పోరాటాలే ‘లిబరేషన్’ మార్గం

ABN , First Publish Date - 2020-12-03T06:22:24+05:30 IST

సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ అగ్రనాయకులు అణగారిన జనాల నుంచి వచ్చిన వారే.

పోరాటాలే ‘లిబరేషన్’ మార్గం

సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ అగ్రనాయకులు అణగారిన జనాల నుంచి వచ్చిన వారే. వారంతా పార్టీకి, ప్రజలకు అంకితమవడం సమాజంలో వారి పట్ల నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచింది. నాయకుడు అంటే విప్లవస్ఫూర్తిని కలిగి ఉండడం, ఆచరణలోనూ దాన్ని ప్రతిబింబించడం. బూర్జువా పార్టీల రాజకీయాలకు ప్రత్యామ్నాయ రాజకీయాలను ప్రజల ముందు ఉంచడం వల్ల సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ వారిలో నిలబడగలిగింది.


బిహార్‌లో సిపిఐ(ఎంఎల్) లిబరేషన్, ఇతర వామపక్షాల గెలుపుపై ఆంధ్రజ్యోతిలో ఈ నెల 19న వచ్చిన ‘బిహార్‌లో ఎరుపుల మెరుపులు’ అనే వ్యాసం మంచి విశ్లేషణాత్మక వ్యాఖ్యానం. ప్రస్తుత పరిస్థితుల్లో లెఫ్ట్‌పార్టీలు బలహీనపడిన మాట వాస్తవం. వామపక్షాలకు ఓట్లు, సీట్లు తగ్గాయి అనడానికి వివిధ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ప్రజాజీవితంలో వామపక్షాల పాత్ర కుచించుకుపోయిందనడానికి పోరాటాలు బలహీనపడడమే రుజువు. బెంగాల్ పరిస్థితిపై సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ జాతీయ కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య చేసిన వాఖ్యనాలు రుచించకపోవచ్చు. కానీ, విప్లవ రాజకీయాల్లో కమ్యూనిస్టులు, విప్లవ కమ్యూనిస్టులు చిత్తశుద్ధితో కూడిన ఆత్మవిమర్శ చేసుకోవడం తక్షణ అవసరం. 


కమ్యూనిస్టులు ఒకప్పటి ప్రాధాన్యాన్ని కోల్పోయిన నేపథ్యంలో ఇటీవల బిహార్ ఎన్నికల్లో లెఫ్ట్ 29 సీట్లలో పోటీ చేసి 16 సీట్లు పొందింది. అందులో సిపిఐ(ఎంఎల్) 19 సీట్లలో పోటీ చేసి 12 సీట్లు గెలిచింది. సిపిఎం నాలుగు చోట్ల, సిపిఐ ఆరు చోట్ల పోటీ చేసి చెరో రెండు సీట్లు గెలిచాయి. గత ఎన్నికల్లో సిపిఐ(ఎంఎల్) మూడు సీట్లలో ప్రాతినిధ్యం దక్కించుకుంది. అవి కూడా ఒంటరిగా పోటీ చేసి గెలుపొందిన సీట్లు. ఆ పార్టీ మూడు దశాబ్దాలుగా ఎన్నికల్లో పాల్గొంటోంది. 1972లో ఏర్పడ్డ లిబరేషన్ 1992 వరకు అజ్ఞాత పోరాటమే చేసింది. వందలాది మంది విప్లవవీరుల్ని కోల్పోయి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టింది. 


ఎంఎల్ పార్టీలలో పెద్ద పార్టీగా లిబరేషన్‌కు ప్రాధాన్యం ఉంది. మిలిటెంట్ పోరాటాలు ఆ పార్టీకి ఆయువుపట్టు. ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్, రివల్యూషనరీ యూత్ అసోసియేషన్, ఆల్ ఇండియా కిసాన్ మహాసభ, ఆల్ ఇండియా వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం, ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్, జన సాంస్కృతిక మండలి, ఆలిండియా ప్రోగ్రెసివ్ ఉమెన్ అసోసియేషన్ ప్రజాసంఘాలు పటిష్ఠ నిర్మాణం కలిగి ఉన్నాయి. అసంఘటిత రంగంలో ఆశా, అంగన్‌వాడీ, స్కీమ్ వర్కర్స్, భవన నిర్మాణరంగం, పారిశుద్ధ్యం వంటి అనేక రంగాలలో సమస్యల పరిష్కారానికి ఆ పార్టీ కృషి చేస్తోంది. దానికి నిబద్ధత గల క్యాడరే బలం.


లిబరేషన్‌ నేతలు నిరాడంబరంగా జీవించడం, ప్రజాప్రతినిధులు సైతం సామాన్యుల్లా బతకడం ప్రజలను ఆకట్టుకుంది. పార్టీ అగ్రనాయకులు అణగారిన జనాల నుంచి వచ్చిన వారే. వారంతా పార్టీకి, ప్రజలకు అంకితమవ్వడం సమాజంలో వారిపట్ల నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచింది. నాయకుడు అంటే విప్లవస్ఫూర్తిని కలిగి ఉం డడం, ఆచరణలోనూ దాన్ని ప్రతిబింబించడం. బూర్జువాపార్టీల రాజకీయాలకు ప్రత్యామ్నాయమైన రాజకీయాలను ప్రజల ముందు ఉంచడం వల్ల సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ ప్రజల్లో నిలబడగలిగింది. వారి ఆదరణ పొందగలిగింది. ప్రజల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని నింపి ప్రజాసమస్యల్ని పరిష్కరించగలిగే స్థితికి ఆ పార్టీ చేరుకుంది. 


లెప్ట్ వైపు యువత రావడం లేదంటూ వ్యాసంలో కీలకమైన వాఖ్యలు ఉన్నాయి. అయితే, యువత ఉద్యమాల్లోకి రావడం లేదని ఎవరైనా చెప్పడం తప్పించుకొనే ప్రయత్నం చేయడమే అవుతుంది. నవతరాన్ని చైతన్యం చేసే పక్రియలో కమ్యూనిస్టులు వెనకబడుతున్నారు. విద్యార్థులను, యువతను ప్రోత్సహించడాన్ని లిబరేషన్‌ ఒక ఉద్యమంగా కొనసాగిస్తోంది. ఈ ప్రోత్సాహం పర్యవసానంగానే విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు సందీప్ సౌరవ్, యువజన సంఘం జాతీయ అధ్యక్షులు మనోజ్ మంజిల్, గౌరవ అధ్యక్షుడు అమర్ జిత్ కుష్వాహ ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించారు. తెలంగాణలోనూ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి, వర్దన్నపేట నుంచి తొలిసారిగా పోటీ చేసి గౌరవప్రదమైన ఓట్లను సాధించి వామపక్ష శ్రేణులను ఆశ్చర్యపరిచింది. 


‘ప్రస్తుతం ఆచరణలో కనిపించే సానుకూల భేదాలను గుర్తించకపోతే పొరపాటు అవుతుందనే’ వ్యాఖ్య కూడ లిబరేషన్ గురించి ఉంది. అవును, తప్పుల్ని గుర్తించి ప్రశ్నిస్తున్నప్పుడు త్యాగనిరతి గురించి కూడా చెప్పాలి. లేదంటే సంకుచితత్వమే అవుతుంది. ప్రత్యామ్నాయ రాజకీయాలను ప్రజలకు అందించడానికి సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ కృషి చేస్తోంది. దేశానికి ఫాసిస్ట్ రాజకీయాలు అత్యంత ప్రమాదకరం. ఆ ముప్పును ఎదుర్కొనేందుకు లిబరేషన్ ఎంచుకున్న రాజకీయ పంథా సరైంది. బిహార్ ఎన్నికల ఫలితాలు ఈ సత్యాన్నే సూచిస్తున్నాయి. లిబరేషన్ విప్లవ రాజకీయాల్ని ముఖ్యంగా విద్యార్ధి, యువతరం అధ్యయనం చేయాలి, అచరణాత్మక విప్లవ రాజకీయాల్ని అందిపుచ్చుకొని ఆదర్శంగా నిలవాలి.


మామిండ్ల రమేష్ రాజా

సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ కమిటీ సభ్యుడు

Updated Date - 2020-12-03T06:22:24+05:30 IST