కరోనాతో కలిసి బతకాల్సిందే!

ABN , First Publish Date - 2020-05-01T06:06:55+05:30 IST

కొవిడ్ 19 పేరుతో ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా కొత్త రూపాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకుంటున్నట్టు లేదు. పాలకులు, పండితులు దీన్ని తరిమికొడతాం, పాతరేస్తాం, చీల్చి చండాడుతాం అని కత్తులు దూస్తున్నారు...

కరోనాతో కలిసి బతకాల్సిందే!

కరోనా మనిషి నిర్మించుకున్న కొన్ని వేల సంవత్సరాల సంస్కృతిని, నాగరికతను సమూలంగా మార్చివేయబోతోంది. ఒక కొత్త సామాజిక, మానవ సంబంధాలకు పునాది వేస్తోంది. మానవ జాతి సామాజిక జీవన వికాసక్రమంలో కరోనా పూర్వదశ ఒకటయితే, కరోనాదశ మరొకటి కాబోతోంది. ఇప్పుడు మనం నేర్చుకోవలసింది ఈ సరికొత్త జీవిత భాగస్వామితో కలిసి ఎలా జీవించాలని మాత్రమే. 


కొవిడ్ 19 పేరుతో ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా కొత్త రూపాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకుంటున్నట్టు లేదు. పాలకులు, పండితులు దీన్ని తరిమికొడతాం, పాతరేస్తాం, చీల్చి చండాడుతాం అని కత్తులు దూస్తున్నారు. కొందరు అశాస్త్రీయమైన, అసాంఘికమైన సాంస్కృతిక పెడధోరణులను ప్రచారం చేస్తున్నారు. మత నియమాలు, వ్రత నిష్ఠలను వల్లెవేస్తున్నారు. నిజానికి ఇవేవీ మనల్ని కాపాడలేవనే విషయాన్ని ప్రజలకు అర్థం చేయించాల్సిన సమయమిది. సమస్య గెలుపు, ఓటములది కాదని, చావు బతుకులదని తెలియజేప్పాల్సిన సందర్భమిది. వైరస్ విసురుతున్న విషపు వలలో చిక్కకుండా తప్పించుకోవడమే ఇప్పటికిప్పుడు మనిషి చేయాల్సిన పని.


ఎప్పుడైనా సరే సంక్షోభాలే నూతన ఆలోచనలకు, విచారధారలకు, ఆవిష్కరణలకు కారణం అవుతాయి. చరిత్రపొడుగునా ఇదే జరిగింది. ప్రకృతి విపత్తులు, ఉపద్రవాలు, యుద్ధాలు సృష్టించిన సామాజిక, ఆర్థిక రాజకీయ సంక్షోభాలే శాస్త్ర, సాంకేతిక, సామాజిక శాస్త్రాల వికాసానికి, పరిశోధనలకు, ఆవిష్కరణలకు కారణం అయ్యాయి. రాజ్యాలు, ఆధిపత్యాలు, యుద్ధాలు సంఘర్షణలు లేకపోతే రాజనీతి శాస్త్రం, ప్రజా పరిపాలనా శాస్త్రంతో పెద్దగా పని కూడా ఉండకపోయేది. అలాగే జీవ, జన్యు, వైద్య, విజ్ఞాన శాస్త్రాలు కూడా విలసిల్లకపోయేవి. వందేళ్లకింద (1918–-20) స్పానిష్ ఫ్లూ రాకపోయి ఉంటె ప్రజారోగ్యం అనేది ఉండేది కాదు. వందేళ్ల క్రితం వైద్యం ప్రజలది కాదు, రాజులది, పూజారులది, చర్చిలది, నవాబులది ఇంకా చెప్పాలంటే సంపన్నులది. స్పానిష్ ఫ్లూ ప్రభావంతో తమ ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యతను ఆయా రాజ్యాలు, మతసంస్థలు, సంస్థానాలు గుర్తించాయి. మొదటగా 1920లో రష్యా ‘ప్రజారోగ్య వ్యవస్థ’కు అంకురార్పణ చేసింది. అలాగే జెర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ కూడా ప్రజారోగ్య వ్యవస్థలను ఏర్పాటు చేశాయి. భారత దేశంలో కూడా ప్రజారోగ్య విభాగాన్ని ఏర్పాటు చేసింది, దాన్ని మునిసిపాలిటీలకు అప్పగిస్తూ నిర్ణయం కూడా 1920-–21లోనే. అప్పుడే వైరస్‌ల మీద ప్రపంచం దృష్టి సారించింది. ఇప్పుడు కూడా బహుశా ఈ శతాబ్దంలోనే మొట్టమొదటి సారిగా అన్ని శాస్త్రీయ విజ్ఞాన విభాగాలు మళ్ళీ చురుకుగా పనిచేయడం ప్రారంభించాయి. ప్రపంచవ్యాప్తంగా కనీసం ముప్ఫైదేశాల్లో వందలాది విభాగాలు, వేలాది మంది శాస్త్రవేత్తలు కొవిడ్‌కు విరుగుడు కనిపెట్టే పరిశోధనల్లో తలమునకలై ఉన్నారు. అయినా సరే ఇంకో ఏడాది పాటు ఎదురుచూడాల్సిందేనని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. తప్పకుండా త్వరలోనే కరోనాకు విరుగుడు ఉంటుంది.


కానీ, చాలా మంది అమాయకంగా ఈ లాక్‌డౌన్ అయిపోగానే కరోనా అంతరిస్తుందని అనుకుంటున్నారు. కొందరయితే కరోనా అనంతర జీవితం గురించి కలలుగంటున్నారు. అసలు కరోనాకు అంతం, ఆ అనంతరం జీవితం ఉంటుందా? అనేది శాస్త్రవేత్తలను వేధిస్తోన్న ప్రశ్న. ఎందుకంటే వైరస్‌లను అంతం చేయడం ఒక దీర్ఘకాలిక పోరాటం. 1919లో మొదలయిన స్పానిష్ ఫ్లూ అప్పుడే ఐదు కోట్ల మందిని అంతం చేసింది. అది ఇంకా వివిధ రూపాల్లో ప్రత్యక్షం అవుతూనే ఉంది. ఇప్పుడు ఇంకా వేధిస్తోన్న స్వైన్ ఫ్లూకు మూలం కూడా అదేనని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఇప్పటికీ ప్రపంచ జనాభాలో కనీసం 55శాతం మంది దీని బారిన పడుతున్నారు. అనేక మందులు వైద్య సదుపాయాలూ ఉన్నప్పటికీ ప్రతి ఏడాది మూడు నుంచి ఆరు లక్షలమంది పడిశం బారినపడి మరణిస్తున్నారు.


ఈ వైరస్ రూపాంతరం చెందుతున్నది తప్ప అంతం కాలేదు. అలాగే మశూచి. మూడో శతాబ్దంలో ఈజిప్టు మమ్మీలలో మొదలై 1980 దాకా ప్రపంచమంతా విస్తరించి వందలకోట్ల మందిని చంపేసింది. ఈ వైరస్ అంతరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించినప్పటికీ దీనికి సంబంధించిన కొత్త రూపం ఒకటి ఇంకా ఉందని వైద్యులు చెపుతున్నారు. మరో వైరస్ రేబిస్. కుక్కలలో పొదిగే ఈ వైరస్ కూడా 1920 ప్రాంతంలోనే పుట్టింది. ఇప్పటికీ అంతంకాలేదు. కుక్కలకు వ్యాక్సిన్లు వేసి మనల్ని మనం కాపాడుకోవాల్సిన దుస్థితి మనది. అందుకేనేమో, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎలాగూ కరోనాకు మందులేదు కాబట్టి ఈ వైరస్ పొదిగే మనుషులకు ‘క్రిమి సంహారకాలు’ ఎక్కిస్తే సరి అంటున్నాడు. ఇది మనకు హాస్యాస్పదంగా అనిపించవచ్చు, కానీ వైరస్‌లకు విరుగుడు వాక్సిన్ ఒక్కటే. కరోనా వాక్సిన్ రావడానికి సమయం పడుతుంది. అందరికీ అందుబాటులోకి వచ్చి, అందరూ వేసుకోవడానికి మరింత సమయం పడుతుంది. ఒక్క మన దేశంలోనే ఇప్పుడున్న జనాభాకు వాక్సిన్లు వేయడం ఖర్చుతో పాటు సమయంతో కూడుకున్న వ్యవహారం. ఒకవేళ అందరం టీకాలు వేసుకున్నా కరోనా ఉంటుంది, మనమూ క్షేమంగా ఉంటాం. మనలోనే ఉండే కరోనా మన మీద ప్రభావం చూపకుండా వేసుకునే పర్సనల్ ప్రొటెక్షన్ కిట్ (పీపీఈ) లాగా ఈ టీకా పనిచేస్తుంది.


ఇప్పుడు కరోనా మనకు అనివార్య సహచరి. లాక్‌డౌన్ తొలగించే నాటికి కరోనా అంతమౌతుందని ఆశపడకుండా ఆ వైరస్‌తో ఎలా సహజీవనం చేయాలి అనేది ఆలోచించాలి. ఈ సహజీవనంలో దానిని తాకకుండా అంటే దాని వాహకం అయిన మరో మనిషిని తాకకుండా ఎలా బతకాలి అనేది ఆలోచించాలి. ఒక దగ్గు, జలుబు, -పడిశం, టీబీ, కుష్టు, ఎయిడ్స్ తదితర వ్యాధిగ్రస్తులున్న సమాజంలో ఎలా బతుకుతున్నామో రేపు అలాగే బతకడం అలవాటు చేసుకోవాలి. అంటుకుంటేనే అల్లుకుపోయే విలక్షణమైన వైరస్ కాబట్టి అస్పృశ్యతే ఇప్పుడు ఆత్మరక్షణకు ఆయధం కాబోతుంది. ఇది ఒకరకంగా సోషలిస్ట్ వైరస్, చైనాలో పుట్టినందుకు కాదు, టీబీ లాగా పేదవారికి మాత్రమే సోకదు. జలుబు లాగా శీతల కాలంలోనే, శీతలదేశాల్లోనే రాదు. ప్రపంచంలో, మనుషుల ఆనవాళ్లున్న అన్ని దేశాల్లో ఉంది. రాజులు, రాణులు, ప్రధానులు మొదలు పేద, ధనిక తేడా లేకుండా అందరినీ అల్లుకుంటోంది. మనిషిని మనిషి అంటుకోకుండా చూసుకోవడం ఒక్కటే మార్గం. ఇది మానవాళికి పెద్ద సవాలు. మొత్తం జీవరాశులలో మనిషికి మాత్రమే భావోద్వేగాలు ఎక్కువ, కుటుంబ సాహచర్యం, సాంఘీక జీవితం ఎక్కువ. కరచాలనాలూ, కౌగిలింతలు, సామూహిక గోష్ఠులు, సమ్మేళనాలు, కూటములు మనుషులకు మాత్రమే ఉండే సామాజిక వ్యక్తీకరణలు. ఇవి ఇకపై అలాగే ఉండకపోవచ్చు.


ఉత్సవాలు, ఊరేగింపులు, పార్టీలు, పబ్బులు, వివాహాది సందర్భాల్లో వేలాదిమందితో వేడుకలు ఇకపై ఉండకపోవచ్చు. భజనలు, జాతరలు, కూటములకు ఇకపై కాలం చెల్లవచ్చు. ఎందుకంటే ఈ వైరస్ ‘సామాజికంగా’ మనుషులు కనీస దూరం పాటించాలని అంటోంది. అలాగే  భావోద్వేగాలే కాదు భావ వ్యక్తీకరణకు కూడా పరిమితులు తప్పకపోవచ్చు. మనం మొహంలో పలికించే హావభావాలు మాస్కుల వెనుక మాయం కావొచ్చు. సబ్బులు, షాంపూలతో పాటు హ్యాండ్ వాషర్లు, శానిటైజెర్‌లు మన నిత్యావసర సరుకుల్లో భాగం కావొచ్చు. కరోనా మనిషి నిర్మించుకున్న కొన్ని వేల సంవత్సరాల సంస్కృతిని, నాగరికతను సమూలంగా మార్చివేయబోతోంది. ఒక కొత్త సామాజిక, మానవ సంబంధాలకు పునాది వేస్తోంది. మానవ జాతి సామాజిక జీవన వికాసక్రమంలో కరోనా పూర్వదశ ఒకటయితే, కరోనాదశ మరొకటి కాబోతోంది. ఇప్పుడు మనం నేర్చుకోవలసింది ఈ సరికొత్త జీవిత భాగస్వామితో కలిసి ఎలా జీవించాలని మాత్రమే. కరోనానంతర దశను కాలమే నిర్ణయిస్తుంది!.

డా. రాహుల్ రాజారామ్

సామాజిక, రాజకీయ పరిశోధకుడు

Updated Date - 2020-05-01T06:06:55+05:30 IST