మరిన్ని మెరుగులు తప్పవు

ABN , First Publish Date - 2020-08-31T06:26:38+05:30 IST

గోల్డ్‌ డిపాజిట్‌ పథకం (జీడీఎ్‌స)లో మరిన్ని మార్పులు చేయాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి...

మరిన్ని మెరుగులు  తప్పవు

  • గోల్డ్‌ పథకంపై జేజీఈపీసీ సూచన
  • పసడి గరిష్ఠ పరిమితి రెట్టింపు చేయాలి
  • ఐటీ చట్టంతో అనుసంధానించాలి


న్యూఢిల్లీ : గోల్డ్‌ డిపాజిట్‌ పథకం (జీడీఎ్‌స)లో మరిన్ని మార్పులు చేయాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఆకర్షణీయంగా లేకపోవడం వల్లే ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన పథకం నీరుగారి పోయిందని ఆభరణాలు, ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జేజీఈపీసీ) పేర్కొంది. దేశంలో ప్రజలు, ఆలయాలు, ఇతర సంస్థల వద్ద దాదాపు 24,000 టన్నుల పసిడి నిల్వలున్నట్టు అంచనా. ఇందులో కనీసం పది శాతమైనా సేకరించి, ఆర్థికంగా లాభసాటి కార్యక్రమాలకు ఉపయోగించాలని భావించి అయిదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం జీడీఎస్‌ పథకం ప్రకటించింది. అయితే పథకం ఆకర్షణీయంగా లేకపోవడంతో ఇప్పటి వరకు ఈ పథకం కింద 20 టన్నులకు మించి బంగారాన్ని సేకరించలేక పోయారు. సవరించిన బంగారం డిపాజిట్‌ పథకంలో కూడా మరిన్ని మార్పులను మండలి సూచించింది.


నేటి నుంచి ఇష్యూ : గ్రాము ధర రూ.5,117

ఆర్‌బీఐ మరోసారి సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ (ఎస్‌జీబీ) జారీ చేస్తోంది.  ఎస్‌జీబీ-6 సీరిస్‌ పేరుతో  జారీ చేసే ఈ బాండ్స్‌ కోసం మదుపరులు సోమవారం నుంచి సెప్టెంబరు 4 వరకు దరఖాస్తు చేయవచ్చు. వచ్చే నెల 8న బాండ్స్‌ కేటాయిస్తారు. ఒక గ్రాము బాండ్‌ ధరను రూ.5,117 గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేసినా, బాండ్స్‌ ధరను డిజిటల్‌ పద్దతిలో చెల్లించినా గ్రాముకు రూ.50 రాయితీ లభిస్తుంది. ఎనిమిదేళ్ల కాల పరిమితి ఉండే ఈ బాండ్స్‌పై ఏటా 2.5 శాతం వడ్డీ చెల్లిస్తారు. బ్యాంకులు, పోస్టాఫీసులు, బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈ, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌హెచ్‌సీఈఎల్‌) ద్వారా ఈ గోల్డ్‌ బాండ్స్‌ కొనుగోలు చేయవచ్చు.


మండలి సూచించిన మార్పులు!

  1. ఆర్‌-జీడీఎ్‌సను ఆదాయ పన్ను చట్టంలో అనుసంధానం చేయాలి. 
  2. వివాహమైన స్త్రీ వద్ద ఉండే గరిష్ఠ పసిడి పరిమితిని 500 గ్రాముల నుంచి కిలోకు పెంచాలి. 
  3. అవివాహితు వద్ద గరిష్ఠ  పరిమితిని 250 గ్రాముల నుంచి అర కిలోకు పెంచాలి.
  4. పురుషుల దగ్గర ఉంచుకోదగ్గ పసిడి గరిష్ఠ పరిమితిని 100 గ్రాముల నుంచి 200 గ్రాములకు పెంచాలి.
  5. కనీస డిపాజిట్‌ పరిమితిని 30 గ్రాముల నుంచి 10 గ్రాములకు తగ్గించాలి.
  6. ఆర్‌-జీడీఎస్‌ పథకం ద్వారా వచ్చే  రాబడులపై జీఎ్‌సటీ, మూల ధన లాభాల పన్ను ఉండకూడదు.
  7. ఆర్‌-జీడీఎస్‌ మదుపరులకు మార్కెట్‌లో ట్రేడింగ్‌  చేసుకునేలా డిమ్యాట్‌ రూపంలో ఇ-డిపాజిట్‌ సర్టిఫికెట్లు జారీ చేయాలి.
  8. ఆర్‌-జీడీఎస్‌ పథకం కింద నగల వ్యాపారులూ మదుపరుల నుంచి బంగారం సేకరించడాన్ని అనుమతించాలి.
  9. ఈ పథకం ద్వారా సమీకరించిన పసిడిని ఫారెక్స్‌ రిజర్వుగా పరిగణించాలి.

Updated Date - 2020-08-31T06:26:38+05:30 IST