మహిళల రక్షణ మాధ్యేయం

ABN , First Publish Date - 2020-09-01T10:00:08+05:30 IST

మహిళల రక్షణకు దిశ చట్టం మాత్రమేగాక ప్రత్యేక పోలీసు స్టేషన్లు, కోర్టులు అన్ని జిల్లాల్లో ఉన్నాయని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు.

మహిళల రక్షణ మాధ్యేయం

  • ‘దిశ’తోపాటు ప్రత్యేక పోలీసుస్టేషన్లు, కోర్టులు
  • సైబర్‌ నేరాలపై 10 లక్షల మందికి అవగాహనకల్పించాం
  • ఈ-రక్షాబంధన్‌ ముగింపు కార్యక్రమంలో డీజీపీ సవాంగ్‌

అమరావతి, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): మహిళల రక్షణకు దిశ చట్టం మాత్రమేగాక ప్రత్యేక పోలీసు స్టేషన్లు, కోర్టులు అన్ని జిల్లాల్లో ఉన్నాయని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించేందుకు ఆగస్టు నెల మొత్తం ఈ-రక్షాబంధన్‌ కార్యక్రమాన్ని సీఐడీ నిర్వహించింది. కార్యక్రమం ముగింపు సందర్భంగా రాష్ట్రంలోని సాధారణ విద్యార్థినుల నుంచి మహిళా సెలబ్రిటీలు అక్కినేని సమంత తదితరులతో మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా డీజీపీ మాట్లాడారు. ఈ సందర్భంగా సవాంగ్‌ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్‌ నేరాలపై కల్పించేందుకు సీఐడీ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. సీఐడీ అధికారులు రాధిక, సరిత నెల రోజులపాటు శ్రమించి పది లక్షల మందికి అవగాహన కల్పించారని ప్రశంసించారు. ఆన్‌లైన్‌ తరగతుల వల్ల పిల్లలు ఫోన్లు ఎక్కువగా వాడాల్సిన పరిస్థితి వచ్చిందని, వారికీ అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ-రక్షాబంధన్‌ ద్వారా 2.29 లక్షల మంది నుంచి అనుభవాలు, సూచనలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది మహిళలపై నేరాల సంఖ్య పెరగడాన్ని ప్రస్తావిస్తూ.. అత్యాచారం కేసుల్లో ఎక్కువగా 420 (పెళ్లి పేరుతో మోసం) సెక్షన్లే ఉన్నట్లు చెప్పారు. అన్యాయం జరిగిందని మహిళలు పోలీసుస్టేషన్‌కు వస్తే ఖచ్చితంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదవుతోందని అందుకే సంఖ్య పెరిగిందన్నారు. 


భద్రతపై శ్రద్ధ ఏదీ?

అడిషనల్‌ డీజీ సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ, మొబైల్‌ వినియోగదారులు వినోదానికి ఇచ్చిన ప్రాధాన్యం భద్రతకు ఇవ్వడంలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘నాది నక్కిలీసు గొలుసు’ పాటను నెల రోజుల్లో 6 కోట్ల మంది వీక్షించారని, ‘ఈ-రక్షాబంధన్‌’ మాత్రం పది లక్షలకు మించలేదన్నారు.  


బుల్లీయింగ్‌ పెరిగింది: సమంత

సినీనటి సమంత అక్కినేని మాట్లాడుతూ.. సైబర్‌ బుల్లీయింగ్‌ బాగా ఎక్కువైందన్నారు. మహిళలు, పిల్లలను ఆన్‌లైన్‌ మోసాల నుంచి రక్షించడం అభినందనీయమన్నారు. ఈ-రక్షా బంధన్‌ కార్యక్రమం మహిళలకు ఒక సోదరుడిలా పనిచేసిందని కొనియాడారు.  


పోలీ్‌సలనే జైలుకు పంపాం 

రాష్ట్రంలో ఇటీవలి కాలంలో దళితులపై జరుగుతున్న దాడులను సీరియ్‌సగా తీసుకున్నట్లు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ చెప్పారు. ‘‘రాజమండ్రిలో దళితుడికి శిరోముండనం చేయించిన ఎస్‌ఐపై అట్రాసిటీ కేసు నమోదు చేశాం. శ్రీకాకుళంలో ఒక దళితుడిని బూటుకాలితో తన్నిన సీఐని జైలుకు పంపాం. పోలీసులపై ఇంత వేగంగా చర్యలు తీసుకున్న చరిత్ర గతంలో ఎప్పుడైనా ఉందా?’’ అని సవాంగ్‌ అన్నారు. విశాఖపట్నంలో శిరోముండనం కేసులో కొన్ని గంటల్లోనే మొత్తం నిందితులను జైలుకు పంపామని, అనంతపురంలో కూడా చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. 


కొంప ముంచుతున్న కామన్‌ వైఫై

ఆండ్రాయిడ్‌ ఫోన్లు వాడే వారిలో కామన్‌ వైఫై వినియోగించేవారే అధికంగా సైబర్‌ బుల్లీయింగ్‌ బారిన పడుతున్నట్లు సీఐడీ సర్వేలో తేలింది. సామాజిక మాధ్యమాల ద్వారా నెల రోజుల పాటు చేపట్టిన సర్వేలో ఈ విషయాన్ని గుర్తించింది. మొత్తం 2.29 ల క్షల మంది పాల్గొన్న ఈ సర్వేలో తేలిన కొన్ని అంశాలను సీఐడీ అధికారులు వెల్లడించారు. 

  • సైబర్‌ క్రేమ్‌ ద్వారా 80ు మంది డబ్బు పోగొట్టుకున్నట్లు సర్వేలో పాల్గొన్నవారు తెలిపారు. + ఆన్‌లైన్‌లో తమ వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉందని 79ు మంది వెల్లడించారు.
  • ఆన్‌లైన్‌ తరగతులు, బ్యాంకింగ్‌ కోసమే ఇంటర్నెట్‌ వాడుతున్నట్లు ఎక్కువ మంది తెలిపారు. 
  • ఫోక్సో చట్టంపై ఎవరికీ ఎక్కువగా అవగాహనలేదు. టెలికమ్‌ యాక్ట్‌ గురించి దాదాపు తెలియదు.   

Updated Date - 2020-09-01T10:00:08+05:30 IST