ఒకే విమానంలో ప్రయాణించిన ఏడుగురికి కరోనా సోకడంతో..

ABN , First Publish Date - 2020-09-01T04:13:25+05:30 IST

గ్రీస్ నుంచి వేల్స్‌కు ప్రయాణించిన విమానంలో ఏడుగురు ప్యాసెంజర్స్‌కు కరోనా సోకడంతో

ఒకే విమానంలో ప్రయాణించిన ఏడుగురికి కరోనా సోకడంతో..

కార్డిఫ్: గ్రీస్ నుంచి వేల్స్‌కు ప్రయాణించిన విమానంలో ఏడుగురు ప్యాసెంజర్స్‌కు కరోనా సోకడంతో మిగతా వారు సెల్ఫ్ ఐసోలేషన్‌కు వెళ్లాల్సిందిగా వేల్స్ ప్రభుత్వం సూచించింది. టీయూఐ ఫ్లైట్ 6215 ఆగస్టు 25న గ్రీస్‌లోని జాంటీ నుంచి వేల్స్‌లోని కార్డిఫ్‌కు వెళ్లింది. ఈ విమానంలో 193 మంది ప్యాసెంజర్లు, సిబ్బంది ప్రయాణించారు. అయితే ఇదే విమానంలో ప్రయాణించిన ఏడుగురు ప్యాసెంజర్లకు తాజాగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో విమాన యాజమాన్యం అప్రమత్తమై విమానంలో ప్రయాణించిన సిబ్బందిని కూడా సెల్ఫ్ ఐసోలేషన్‌కు పంపింది. విమానంలో చాలా మంది కరోనా నిబంధనలను పాటించకుండా.. స్వార్థపూరితంగా ప్రవర్తించారని స్టీఫనీ విట్‌ఫీల్డ్ అనే ప్రయాణికురాలు తెలిపింది. స్టీఫనీ తెలిపిన వివరాల ప్రకారం దర్యాప్తు చేస్తామని టీయూఐ విమాన సంస్థ ప్రకటించింది. తాము అన్ని రకాల నిబంధనలను పాటిస్తున్నామని.. తమ సిబ్బందికి కూడా అన్ని రకాల శిక్షణ ఇచ్చినట్టు చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు ఈ ఘటనకు సంబంధించి ఏ ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని.. స్టీఫనీ ఫిర్యాదుతో తాము దర్యాప్తు ప్రారంభించినట్టు సంస్థ తెలిపింది. విమానంలో కేవలం తినే, తాగే సమయంలో మాత్రమే మాస్క్ తొలగించాలనే నిబంధన ఉందని సంస్థ పేర్కొంది. విమానంలో కరోనా నిబంధనలు పాటించని వారిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పింది.

Updated Date - 2020-09-01T04:13:25+05:30 IST