టెస్టుల్లో నెం.1 ర్యాంకు కోల్పోయిన ఇండియా

ABN , First Publish Date - 2020-05-02T00:27:50+05:30 IST

కరోనా కారణంగా క్రికెట్ అనే మాట కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఏ జట్టూ మైదానంలోకి దిగి మ్యాచ్ ఆడింది లేదు. ఏ ఆటగాడూ బ్యాట్ పట్టింది లేదు.. ...

టెస్టుల్లో నెం.1  ర్యాంకు కోల్పోయిన ఇండియా

న్యూఢిల్లీ: కరోనా కారణంగా క్రికెట్ అనే మాట కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఏ జట్టూ మైదానంలోకి దిగి మ్యాచ్ ఆడింది లేదు. ఏ ఆటగాడూ బ్యాట్ పట్టింది లేదు.. బంతి వేసింది లేదు.. కానీ, భారత్‌ టెస్టుల్లో తన నెంబర్ వన్ ర్యాంకును కోల్పోయింది. 2016 నుంచి నాలుగేళ్లుగా ఏకఛత్రాధిపత్యంగా ప్రథమ స్థానాన్ని ఏలుతున్న టీం ఇండియా మొట్టమొదటి సారి తన స్థానాన్ని కోల్పోయింది. ఐసీసీ ఈ విషయాన్ని వెల్లడించింది. 2019 సీజన్‌లో జరిగిన అన్ని మ్యాచుల్లో ఆయా జట్లు సంపాదించిన 100 శాతం పాయింట్లు, 2017, 2018 సీజన్లలో సంపాదించిన పాయింట్లలో 50 శాతం కలిపి ఈ ఏడాది టెస్ట్ జట్ల ర్యాంకులను ఐసీసీ ప్రకటించింది. దీని ప్రకారం ఇప్పటివరకు టాప్‌లో కొనసాగిన ఇండియా 114 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది. కాగా ఆస్ట్రేలియా 116 పాయింట్లతో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోగా, న్యూజిలాండ్ 115 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. 


2016-17 సీజన్‌లో భారత్ 12 టెస్టులు ఆడి కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది. అంతేకాకుండా ఆడిన ఐదు టెస్టు సిరీసులను ఇండియానే సొంతం చేసుకుంది. ఈ సిరీసుల్లో  ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లపై ఆడిన సిరీసులు కూడా ఉన్నాయి. అయితే ఇండియా చేతుల్లో ఓడిపోయిన  ఆస్ట్రేలియా సౌతాఫ్రికాపై జరిగిన సిరీస్‌ను కూడా కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఇండియా టాప్‌ ర్యాంక్ కోల్పోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించకమానదు. అయితే 2016-17ల్లో ఇండియా సాధించిన కొన్ని రికార్డులను ఐసీసీ పరిగణలోకి తీసుకోకపోవడంతో ఆస్ట్రేలియా నెంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకుంది. తాజా ర్యాంకింగ్స్ వల్ల సౌతాఫ్రికా ఏకంగా 8 పాయింట్లు కోల్పోయి ఆరో స్థానానికి పడిపోయింది. ఇదిలా ఉంటే 2003లో టెస్ట్ ర్యాంకింగ్స్‌ను ఐసీసీ పరిచయం చేసిన తర్వాత ఇంత తక్కువ పాయింట్ల తేడాతో మొదటి మూడు జట్టు ఉండడం ఇది రెండో సారి మాత్రమే. 

Updated Date - 2020-05-02T00:27:50+05:30 IST