విజయంపై కమలం ధీమా

ABN , First Publish Date - 2020-12-04T08:54:30+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రాబోతున్నాయని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ధీమాగా ఉంది.

విజయంపై కమలం ధీమా

 ఓటు బ్యాంకు గణనీయంగా పెరుగుతుంది

 జీహెచ్‌ఎంసీలో పాగా వేస్తామంటున్న పార్టీ నేతలు

హైదరాబాద్‌, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రాబోతున్నాయని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ధీమాగా ఉంది. నగర ఓటర్లు తమకే పట్టం కట్టబోతున్నారని, తమ ఓటు బ్యాంకు అనూహ్యంగా పెరగటం ఖాయమని భావిస్తోంది. ఐదేళ్ల కిందట జరిగిన గ్రేటర్‌ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉన్నా, కేవలం 4 డివిజన్లకే పరిమితమైన నేపథ్యంలో, ఈసారి అనూహ్య ఫలితాన్ని సాధించబోతున్నామన్న నమ్మకంతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. పార్టీకి సాంప్రదాయంగా ఉన్న ఓటుబ్యాంకు సమీకరించుకోవడంలో కృతకృత్యులయ్యామని ముఖ్యనేతలు పేర్కొంటున్నారు.


జంటనగరాల్లో బీజేపీకి గట్టి ఓటు బ్యాంకు ఉందని, మూడు దశాబ్దాలుగా(ఒకటి, రెండుసార్లు మినహా) లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుని తమ సత్తా చాటుతుండడమే ఇందుకు ఉదాహరణ అని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఈ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటు సమీకరణ చేయించుకోలేకపోయాం. ఇప్పుడు గ్రేటర్‌ ఎన్నికల్లో లోక్‌సభ ఎన్నికల తరహాలో సాంప్రదాయ ఓటుబ్యాంకు సమీకరణ చేసుకోగలిగాం’ అని బీజేపీ కీలక నేత ఒకరు చెప్పారు.


‘పాతబస్తీలో పోలింగ్‌శాతం గణనీయంగా తగ్గడం మాకు అనుకూలమే అని భావిసున్నాం. 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఒక్కో సెగ్మెంటులో ఒకటి, రెండు డివిజన్‌లలో హిందువుల ఓటుబ్యాంకు గణనీయంగా ఉంది. అది మాకు అనకూలం కాబోతోంది’ అని రాష్ట్ర పార్టీ ముఖ్యనేత ఒకరు విశ్లేషించారు

. కాగా, శుక్రవారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ గురువారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సమావేశమైంది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, ఎంపీ అర్వింద్‌, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-04T08:54:30+05:30 IST