జమ్మికుంట పోలీస్‌స్టేషన్‌కు దేశంలోనే పదో స్థానం

ABN , First Publish Date - 2020-12-04T07:53:53+05:30 IST

తెలంగాణ పోలీసులు మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో జరిగిన పోటీలో కరీంనగర్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని జమ్మికుంట

జమ్మికుంట పోలీస్‌స్టేషన్‌కు దేశంలోనే పదో స్థానం

నాలుగేళ్లుగా రాష్ట్ర పీఎ్‌సల పైచేయి

కరీంనగర్‌కు మూడోసారి గుర్తింపు

హోంమంత్రి, డీజీపీ అభినందనలు


హైదరాబాద్‌, కరీంనగర్‌ క్రైం, న్యూఢిల్లీ, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పోలీసులు మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో జరిగిన పోటీలో కరీంనగర్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని జమ్మికుంట ఠాణాకు టాప్‌-10 స్థానం దక్కింది. గత ఏడాది కూడా ఇదే కమిషనరేట్‌ పరిధిలోని చొప్పదండి పోలీ్‌సస్టేషన్‌ జాతీయ స్థాయిలో 8వ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా అత్యుత్తమ పోలీ్‌సస్టేషన్లకు కేంద్రం ఈ సంవత్సరం ర్యాంకులు ప్రకటించింది.


2020కి గాను జమ్మికుంట పోలీ్‌సస్టేషన్‌ను టాప్‌-10గా కేంద్రం ప్రకటించింది. పెద్ద రాష్ట్రాల నుంచి మూడు పోలీ్‌సస్టేషన్లు, చిన్న రాష్ట్రాల నుంచి రెండు పోలీ్‌సస్టేషన్లు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఒక్కో పోలీ్‌సస్టేషన్‌ను ఎంపిక చేస్తారు. దేశవ్యాప్తంగా 16 వేలకుపైగా పోలీ్‌సస్టేషన్లు పోటీ పడ్డాయి. ఠాణాలకు వచ్చే ఫిర్యాదులు, వాటి సత్వర పరిష్కారం, నేరాల నియంత్రణ, మౌలిక సదుపాయాల కల్పన, కేసుల వివరాలను డిజిటలీకరించడం, ప్రజలు నేరుగా పోలీ్‌సస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసే పరిస్థితిని కల్పించడం వంటి అంశాలను కేంద్రం పరిగణలోకి తీసుకుంటుంది. వీటితోపాటు.. రికార్డుల నిర్వహణ తీరు, కౌన్సెలింగ్‌ గదులు, విద్యుత్తు సదుపాయం, స్టేషన్‌ ఆవరణలో పచ్చదనం, పార్కింగ్‌ వంటి అంశాలనూ పరిశీలిస్తారు. అలా నామినేట్‌ అయ్యే పోలీ్‌సస్టేషన్లపై ప్రత్యేకంగా సర్వే నిర్వహిస్తారు. అన్నిట్లోనూ ఉత్తమ ప్రతిభను గుర్తించి, ఉత్తమ ఠాణాను ఎంపిక చేస్తారు.


నాలుగేళ్లుగా వరుస రికార్డులు...

తెలంగాణ ఆవిర్భావం తర్వాత.. ప్రభుత్వం పోలీసు శాఖ ఆధునికీకరణ, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చింది. దాంతో.. నాలుగేళ్లుగా జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీ్‌సస్టేషన్లు గుర్తింపు పొందుతున్నాయి. 2017లో పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ దేశంలో 2వ ఉత్తమ పోలీ్‌సస్టేషన్‌గా నిలిచింది. 2018లో రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని నారాయణపూర్‌ ఠాణాకు 14వ స్థానం దక్కింది.


2018లో కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు సేఫ్‌ అండ్‌ సెక్యూరిటీ విభాగంలో జాతీయ స్థాయిలో నాలుగో స్థానం లభిచింది. గత ఏడాది కరీంనగర్‌ కమిషనరేట్‌లోని చొప్పదండి పోలీ్‌సస్టేషన్‌ 8వ స్థానంలో నిలవగా.. తాజాగా జమ్మికుంట పీఎస్‌ 10వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఘనత సాధించడంపై కరీంనగర్‌ పోలీసులను హోంమంత్రి మహమూద్‌అలీ అభినందించారు. జమ్మికుంట పీఎస్‌కు గుర్తింపు రావడంపై డీజీపీ కూడా మహేందర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్‌ సీపీ వీబీ కమలాసన్‌రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.


Updated Date - 2020-12-04T07:53:53+05:30 IST