భగవద్గీత చెబుతున్నది - 2

ABN , First Publish Date - 2020-05-01T16:27:17+05:30 IST

భారత(ప్ర)దేశం‌ ప్రపంచానికి అందించిన అసమానమైన‌, మహోన్నతమైన పాఠం భగవద్గీత.

భగవద్గీత చెబుతున్నది  - 2


భారత(ప్ర)దేశం‌ ప్రపంచానికి అందించిన అసమానమైన‌, మహోన్నతమైన పాఠం భగవద్గీత. ఇక్కడ గీత అంటే గీతం లేదా పాట అని అర్థం కాదు. గీతా‌(త)అన్న పదానికి  "ఆధ్యాత్మిక, తాత్త్విక,‌ విషయమై  ప్రశ్న, జవాబుల రూపంలో ఉండే గ్రంథం" అని అర్థం. భగవద్గీతలోనే (అధ్యాయం 18,  శ్లోకం 70) ఇలా ఉంది: "అధ్యేష్యతే చ యం‌ ఇమం ధర్మ్యం సంవాద‌మావయోః"‌ అంటే ధర్మం తప్పని మన ఇద్దఱి ఈ సంవాదం  అని అర్థం.‌‌ అక్కడ‌ సంవాదం‌  (పరస్పర సంభాషణ‌ లేదా చర్చ) అనే చెప్పబడింది. 


మహాభారతంలో భగవద్గీత అని లేదు.‌ తరువాతి కాలంలో ఈ పాఠానికి భగవద్గీత అన్న పేరు స్థిరపడింది‌‌. భగవత్ అంటే దైవీ, పవిత్రమైన, మహిమాన్వితమైన, విశిష్టమైన అన్న అర్థాలున్నాయి కనుక ఆ అర్థాలతోనూ, కృష్ణ భగవానుడికి సంబంధించినది కనుక ఆ భావంతోనూ భగవత్ - గీతా(త) అని ఈ‌ పాఠం పేర్కొనబడింది.


భగవద్గీతలో ముఖ్యమైన శ్లోకాలు సరైన అర్థాల్లో మనకు అందలేదు. అంతే కాదు కొన్ని సందర్భాల్లో అవార్థాలు, అపార్థాలు కూడా చోటు చేసుకున్నాయి. ఎన్నో గీతావాక్యాలకు స్పష్టమైన, సత్యమైన అర్థాల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం భగవద్గీతను సరిగ్గా అర్థం చేసుకుందాం రండి.


చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః |
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్ || 

(అధ్యాయం‌ 4,  శ్లోకం 13)


(చాతుర్వర్ణ్యం) నాలుగు స్థితులు (గుణ, కర్మ) గుణాలు, పనుల (విభాగాశః) ప్రకారంగా (మయా) నా వల్ల (సృష్టం) నిశ్చయించబడ్డాయి. (తస్య) దానికి (కర్తారమపి) కర్తనైనా కూడా (మాం) నన్ను  (అకర్తారం) కర్తకాని (అవ్యయం) పరబ్రహ్మంగా (విద్ధి) తెలుసుకో.


"వర్ణం" అన్న పదానికి బహు అర్థాలతో‌ పాటు "స్థితి" అనీ అర్థం ఉంది. చాతుర్వర్ణ్యం అంటే నాలుగు స్థితులు. జాగృతం, స్వప్నం, సమాధి, తురీయం అన్నవి ఆ నాలుగు స్థితులు. ఆ నాలుగు స్థితుల్ని గుణం ఆపై చెయ్యబడుతున్న దాని ప్రకారంగా నేను నిశ్చయించాను అనీ, దానికి‌ కర్త తానే అయినా తనను అకర్తగానూ, పరమాత్మగానూ తెలుసుకోమని ఇక్కడ కృష్ణుడు చెబుతున్నాడు. 


ఇక్కడ "చాతుర్వర్ణ్యం" అన్నది కులాలను సూచించే మాట కాదు. నిజానికి తొలిదశలో అంటే మనువుదశలో కూడా  ఈ చాతుర్వర్ణ్యం అన్న మాట కులాలను తెలియజెప్పే మాట కాదు. (జన్మనా‌ జాయతే శూద్రః / సంస్కారాత్ ద్విజ ఉచ్యతే / విద్యయా యాతి విప్రత్వమ్ / బ్రహ్మ జ్ఞానాత్ బ్రాహ్మణః) పుట్టుకతో శూద్ర్రులు అంటే సామాన్యులు, సంస్కారం లేదా అభ్యాసం వల్ల ద్విజులు  అంటే వృత్తికారులు, విద్యవల్ల విప్రులు అంటే విద్వాంసులు, బ్రహ్మ జ్ఞానం వల్ల బ్రాహ్మణులు అన్న వివరణతో మనుషుల్లోని నాలుగు విభాగాల్ని  సూచించేది‌ మాట అది. తరువాతి కాలంలో బ్రాహ్మణ. క్షత్రీయ, వైశ్య ,‌ శూద్ర‌ విభాగాలకి ఆ చాతుర్వర్ణ్యం అన్నది వాడుకలోకి వచ్చింది.


భగవద్గీతలో ఈ శ్లోకం చోటు చేసుకున్న సందర్భంలో సామాజిక సంబంధిత కుల వ్యవస్థ ప్రసక్తి , ప్రస్తావనలు కానీ మానవ విభాగాల ప్రసక్తి, ప్రస్తావనలు కానీ లేవు. ఈ శ్లోకానికి ముందున్న శ్లోకంలో కర్మల వల్ల సిద్ధి పొందడం ప్రస్తావించబడింది. ఈ శ్లోకానికి తరువాత శ్లోకంలోనూ, ఆపై శ్లోకాల్లోనూ కర్మ గుఱించే ప్రస్తావించబడింది. కనుక ఈ శ్లోకం నిస్సందేహంగా సామాజిక విషయక శ్లోకం కాదు. కనుక ఇక్కడ చాతుర్వర్ణ్యం మాటకు సామాజిక కులాలు అన్న అర్థం తీసుకోవడం ఎంత మాత్రమూ సమంజసం అవదు. అంతేకాదు అది మహాదోషం కూడా. భగవద్గీత సామాజిక సూచనల గ్రంథం కాదు. భగవద్గీత ఒక తాత్త్విక విషయక గ్రంథం. మనం భగవద్గీతను అవార్థాలకు అతీతంగా సరిగ్గా అర్థం చేసుకోగలగాలి. ఇది సామాజిక విషయక శ్లోకం కాదు. ఇది తాత్త్విక శ్లోకం. ఇక్కడ చాతుర్వర్ణ్యం అన్నది నిర్ద్వంద్వంగా జాగృతం, స్వప్నం, సమాధి, తురీయం అన్న నాలుగు స్థితుల్ని మాత్రమే తెలియజేస్తోంది. స్థితులు అని వీటినే ఎందుకు తీసుకోవాలి?‌ ఎందుకు అంటే వేదాంత‌ పరంగా లేదా తాత్త్వికంగా స్థితులు అంటే ఇవే కాబట్టి.‌ వీటికి అవస్థాచతుష్టయం‌ అనే శాస్త్రీయమైన పేరు కూడా ఉంది. అవస్థ అంటే స్థితి. 


సంస్కృత పదాలకు సందర్భానుసారం విచక్షణతో, విజ్ఞతతో సరైన అర్థాల్ని గ్రహించాల్సి ఉంటుంది. ఆ విధానంలో‌ భగవద్గీతపై సరైన అవగాహనకు‌ వద్దాం. 


భగవద్గీత అనేది కళ్లకద్దుకుంటూ‌ ఇంట్లో‌ పెట్టుకోవాల్సిన ఒక పుస్తకం కాదు. భగవద్గీత,‌ బుద్ధితో‌ చదివి సరిగ్గా అర్థం‌ చేసుకోవాల్సిన సత్యతత్త్వం, తత్త్వసత్యం.


రోచిష్మాన్
9444012279
rochishmon@gmail.com


ఇంతవఱకూ ఈ శీర్షికలో  వచ్చిన రచనల లింక్స్


భగవద్గీతను మహాభారతంలో అలా అనలేదు...

Updated Date - 2020-05-01T16:27:17+05:30 IST