నన్ను క్షమించండి!

ABN , First Publish Date - 2020-09-01T08:20:04+05:30 IST

గడచిన 10రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన అత్యాచార బాధితురాలి కేసులో కొత్త మలుపు వెలుగుచూసింది

నన్ను క్షమించండి!

  • 139మంది అత్యాచారం చేశారన్నది అవాస్తవం..
  • వారిలో 40% మంది అమాయకులే
  • డాలర్‌ భాయ్‌ బెదిరింపుల వల్లే చేశా
  • క్షమాపణలు కోరిన బాధితురాలు
  • బ్లాక్‌మెయిల్‌ చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలి: మందకృష్ణ మాదిగ 

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): గడచిన 10రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన అత్యాచార బాధితురాలి కేసులో కొత్త మలుపు వెలుగుచూసింది. 139మంది అత్యాచారం చేశారంటూ పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో తాను చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదని బాధితురాలు సోమవారం స్పష్టం చేశారు. వారిలో 40శాతం మందికి పైగా అమాయకులే ఉన్నారని, వారంతా తనను క్షమించాలని కోరారు. డాలర్‌ భాయ్‌ అలియాస్‌ రాజా శ్రీకర్‌ రెడ్డి బెదిరింపుల వల్లనే ఆ విధంగా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ఎరుకల సంఘం తరఫున జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘డాలర్‌ భాయ్‌ నన్ను మానసికంగా, శారీరకంగా హింసించి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఎదురుతిరిగితే సైకోలా ప్రవర్తించి తీవ్రంగా కొట్టేవాడు. తను చెప్పినట్లు వినకపోతే నాతో పాటు నా కుటుంబసభ్యులను కూడా చంపేస్తానని బెదిరించాడు. అతడి ఒత్తిడి వలనే నాకు సంబంధం లేని వారిపై, సెలబ్రిటీలపై కేసును పెట్టాల్సి వచ్చింది. నేను పేర్కొన్న వారిలో ఉన్న యాంకర్‌, ఓ నటుడు కూడా అమాయకులే. డాలర్‌ భాయ్‌ చెర నుంచి బయటకు రావడానికి చాలా ప్రయత్నించాను. కానీ కుదిరేది కాదు. ఫోన్‌ కాల్‌ వస్తే స్పీకర్‌లో పెట్టి మాట్లాడాలి. ఆఖరికి బాత్‌ రూమ్‌కు వెళ్లినా కాపలా కాసేవాడు. నా జీవితంలో 50శాతం నరకం డాలర్‌భాయ్‌ వలనే అనుభవించాను. అతడు గతంలో ఇద్దరు అమ్మాయిలను ట్రాప్‌ చేసి ఇద్దరిని పెళ్లిళ్లు చేసుకున్నాడు. వారిలో ఒకరికి పాప ఉంది. ఒక భార్యను వేధించిన కేసు సీసీఎస్‌ మహిళా ఠాణాలో నమోదై ఉంది’’ అని బాధితురాలు వెల్లడించారు. తన కుటుంబీకులకు విషయం చెప్పాక వారి అండతో ప్రజల ముందుకు వచ్చినట్లు ఆమె తెలిపారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరి ఫోన్‌లోనైనా తన ఫోటోలు, వీడియోలు తొలగించాలని, వైరల్‌ చేయవద్దని విన్నవించారు. 


చట్టం దుర్వినియోగం కారాదు: మంద కృష్ణ

అత్యాచార బాధితురాలి గురించి విని షాక్‌కు గురయ్యానని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఇలాంటి నరకం అనుభవించిన పూలన్‌దేవిని ఈ ఘటన గుర్తుచేసిందని పేర్కొన్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పంజాగుట్ట పోలీసులతో పాటు సీసీఎస్‌ పోలీసుల నుంచి సేకరించాననన్నారు. ‘‘బాధితురాలితో రెండున్నర గంటల పాటు మాట్లాడి విషయాలు తెలుసుకున్నాను. ప్రాణహాని ఉన్న కారణంగా ఆమెకు భద్రత కల్పించే విషయాన్ని ప్రభుత్వం, పోలీసులు పరిశీలించాలి. బాధితురాలి ఫిర్యాదులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. ఆ చట్టం చాలా ప్రభావవంతమైనది. దాన్ని దుర్వినియోగం కాకుండా జాగ్రత్త పడాలి. లేదంటే అమాయకులు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. తండ్రి సమానుడిని. నా మీద ప్రమాణం చేసి నిజం చెప్పు అని అడిగితే మరెన్నో చేదు నిజాలను ఆమె తెలిపింది. ఆమెపై దాడిచేసిన మానవమృగాల్లో అన్ని వర్గాల వారూ ఉన్నారు. ఆమెతో మాట్లాడిన తర్వాత దాదాపు సగం మందికి కేసుతో సంబంధం లేదని స్పష్టమైంది. అమాయకులైన ప్రముఖుల పేర్లు కూడా రావడం విచారకరం. ఓ ఎంపీ పీఏ మాత్రం మానసికంగా వేధించాడని తెలిసింది. తొలిసారి ఓ విద్యార్థి నేత ఆమెను అదుపులో ఉంచుకుని వేధించాడు. ఆ తర్వాత చాలామంది చేతుల్లో చిక్కుకుంది. వారినుంచి తప్పించుకోబోయి చివరికి డాలర్‌ భాయ్‌ చేతుల్లో పావుగా మారింది’’ అని మందకృష్ణ వెల్లడించారు. డాలర్‌ భాయ్‌ను వెంటనే అదుపులోకి తీసుకుంటే కేసు  కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. నిందితుల్లో కొంతమంది సినీ ప్రముఖులు, కెమెరామెన్‌లు ఉన్నారని వారి పలుకుబడికి లొంగకుండా దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీబీఐతో విచారణ జరిపించాలని  డిమాండ్‌ చేశారు. కీలక నిందితుడు డాలర్‌ భాయ్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అతడు నిర్వహిస్తున్న గాడ్‌పవర్‌ ఫౌండేషన్‌ స్వచ్ఛంద సంస్థ కార్యాలయాన్ని పోలీసులు ఇప్పటికే సీజ్‌ చేశారు. అక్కడ లభించిన సర్టిఫికెట్ల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. వారిచ్చే సమాచారంతో కేసులో మరింత పురోగతి ఉండొచ్చని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. డాలర్‌ భాయ్‌ ఇప్పటికే టాస్క్‌ ఫోర్స్‌ పోలీసుల అదుపులో ఉన్నాడన్న వార్త వైరల్‌ కాగా.. అందులో వాస్తవం లేదంటూ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఖండించారు. 

Updated Date - 2020-09-01T08:20:04+05:30 IST