ఈ తిండి తింటే చస్తాం!

ABN , First Publish Date - 2020-05-01T09:39:47+05:30 IST

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఐసొలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న పలువురు కరోనా పాజిటివ్‌ వ్యక్తులతో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు గురువారం ..

ఈ తిండి తింటే చస్తాం!

ఐసొలేషన్‌లో ఆకలి కేకలు

వాట్సా్పలో ఓ రోగి ఫిర్యాదు

పరామర్శించిన మంత్రికీ ఓ బాధితుడు ఇదే గోడు


‘మాకు ఐసొలేషన్‌ వార్డులో సరిగ్గా తిండి పెట్టడం లేదు. నాణ్యమైన, బలవర్థకమైన ఆహారం ఇవ్వకపోతే ఎలా కోలుకోగలం? సరైన ఆహారం ఇవ్వకుంటే మేమంతా ఇక్కడే చనిపోవడం ఖాయం.’ - కరోనా పాజిటివ్‌ వ్యక్తి కృష్ణాజిల్లా అధికారులకు పంపిన వాట్సాప్‌ ఇది!


విజయవాడ, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఐసొలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న పలువురు కరోనా పాజిటివ్‌ వ్యక్తులతో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు గురువారం వీడియోకాల్‌ ద్వారా మాట్లాడారు. ఆస్పత్రిలో సౌకర్యాలు బాగాలేవని, తమను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని, తాగునీటికీ ఇబ్బందిపడుతున్నామని, ఆహారం సరిగా ఉండటం లేదని ఓ వ్యక్తి స్వయంగా మంత్రికే తన గోడు చెప్పుకొన్నాడు. సరైన సౌకర్యాలు లేవు.. సరైన ఆహారం పెట్టడంలేదన్న ఆరోపణలు ఇప్పటివరకు క్వారంటైన్‌ కేంద్రాల్లోనే వినిపించేవి. కరోనా బారినపడి. పోరాటం చేస్తున్నవారికి ఐసొలేషన్‌ వార్డుల్లోనూ కనీస సౌకర్యాలు ఉండటం లేదని తాజాగా తెలుస్తున్న విషయం. కృష్ణాజిల్లా విజయవాడ కార్మికనగర్‌లోని ఓ వ్యక్తి కరోనా బారినపడ్డారు. ఆయనను ఏప్రిల్‌ 20న విజయవాడ ప్రభుత్వాస్పత్రి ఐసొలేషన్‌ వార్డుకు తరలించారు.


పెద్దహాలులో ఉన్న ఆరు బెడ్లలో ఒకటి కేటాయించారు. అక్కడి పరిస్థితులపై ఠారెత్తిపోయిన ఆయన పలుమార్లు జిల్లా అధికారులకు మొరపెట్టుకున్నారు. పరిస్థితులను చక్కదిద్దుతామని వారు హామీ ఇచ్చినా ఏ మార్పు లేదంటూ బాధితుడు గురువారం అధికారులకు మరోసారి వాట్సాప్‌ ద్వారా మొరపెట్టుకున్నారు. అదే సందేశాన్ని ‘ఆంధ్రజ్యోతి’కి పంపారు. ఆయన వాట్సాప్‌ సారాంశం.. ‘సర్‌ నా వయసు 54 ఏళ్లు. మధుమేహంతో బాధపడుతున్నా. మాకు ఇచ్చే కూరలు, పప్పు వాసనొస్తున్నాయి. ఈ నాసిరకం ఆహారం తినబుద్ధి కావడంలేదు. ఇలాంటి ఆహారం తింటే కరోనాతో కాకుండా కలుషిత ఆహారం తిని చనిపోవాల్సి వస్తుందని ఆందోళనగా ఉంది. ఉదయం 9.30కి గానీ అల్పాహారం రావడంలేదు. రాత్రి 10గంటలకు భోజనం ఇస్తున్నారు. అరకొర, నాసిరకం ఆహారాన్ని అందిస్తున్నారు’. 

Updated Date - 2020-05-01T09:39:47+05:30 IST