సంక్షోభంలో ఐటీ పరిశ్రమ

ABN , First Publish Date - 2020-05-01T09:07:02+05:30 IST

ఐటీ రంగంలోని చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారక రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

సంక్షోభంలో   ఐటీ పరిశ్రమ

రాయితీలు విడుదల చేయండి

కంపెనీలకు రుణాలిస్తే 

ఉద్యోగాలు సేఫ్‌!కేంద్ర మంత్రికి కేటీఆర్‌ లేఖ


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): ఐటీ రంగంలోని చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారక రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని ఐటీ కంపెనీలు ఎదుర్కొంటున్న సంక్షోభంపై ఆయన గురువారం కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌కు లేఖ రాశారు. హైదరాబాద్‌లో సుమారు 6 లక్షల మంది ఐటీ ఉద్యోగులు పని చేస్తున్నారని, ప్రస్తుత సంక్షోభ ప్రభావం వారిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉందని తెలిపారు. ఈ ప్రభావం చిన్న కంపెనీలపై అధికంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా కంపెనీలకు  కొన్ని మినహాయింపులు ఇచ్చి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు కేంద్రం నుంచి రావాల్సిన ఐటీ, జీఎస్టీ పన్నుల రీఫండ్లను సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలని కోరారు.


సూక్ష్మ, మధ్య మధ్యతరహా సంస్థలకు కనీసం 50 శాతం రుణ సదుపాయాన్ని పెంచాలని, తద్వారా మూడు నుంచి నాలుగు నెలల పాటు ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు వీలు కలుగుతుందని, దీంతో కరోనా సంక్షోభం మూలంగా ఉద్యోగుల తొలగింపులు జరగకుండా ఉంటాయని మంత్రి తెలియజేశారు. సుమారు మూడు నుంచి నాలుగు నెలల పాటు ఎలాంటి వడ్డీ లేకుండా రుణాలు ఉండాలన్నారు. ఈ రుణాలను తిరిగి వసూలు చేేసందుకు కనీసం 12 నెలల కాలాన్ని నిర్దేశించాలన్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లు ప్రత్యక్ష ప్రయోజనాలను పొందేందుకు 2020 మార్చి 31 తుది గడువుగా ఉందని, దీన్ని కనీసం వచ్చే ఏడాది వరకు పొడిగించాలని  సూచించారు. 


పెట్టుబడుల ఆకర్షణకు సిద్ధంగా ఉండాలి

  ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తమ పెట్టుబడులను నూతన ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో వీటిని ఆకర్షించేందుకు తెలంగాణ సిద్దంగా ఉండాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. గురువారం బేగంపేటలోని టీ.ఫైబర్‌ కార్యాలయంలో కేటీఆర్‌ ఐటీ, పరిశ్రమల శాఖలలోని వివిధ విభాగాల డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కొవిడ్‌-19 సంక్షోభం తర్వాత యధావిధిగా రాష్ట్రంలోని పారిశ్రామిక రంగ కార్యకలాపాలు కొనసాగించేందుకు తగిన చర్యలుతీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుత సంక్షోభం త్వరలో తొలగిపోతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో పరిశ్రమల్లోని పరిస్థితులు మారుతాయని, సామాజిక దూరం, వ్యక్తిగత శుభ్రత కొనసాగుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితులతో కొన్ని ఇబ్బందులున్నప్పటికీ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పూర్తి స్థాయిలో పూర్వం మాదిరిగా కొనసాగడానికి ఇప్పటి నుంచే ఆయా వర్గాలతో మాట్లాడాలని సూచించారు.  

Updated Date - 2020-05-01T09:07:02+05:30 IST