అన్నం పెడుతున్నా అక్రమ కేసులా?

ABN , First Publish Date - 2020-05-01T09:55:09+05:30 IST

‘పేదలు, అభాగ్యులకు అన్నం పెట్టి ఆదుకోవాలని మన పార్టీ పెద్దలు చెబుతున్నారు.. కానీ ఇక్కడి వైసీపీ ప్రభుత్వం మన పార్టీ కేడర్‌పై అక్రమ కేసులు పెట్టి ..

అన్నం పెడుతున్నా అక్రమ కేసులా?

  • మన శ్రేణులను వేధిస్తున్నారు.. వైసీపీ అరాచకాలు ఎక్కువయ్యాయి
  • కిషన్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర నేతల ఫిర్యాదు
  • ఇవన్నీ అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్తా
  • జగన్‌ ప్రభుత్వ ఒత్తిళ్లకు మీరు వెనక్కి తగ్గొద్దు
  • డీజీపీ సవాంగ్‌తోనూ మాట్లాడతా
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి భరోసా


అమరావతి, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): ‘పేదలు, అభాగ్యులకు అన్నం పెట్టి ఆదుకోవాలని మన పార్టీ పెద్దలు చెబుతున్నారు.. కానీ ఇక్కడి వైసీపీ ప్రభుత్వం మన పార్టీ కేడర్‌పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోంది’ అని బీజేపీ రాష్ట్ర నేతలు, జిల్లాల అధ్యక్షులు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. కరోనా వైరస్‌ ప్రభావం, లాక్‌ డౌన్‌ నేపథ్యంలో పేదల పరిస్థితి తదితర అంశాలపై గురువారం ఢిల్లీ నుంచి బీజేపీ నేతలతో కిషన్‌రెడ్డి ఆడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఇన్‌చార్జి సునీల్‌ దేవధర్‌, సీనియర్‌ నేతలు పురందేశ్వరి, జయప్రకాశ్‌ నారాయణ, జిల్లాల అధ్యక్షులతో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. రాష్ట్రంలో సమస్యలను పురందేశ్వరి ప్రస్తావిస్తూ.. పార్టీ పెద్దల ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో అభాగ్యులకు అన్నం పెడుతున్నా, పేదలకు కూరగాయలు పంచుతున్నా వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టించి వేధిస్తోందన్నారు.


శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి విజయవాడలోని ఘటనల వరకూ పలు ఆటంకాలను వివరించారు. ఇప్పటికే వీటన్నిటిపై ఎప్పటికప్పుడు రాష్ట్ర కార్యదర్శి జేపీ సమాచారమిస్తున్నారని, వీటిపై గురువారం సాయంత్రమే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో మాట్లాడి ఇబ్బంది లేకుండా చూస్తానని కిషన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. చంద్రబాబు పొరుగు రాష్ట్రంలో ఉన్నందున టీడీపీ కేడర్‌ ఉత్సాహంతో లేదని, ప్రస్తుతం ఏపీలో బీజేపీ ఒక్కటే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్లు ఢిల్లీకి సమాచారం అందుతోందన్నారు.  వెనకడుగు వేయవద్దని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తో అక్రమ కేసుల గురించి మాట్లాడతానని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ ఒత్తిళ్లకు ఎక్కడా తలొగ్గవద్దని, రాష్ట్ర పార్టీకి ప్రతి విషయంలోనూ ప్రధాని మోదీతోపాటు అమిత్‌ షా అండ ఉంటుందని చెప్పారు. 

Updated Date - 2020-05-01T09:55:09+05:30 IST