శిక్ష కాదు, పరీక్ష!

ABN , First Publish Date - 2020-05-01T05:30:00+05:30 IST

భౌతిక దూరాన్ని పాటించాల్సిన ఈ సమయంలో సామూహిక ప్రార్థనలకూ, ఆదివారం చర్చిల్లో చేసే ప్రార్థనలకూ దూరం కావలసి వచ్చిందన్న విచారం చాలామంది విశ్వాసుల్లో ఉంది. అనుచితమైన పనులకు పాల్పడుతూ, దైవాన్నీ, ఆయన...

శిక్ష కాదు, పరీక్ష!

భౌతిక దూరాన్ని పాటించాల్సిన ఈ సమయంలో సామూహిక ప్రార్థనలకూ, ఆదివారం చర్చిల్లో చేసే ప్రార్థనలకూ దూరం కావలసి వచ్చిందన్న విచారం చాలామంది విశ్వాసుల్లో ఉంది. అనుచితమైన పనులకు పాల్పడుతూ, దైవాన్నీ, ఆయన మహిమనూ విస్మరిస్తున్న మానవాళికి కరోనా వైరస్‌ ఒక శిక్ష అని భావిస్తున్న వారూ ఉన్నారు. అలా ఆలోచిస్తున్న వారు దైవాన్నీ, ఆయన స్వభావాన్నీ అర్థం చేసుకోనట్టే! 


దేవుడు ఎవరినీ శిక్షించడు. కాకుంటే పరీక్షిస్తాడు. కరోనా మహమ్మారి విలయతాండవం కూడా అలాంటి ఒక పరీక్షే! దీనికి మనం స్పందించే తీరు మనం దైవానికి ఎంత విధేయంగా ఉంటున్నామో, ఆయన అంతరంగాన్ని ఎంతమేరకు అర్థం చేసుకుంటున్నామో వెల్లడి చేస్తుంది. మనం సర్వకాలాల్లో, సర్వావస్థల్లో దేవుడి ఉద్దేశాలకు అనుగుణంగా ప్రవర్తించం. కానీ మన నుంచి ఆయన కోరుకుంటున్న గుణాలు ఏమిటో మనకు తెలుసు. అవే తోటివారి పట్ల దయ, ఔదార్యం! బలహీనులనూ, నిరుపేదలనూ కనిపెట్టుకొని ఉండాలనీ, వారి అవసరాలు తీర్చాలనీ, అదే నిజమైన క్రైస్తవం అనీ ఏసు ప్రభువు అనేక సందర్భాల్లో చెప్పాడు. ఇంతకాలం సరే... ఇప్పుడేం చేస్తున్నాం? ఏం చెయ్యాలి? ఆలోచించాల్సింది ఇదే! దైవంగా తన మీద ఉన్న భక్తి కన్నా, తను చూపిన మార్గంలో సాటివారికి సాయపడే గుణాన్ని ప్రభువు ఆమోదిస్తాడు. విశ్వాసులుగా చెప్పుకుంటున్న వాళ్ళలో ఎంతమంది తిండికి లేక అల్లాడుతున్న వారికి చేతనైనంత సాయాన్ని చేస్తారో తెలుసుకోవడానికి దైవం ఇప్పుడు పరీక్ష పెట్టాడు. ఆయన పట్లా, ఆయన మాటల పట్లా మన విశ్వాసం ఎంతటిదో మన చేతలతో చాటి చెబుదాం. ఆయన పెట్టిన పరీక్షలో గెలుద్దాం! నిజమైన దైవజనులం అని నిరూపించుకుందాం!


Updated Date - 2020-05-01T05:30:00+05:30 IST