ఇప్పుడు దానమే ధర్మం!

ABN , First Publish Date - 2020-05-01T05:30:00+05:30 IST

ముస్లిమ్‌లకు అత్యంత పవిత్రమైన మాసం రంజాన్‌. ఈ నెలలో ప్రార్థనలకూ, దాతృత్వ కార్యక్రమాలకూ ముస్లింలు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. మిగిలిన రోజుల కన్నా రంజాన్‌ మాసాన్ని అత్యంత శ్రద్ధగా దైవ ప్రవక్త మహమ్మద్...

ఇప్పుడు దానమే ధర్మం!

  • ‘ఇస్లామ్‌’ అనే సౌధానికి ఉన్న అయిదు మూలస్తంభాలలో విశ్వాస ప్రకటన, నమాజ్‌ తరువాత మూడవ స్తంభంగా ‘జకాత్‌’ పరిగణన పొందుతోంది. ఇస్లామ్‌ను ఒక అత్యున్నత జీవన విధానంగా పాటించేవారు ప్రస్తుత విపత్తు వేళ ఇంట్లోనే నమాజ్‌లు చేసుకోవడంతో పాటు ‘జకాత్‌’ (రంజాన్‌ సందర్భంగా చేయాల్సిన దాన ధర్మాల)ను మరింత ఉదారంగా, వివేకంగా ఆచరించాలి. 

ప్రపంచం ఇప్పుడు భయంకరమైన ముప్పును ఎదుర్కొంటోంది. ఎటు చూసినా నిరాశా నిస్పృహల చీకట్లు అలముకొని ఉన్నాయి. భయాందోళనల నడుమ మనిషి కాలం గడుపుతున్నాడు. ఈ సారి పవిత్ర రంజాన్‌ మాసం ఒక ప్రత్యేకత కలిగి ఉంది. ‘కొవిడ్‌-19’లో రంజాన్‌ (2020) మాసంలో ప్రపంచ మానవాళి లాక్‌డౌన్‌ పాటిస్తూ గృహ నిర్బంధంలో ఉంది. ఇంటిపట్టునే ఉండి, కంటికి కనిపించని వైరస్‌తో మానవాళి నిశ్శబ్ద యుద్ధం చేస్తోంది. 


ముస్లిమ్‌లకు అత్యంత పవిత్రమైన మాసం రంజాన్‌. ఈ నెలలో ప్రార్థనలకూ, దాతృత్వ కార్యక్రమాలకూ ముస్లింలు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. మిగిలిన రోజుల కన్నా రంజాన్‌ మాసాన్ని అత్యంత శ్రద్ధగా దైవ ప్రవక్త మహమ్మద్‌ పాటించేవారు. ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా మసీదుల్లో ప్రార్థనలు చేసుకొనే వెసులుబాటు లేదు. కానీ దీన్ని రంజాన్‌ మాస నియమాలను పాటించడానికీ, దాన ధర్మాలు చేయడానికీ అవరోధంగా భావించనక్కరలేదు.


ఏమిటీ జకాత్‌? 

ఇస్లామ్‌లోని సమస్త ఆరాధనల్లో నమాజ్‌కు ఉన్నంత ప్రాధాన్యం ‘జకాత్‌’కు కూడా ఉంది. ఈ రెండింటిలో దేన్ని నిరాకరించినా అవిశ్వాసులుగా మిగులుతారు. వీటిలో ఒకటి లేకపోతే రెండోదానికి ఏ మాత్రం విలువ ఉండదు. ఒక ముస్లిమ్‌ నమాజ్‌ చేస్తున్నప్పటికీ, ప్రతి సంవత్సరం ‘జకాత్‌’ చెల్లించకపోతే నమాజ్‌ వల్ల అతనికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాగే  ‘జకాత్‌’ను ఏటేటా చెల్లిస్తున్నా జీవితాంతం నమాజ్‌ చెయ్యకపోతే అతని ‘జకాత్‌’ సత్కార్యం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.


ధన ప్రక్షాళన సాధనం 

‘‘సత్యాన్ని విశ్వసించి సదాచార సంపన్నులుగా ఉండి, నమాజ్‌ (విధి) నిర్వహిస్తూ, ‘జకాత్‌’ను నెరవేర్చేవారికి ప్రభువు దగ్గర ప్రతిఫలం సిద్ధంగా ఉంది. వారికి పరలోకంలో ఎలాంటి భయం, దుఃఖం ఉండవు’’ అని దివ్య ఖుర్‌ఆన్‌ (అల్‌ బఖర 2:277) చెబుతోంది. 

‘జకాత్‌’ అంటే ‘పవిత్రత’, పరిశుద్ధత అనే అర్థాలు ఉన్నాయి. సామాన్య భాషలో చెప్పాలంటే, ధనికుడు పవిత్రుడు అయ్యేందుకు ఏడాదికి ఒకసారి అతని సంపద నుంచి రెండున్నర శాతం చొప్పున పేదలకూ, ధర్మ సంస్థాపన కార్యాలకూ దానంగా అందించే ధనాన్నీ, బంగారాన్నీ, వస్తువులనూ ‘జకాత్‌’ అంటారు. 


‘‘(దైవాన్ని) విశ్వసించిన వారు ప్రజలకు మంచి విషయాలు బోధిస్తారు. చెడు విషయాల నుంచి వారిస్తారు. నమాజ్‌ (వ్యవస్థ) స్థాపిస్తారు. జకాత్‌ చెల్లిస్తారు. దేవుని పట్లా, ఆయన ప్రవక్త పట్లా వినయ విధేయతలతో మసలుకుంటారు. వారిపైనే దైవ కారుణ్యం వర్షిస్తుంది’’ అని దివ్య ఖుర్‌ఆన్‌ (అత్‌ తౌబా  9:71) స్పష్టం చేసింది. 


దేవుడు జకాత్‌ చెల్లింపులను ముస్లిమ్‌లకు తప్పనిసరి విధి (ఫరజ్‌)గా చేశాడు. ఇది ధనికుల నుంచి వసూలు చేసి నిరుపేదలకు అందించడం జరుగుతుందని హదీస్‌ గ్రంథం చెబుతోంది. పై హదీస్‌ను పరిశీలిస్తే ‘జకాత్‌ పేద ప్రజల హక్కు’ అని తెలుస్తోంది. దివ్య ఖుర్‌ఆన్‌లో కనీసం 32 చోట్ల నమాజ్‌తో పాటు ‘జకాత్‌ ’ ప్రస్తావన ఉంది. దాన్ని బట్టి ‘జకాత్‌’కు ఎంత ప్రాధాన్యం ఉందో తెలుసుకోవచ్చు.


నమాజ్‌ చేసినవారూ, ‘జకాత్‌’ చెల్లించినవారూ దేవుడికి తప్ప మరెవరికీ భయపడరని దివ్య ఖుర్‌ఆన్‌ చెబుతోంది. ఏ సంపద నుంచి జకాత్‌ వేరుగా తీయకుండా అందులో కలిసే ఉంటుందో, అది ఆ సంపదను నాశనం చేస్తుందని దైవ ప్రవక్త స్పష్టం చేశారు. ‘జకాత్‌’ చెల్లించని వ్యక్తి ప్రళయ దినాన కఠినమైన శిక్షలకు గురై, నరకానికి వెళతాడని పేర్కొన్నారు. ‘‘దేవుడు తన అనుగ్రహంతో ప్రసాదించిన సంపద విషయంలో పిసినారితనం చూపకూడదు. ఆ పిసినారితనమే ప్రళయదినాన వారి కంఠానికి గుదిబండగా మారుతుంది’’ అని దైవ ప్రవక్త (దివ్య ఖుర్‌ఆన్‌- ఆలీ ఇమ్రాన్‌ 3:180) హెచ్చరించారు.


ఎవరు ఎంత చెల్లించాలి?

  1. యాభైరెండున్నర తులాల వెండి లేదా ఏడున్నర తులాల బంగారం ఉన్న వ్యక్తి ప్రతి సంవత్సరాంతంలో దాని విలువలో రెండున్నర శాతంతో సమానమైన మొత్తాన్ని ‘జకాత్‌’ చెల్లించాలి. పైన తెలిపిన బంగారం విలువతో సమానమైన ధనం ఉన్న వారు కూడా ‘జకాత్‌’ చెల్లించాలి.
  2. చలామణిలో ఉన్న కరెన్సీ ఉన్న వారు ఆ ధనంలో నూటికి రెండున్నర రూపాయల చొప్పున ‘జకాత్‌’ చెల్లించాలి.
  3. వ్యాపారం చేస్తున్నవారు తమ వద్ద నిల్వల మేరకు ‘జకాత్‌’ చెల్లించాలి. 
  4. వర్షం వల్ల పండే ఫలాలు, ధాన్యాల్లో పదో వంతును నీరు తోడి పండించే పంటల్లో ఇరవయ్యో వంతును ‘ఉరష్‌’ గా (‘ఉరష్‌’ అంటే పదో వంతు అని అర్థం) చెల్లించాల్సి ఉంటుంది. 
  5. అలాగే కనీసం నలభై మేకలు, గొర్రెలు లేదా కనీసం ముప్ఫై పశువులు ఉన్నవారు ‘జకాత్‌’ చెల్లించాలి.

Updated Date - 2020-05-01T05:30:00+05:30 IST