మంత్రులేమీ హీరోలు కారు

ABN , First Publish Date - 2020-09-01T09:27:28+05:30 IST

మీడియాకు ప్రకటనల జారీలో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని, ప్రజాధనంతో జారీచేసే ప్రభుత్వ ప్రకటనల్లో వైసీపీ పతాక రంగులను వినియోగిస్తూ ప్రజలను

మంత్రులేమీ హీరోలు కారు

  • పదేపదే ఫొటోలు ప్రకటనల్లో అక్కర్లేదు
  • ప్రభుత్వం చేసేది తెలిసేలా ప్రకటనలు
  • అయితే, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం
  • హైకోర్టు జడ్జి రాకేశ్‌కుమార్‌ వ్యాఖ్యలు
  • సాక్షికే సింహభాగం యాడ్స్‌పై దాఖలైన పిల్‌ మరో ధర్మాసనానికి బదిలీ


అమరావతి, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): మీడియాకు ప్రకటనల జారీలో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని, ప్రజాధనంతో జారీచేసే ప్రభుత్వ ప్రకటనల్లో వైసీపీ పతాక రంగులను వినియోగిస్తూ ప్రజలను రాజకీయంగా ప్రభావితం చేస్తోందని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంను (పిల్‌) ప్రథమ ధర్మాసనం ముందుకు బదిలీ చేయాలని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం... రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకటనల జారీలో ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన జగతి పబ్లికేషన్స్‌ నేతృత్వంలోని సాక్షి దినపత్రికకు, ఇందిరా టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నేతృత్వంలోని సాక్షి టీవీకి అధిక ప్రాధాన్యమిస్తూ ఆ సంస్థలకు భారీగా ప్రజా ధనాన్ని పంచిపెడుతున్నారంటూ   విజయవాడకు చెందిన కిలారు నాగశ్రవణ్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.


ఈ పిల్‌పై సోమవారం ధర్మాసనం ముందు విచారణ జరిగింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రకటనల జారీ వ్యవహారంలో సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన ఆదేశాలకు విరుద్ధంగా రాష్ట్రప్రభుత్వం వివక్షతో, పక్షపాతంతో నడచుకుంటోందన్నారు. పైగా ఆ ప్రకటనలను వైసీపీకి చెందిన రంగులతో నింపుతోందని వివరించారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ..‘సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం నడచుకుంటున్నప్పుడు అక్కడే ఫిర్యాదు చేయవచ్చు కదా?’ అని ప్రశ్నించింది. ఇందుకు దమ్మాలపాటి సమాధానమిస్తూ.. ‘‘తమ తీర్పును చట్టంగా భావించాలని, దాని ప్రకారమే నడచుకోవాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అనుకూల మీడియాను ప్రోత్సహించడం, ఇతర మీడియాను పట్టించుకోకపోవడం సరికాదని కూడా స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఒకసారి నిబంధనలు ఖరారు చేశాక రాష్ట్ర ప్రభుత్వాలన్నీ అమలు చేయాల్సిందే.


అందుకు విరుద్ధంగా నడుచుకున్నప్పుడు పిటిషనర్‌ హైకోర్టును ఆశ్రయించవచ్చు’’ అని వివరించారు. ఈ వ్యవహారంపై ఎలా దర్యాప్తునకు ఆదేశించాలని ధర్మాసనం ప్రశ్నించగా.. ‘‘ఆర్‌టీఐ ప్రకారం పొందిన వివరాల మేరకు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన జరిగినట్లు స్పష్టమవుతోంది. దీనిపై ప్రత్యేకంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదు’’ అని దమ్మాలపాటి వివరించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ జోక్యం చేసుకుంటూ..సీఎం సహా ఇతరుల ఫొటోలు ప్రకటనలో ఉండడానికి తాను వ్యక్తిగతంగా వ్యతిరేకమని, పాట్నాలో తాను పని చేసేటప్పుడు ఒక్కో విద్యుత్‌ స్తంభానికి పలువురు నాయకుల ఫొటోలతో హోర్డింగులు ఉండేవని గుర్తు చేసుకున్నారు. దమ్మాలపాటి తన వాదనలు కొనసాగిస్తూ.. ప్రకటనల్లో సీఎం ఫొటో ఉంచడంపై పిటిషనర్‌కు ఎలాంటి అభ్యంతరం లేదని, ప్రస్తుత ప్రభుత్వ ప్రకటనల్లో ముఖ్యమంత్రి కాకుండా దివంగత నేతల ఫొటోలూ వాడుతున్నారన్నారు.


ముఖ్యమంత్రి దివంగత తండ్రి ఫొటో కూడా వాడుతున్నారన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ ప్రకటనల్లో ముఖ్యమంత్రి ఫొటో తప్ప ఇతరులవి వాడడానికి వీల్లేదన్నారు. అదేవిధంగా ప్రజాధనంతో ఇచ్చే ప్రభుత్వ ప్రకటనల్లో అధికార పార్టీ పతాక రంగుల్ని వినియోగిస్తున్నారన్నారు. ‘‘పార్టీ రంగులకు సంబంధించి గతంలో ఇదే కోర్టు తీర్పు ఇచ్చింది కదా?’’ అని ధర్మాసనం ప్రశ్నించగా.. ప్రభుత్వ భవనాలపై పార్టీల రంగులకు సంబంధించి తీర్పు ఇచ్చిందని, ప్రభుత్వ ప్రకటనలకు సంబంధించి అలాంటి ఆదేశాలు లేవని దమ్మాలపాటి వివరించారు. ఆయన వాదనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఈ పిల్‌ను ప్రథమ ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. 


ఇది రాజకీయ ప్రయోజన వ్యాజ్యం: అడ్వకేట్‌ జనరల్‌

అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ సదుద్దేశంతో పిల్‌ దాఖలు చేయలేదని, రాజకీయ ప్రయోజనం కోసమే కోర్టుకు వచ్చారని పేర్కొన్నారు. కేబినెట్‌ మంత్రుల ఫొటోలు కూడా వేసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందని, పిటిషనర్‌ తన పిటిషన్‌లో ఆ విషయాలను దాచిపెట్టారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలోనూ సీఎం ఫొటోతో పసుపురంగులో ప్రకటనలు ఇచ్చారన్నారు. అయితే ధర్మాసనం విచారణను వాయిదావేశాక అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపించడంపై దమ్మాలపాటి అభ్యంతరం వ్యక్తం చేశారు. తుదిగా న్యాయమూర్తి జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ వ్యాఖ్యానిస్తూ.. ‘‘ఏ మంత్రుల ఫొటోలైనా మాటిమాటికీ ప్రచురించడమనేది సరికాదని నా వ్యక్తిగత అభిప్రాయం. గత ప్రకటనలనూ నేను సమర్థించడం లేదు. ప్రభుత్వం చేసేది ప్రజలకు తెలిసేలా ప్రకటనలు ఉండాలి. అంతేతప్ప ఫొటోలను ప్రచురించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ పనిని ప్రజలకు తెలియజేయండి. మంత్రులేమీ  హీరోలు కాదు కదా!’ అని వ్యాఖ్యానించారు.


‘‘ఏ మంత్రుల ఫొటోలైనా మాటిమాటికీ ప్రచురించడమనేది సరికాదని నా వ్యక్తిగత అభిప్రాయం. గత ప్రకటనలనూ నేను సమర్థించడం లేదు. ప్రభుత్వం చేసేది ప్రజలకు తెలిసేలా ప్రకటనలు ఉండాలి. అంతేతప్ప ఫొటోలను ప్రచురించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ పనిని ప్రజలకు తెలియజేయండి. మంత్రులేమీ సినిమాల్లో హీరోలు కాదు కదా!’

జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌


‘సిట్‌’ పిటిషన్లపై విచారణ నేడు

రాజధాని అమరావతిలో భారీ భూకుంభకోణం జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు వేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటును సవాల్‌ చేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌లు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. ఈ పిటిషన్లపై సోమవారం న్యాయమూర్తి జస్టిస్‌ టి.రజనీ ముందు విచారణ జరగ్గా.. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లు ఫైల్‌లోకి చేరకపోవడంతో విచారణను వాయిదా వేశారు. 

Updated Date - 2020-09-01T09:27:28+05:30 IST