిరుపయోగంగా మారాయి. ఆ భూముల గురించి పట్టించుకునే వారే కరువయ్యాడు. ఆ భూములన్నీంటినీ గిరిజన రైతులకు లీజుకిచ్చి తోటల పెంపకాన్ని చేపడితే గిరిజనులకు ఉపాధి అవకాశాలతో పాటు ఆర్థిక వెసులుబాటు దొరుకుతుంది. గిరిజన రైతులకు లీజుకిచ్చి ప్రోత్సాహకాలు అందించకున్నా ఆ భూములను వారికి లీజుకు ఇస్తే వారు సాగు చేసుకునే అవకాశం ఉంది. కానీ అధికారులు ఆ దిశగా ఆలోచన చేయకపోగా భూములను ఖాళీగా ఉంచడానికి మొగ్గు చూపుతున్నారు. భూములను బహిరంగ ప్రకటన ద్వారా లీజుకిస్తే రైతులు పూలు, పండ్లు, కూరగాయాలు సాగు తదితర పనులు చేపడితే ఎంతో ప్రయోజకరంగా ఉంటుందనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. భూములు కొంతమేర అన్యాక్రాంతమవుతున్నా అధికారులు దృష్టి పెట్టడం లేదని పలువురు గిరిజనులు ఆరోపిస్తున్నారు.

అధికారుల్లో కొరవడిన ముందుచూపు

ఉద్యాన శాఖపై అధికారులు దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు గిరిజనులు వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి అనుసంధానంగా గిరిజనులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే శాఖపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి, వాణిజ్య పంటలకు అనుకూలంగా లేని పోడుభూముల్లో ప్రభుత్వం చొరవ చూపి ఐటీడీఏ ద్వారా గిరిజన రైతులకు అవగాహన కల్పించి వారి భూముల్లో డ్రిప్‌ను సబ్సిడీపై కల్పించి బత్తాయి, దానిమ్మ, అరటి, మామిడి, కూరగాయాల సాగు, సపోటా తదితర ఉద్యానవన పంటల సాగుకు గిరిజనులకు తోడ్పాటునందిస్తే వారి ఆర్థిక స్వావలంభనకు అడుగులు వేసినట్లు అవుతుంది. ఏజెన్సీ గ్రామాల్లో నీటి వసతులు, ఇతర వనరులు పుష్కలంగా ఉన్న గిరిజన రైతులకు అనుకున్న స్థాయిలో ఫలితాలు లభించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఖాళీగా ఉన్నతాధికారుల పోస్టులు

ఉద్యాన శాఖలో ప్రాజెక్ట్‌ హార్టికల్చర్‌ అఽధికారి(పీహెచ్‌వో)తోపాటు ఇతర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏడు నెలలుగా పీహెచ్‌వో పోస్టు ఖాళీగా ఉంది. కొన్నినెలల క్రితం హార్టికల్చర్‌ అధికారి పోస్టు సైతం ఖాళీ కాగ ఇప్పటి వరకు భర్తీ చేయలేదు. హార్టికల్చర్‌ శాఖను గాడిన పెట్టాల్సిన అధికార యంత్రాంగం ఆ దిశగా ఆలోచనలు చేయకపోవడంతో ఆ శాఖ నీలినీడలు కమ్ముకున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వంతోపాటు ఐటీడీఏ యంత్రాంగం చొరవ చూపి ఉద్యానవన పంటల సాగుకు సహకరించాలని పలువురు గిరిజనులు కోరుకుంటున్నారు.

Updated Date - Apr 24 , 2024 | 12:24 AM