6.30 లక్షల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో

ABN , First Publish Date - 2020-09-01T08:37:12+05:30 IST

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో వర్షాలు

6.30 లక్షల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో

  • మేడిగడ్డకు పెరుగుతున్న ప్రవాహం
  • కాళేశ్వరంలో 11.29 మీటర్ల నీటిమట్టం

ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో వర్షాలు కురుస్తుండటంతో ప్రాణహిత నది నుంచి గోదావరిలోకి వరద చేరుతోంది. సోమవారం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద గోదావరి 11.29 మీటర్ల ఎత్తున ప్రవహిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీలోకి 6.30లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 65 గేట్లను ఎత్తి అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం నుంచి పలిమెల మండలం ముకునూర్‌ నీలంపల్లి వరకు లోతట్టు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. అన్నారం బ్యారేజీలోకి 15వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా 8 గేట్లను ఎత్తి అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మేడిగడ్డలో 6.50 టీఎంసీలు, అన్నారం బ్యారేజీలో 8.77 టీఎంసీల నీరు ఉంది. నాగార్జున సాగర్‌కు వరద ప్రవాహం స్వల్పంగా పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 22,396 క్యూసెక్కుల నీరు వస్తుండగా, అంతే నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588.40అడుగులకు నీరు చేరింది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 175(45.77టీఎంసీలు) అడుగులు కాగా, ప్రస్తుతం 175(45.77 టీఎంసీలు) అడుగుల మేర నీరు ఉంది. ప్రాజెక్టుకు 2,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, విద్యుత్తు కేంద్రం ద్వారా అంతే మొత్తంలో నీటిని వదులుతున్నారు. మూసీ ప్రాజెక్టుకు 1,070 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నిలకడగా కొనసాగుతుండటంతో రెండు గేట్లను అడుగు మేర ఎత్తారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 644.10 అడుగుల మేర నీరు ఉంది.  

Updated Date - 2020-09-01T08:37:12+05:30 IST