జీవీకే టేకాఫ్‌.. అదానీ ల్యాండింగ్‌

ABN , First Publish Date - 2020-09-01T06:44:40+05:30 IST

దేశంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ.. ఎట్టకేలకు ముంబై విమానాశ్రయాన్ని చేజిక్కించుకోబోతున్నారు. ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌(ఎంఐఏఎల్‌)లో జీవీకే ఎయిర్‌పోర్ట్‌ డెవలపర్స్‌ లిమిటెడ్‌కు చెందిన 50.50 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు అదానీ గ్రూప్‌ సోమవారం ప్రకటించింది...

జీవీకే టేకాఫ్‌..  అదానీ ల్యాండింగ్‌

  • చేతులు మారుతున్న ముంబై ఎయిర్‌పోర్ట్‌ 
  • విమానాశ్రయంలో 74శాతం వాటా అదానీ చేతికి
  • జీవీకేకు చెందిన 50.5శాతం వాటాతోపాటు.. 
  • ఏసీఎ్‌సఏ, బిడ్‌వెస్ట్‌ నుంచి 23.5శాతం కొనుగోలు 


న్యూఢిల్లీ: దేశంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ.. ఎట్టకేలకు ముంబై విమానాశ్రయాన్ని చేజిక్కించుకోబోతున్నారు. ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌(ఎంఐఏఎల్‌)లో జీవీకే ఎయిర్‌పోర్ట్‌ డెవలపర్స్‌ లిమిటెడ్‌కు చెందిన 50.50 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు అదానీ గ్రూప్‌ సోమవారం ప్రకటించింది. అలాగే, ఎయిర్‌పోర్ట్స్‌ కంపెనీ ఆఫ్‌ సౌత్‌ఆఫ్రికా (ఏసీఎ్‌సఏ), బిడ్‌వెస్ట్‌ గ్రూప్‌కు చెందిన 23.5 శాతం వాటా ను సైతం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది. తద్వారా ఎంఐఏఎల్‌లో మొత్తం 74 శాతం వాటా అదానీ గ్రూప్‌ పరం కానుంది.  


దేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ ఎయిర్‌పోర్ట్‌ ఆపరేటర్‌ 

ముంబై విమానాశ్రయంపై పాగా వేయడం ద్వారా అదానీ గ్రూప్‌ దేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ ఎయిర్‌పోర్ట్‌ ఆపరేటర్‌గా అవతరించనుంది. ఎయిర్‌పోర్ట్‌ల ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం నిర్వహించిన బిడ్డింగ్‌లో అదానీ గ్రూప్‌ 6 నాన్‌-మెట్రో విమానాశ్రయాల అభివృద్ధి, నిర్వహణ కాంట్రాక్టులను ఇప్పటికే గెల్చుకుంది.   తాజాగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో నియంత్రణ వాటా దక్కించుకుంది. ముంబై ఎయిర్‌పోర్ట్‌ దేశంలో రెండో అత్యంత రద్దీ విమానాశ్రయం. కరోనా దెబ్బకు విమానయాన రంగం అతలాకులమైంది. ఈ సంక్షో భకాలంలో అదానీ నెం.1 ప్రైవేట్‌ ఆపరేటర్‌గా ఎదగడం గమనార్హం. 


జీవీకేతో డీల్‌ ఇలా.. 

జీవీకే ఎయిర్‌పోర్ట్‌ డెవలపర్స్‌కు చెందిన రుణాన్ని అదానీ ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌ కొనుగోలు చేయనుంది. పరస్పర అంగీకారంతో రుణభారాన్ని కంపెనీ ఈక్విటీగా బదలాయించడం జరుగుతుందని జీవీకే వెల్లడించింది. తద్వారా కంపెనీలో జీవీకే గ్రూప్‌నకున్న మొత్తం 50.50 శాతం వాటా అదానీ పరంకానుంది. అయితే, ఎంత రుణం..? రుణం ఈక్విటీగా మార్పునకు సంబంధించిన నిబంధనలను మాత్రం ఇరు కంపెనీలు వెల్లడించలేదు. 


2019 మార్చి నుంచే అదానీ ప్రయత్నాలు 

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో వాటా కొనుగోలుకు 2019 మార్చిలోనే అదానీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఏసీఎ్‌సఏ, బిడ్‌వెస్ట్‌ నుంచి 13.5 శాతం వాటాను రూ.1,248 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. కానీ, ఈ ఒప్పందాన్ని జీవీకే వ్యతిరేకించింది. ఆ వాటాను తానే కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చినప్పటికీ, నిధులను సమకూర్చుకోవడంలో విఫలమైంది. పట్టువదలని విక్రమార్కుడిలా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో పాగా వేసేందుకు అప్పటి నుంచి ప్రయత్నిస్తూనే వస్తున్న అదానీ ఎట్టకేలకు సాధించారు. అప్పుల భారం తడిసిమోపడవడంతో జీవీకే సైతం రాజీకొచ్చినట్లు సమాచారం. 


రెండు వారాల క్రితం నుంచి చర్చలు 

ముంబై ఎయిర్‌పోర్ట్‌ టేకోవర్‌పై జీవీకే, అదానీ మఽ ద్య రెండు వారాల క్రితం చర్చలు ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్ల కన్సార్షియంతో డీల్‌ కొలిక్కి రాకపోవడం, ఇందుకుతోడు బకాయిలు చెల్లించాలని రుణదాతలు ఒత్తిడి చేస్తుండటంతో వాటా విక్రయించాలని జీవీకే నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. ‘‘జీవీకే ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్‌పైనున్న రూ.5,000 కోట్లతోపాటు ఎంఐఏఎల్‌కు చెందిన రూ.6,000 కోట్ల రుణభారాన్ని భరించేందుకు అదానీ ముందుకువచ్చింది. అంతేకాదు, నిలిచిపోయిన నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్ట్‌కు సైతం నిధులు సమకూర్చేందుకు అదానీ ఒప్పుకుంది. 


ఇన్వెస్టర్ల కన్సార్షియంతో జీవీకే అగ్రిమెంట్‌ రద్దు 

ముగ్గురు ఇన్వెస్టర్ల కన్సార్షియంతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు జీవీకే ప్రత్యేకంగా వెల్లడించింది. అబుదాబీ ఇన్వె్‌స్టమెంట్‌ అథారిటీ (ఏడీఐఏ), కెనడాకు చెందిన పబ్లిక్‌ సెక్టార్‌ పెన్షన్‌ (పీఎ్‌సపీ) ఇన్వె్‌స్టమెంట్స్‌, భారత్‌కు చెందిన నేషనల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (ఎన్‌ఐఐఎఫ్‌) ఈ కన్సార్షియం సభ్యులు. రుణభారం తగ్గించుకునేందుకు జీవీకే ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్‌లో 79 శాతం వాటాను రూ.7,614 కోట్లకు విక్రయించేందుకు గత ఏడాది అక్టోబరులో ఇన్వెస్టర్‌ కన్సార్షియంతో జీవీకే ఒప్పందం కుదుర్చుకుంది.


జీవీకే తన హోల్డింగ్‌ కంపెనీల రుణ భారం తీర్చుకోవడంతో పాటు ఎంఐఏఎల్‌లో అదనపు షేర్ల కొనుగోలుకు ఈ నిధులను ఉపయోగించాలన్నది ఒప్పందం. అయితే, ఇన్వెస్టర్లు లండన్‌లోని ఓ బ్యాంక్‌ ఎస్ర్కో అకౌంట్‌లో ఈ ఒప్పందానికి సంబంధించిన సొమ్ము జమ చేశాయి. ఈ లావాదేవీకి ప్రభుత్వం, రుణదాతల నుంచి అన్ని అనుమతులు లభించాకే జీవీకేకు ఈ సొమ్ము వినియోగించుకునేందుకు అనుమతి ఉంటుంది. అయితే, ఎంఐఏఎల్‌లో వాటా విక్రయానికి సంబంధించి జీవీకే, బిడ్‌వెస్ట్‌ కుదుర్చుకున్న తొలి తిరస్కరణ హక్కు అగ్రిమెంట్‌పై వివాదం నెలకొంది. దాంతో జీవీకే, ఇన్వెస్టర్ల కన్సార్షియం మధ్య డీల్‌ వాయిదాపడుతూ వచ్చింది. దాంతో ఈ రెండు వర్గాల మధ్య కూడా మొదలైన వివాదం చివరికి ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌ చేతుల్లోకి వెళ్లింది. కానీ, ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌ అనుమతి లేకుండానే ఎస్ర్కో అకౌంట్‌ నుంచి ఇన్వెస్టర్లు సొమ్ము వెనక్కి తీసుకోవడంతో వీరితో ఒప్పందం రద్దు చేసుకునేందుకు జీవీకేకు మార్గం సుగమమైంది. 





కరోనా సంక్షోభం విమానయాన రంగంతో పాటు ఎంఐఏఎల్‌ ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా పటిష్ఠమైన పెట్టుబడిదారును సంస్థలో భాగస్వామిని చేయడం ముఖ్యం. ఈ లావాదేవీ పూర్తయ్యాక మా రుణ  బకాయిలు చాలావరకు తీరనున్నాయి. ఇప్పుడు మా గ్రూప్‌నకు అదే అత్యంత ప్రాధాన్యం. 

- జీవీ కృష్ణా రెడ్డి (జీవీకే)


 


ఈ ప్రపంచంలోని మహా గొప్ప నగరాల్లో ఒకటైన ముంబై నివాస విమాన ప్రయాణికులకు సేవలందించే అవకాశం లభించడం సంతోషకరం. దేశీయ విమానాశ్రయ రంగ పరివర్తనానికి దోహదపడేందుకు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాం. 

 - గౌతమ్‌ అదానీ

Updated Date - 2020-09-01T06:44:40+05:30 IST