మంత్రదండాలే కానీ, మహాప్రమాదం

ABN , First Publish Date - 2020-05-01T06:15:45+05:30 IST

QE కానీ, హెలికాప్టర్ మనీ కానీ ఆలోచనల్లో అద్భుతంగా కనిపిస్తాయి. ఆచరణలో మాత్రం అవి చిట్టచివరి మార్గాలు. ఎంతో జాగ్రత్తగా అడుగులు వెయ్యకపోతే వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తాయి. వాటిని అర్థం చేసుకుని, ప్రస్తావించి, ప్రతిపాదించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగా అభినందనీయులు...

మంత్రదండాలే కానీ, మహాప్రమాదం

రాష్ట్రాలు అత్యంత సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న మాట వాస్తవం. వైద్య సదుపాయాలు మెరుగుపరచడానికి, ప్రజల నిత్యావసరాలు తీర్చడానికీ, ఉపాధి చూపడానికి, అత్యవసర సేవలు అందించడానికీ ఈ లాక్‌డౌన్ సమయంలో ఆర్థిక సహాయం తప్పక కావాలి. కేసీఆర్ చెప్పినట్లు అది హెలికాప్టర్ మనీ కాకపోతే ఏరోప్లేన్ మనీ... పేరేదైతేనేం, రాష్ట్రాలకు సహాయం అత్యవసరం. ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రతిపాదనకి కేంద్రం సానుకూలంగా స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉంది.


QE కానీ, హెలికాప్టర్ మనీ కానీ ఆలోచనల్లో అద్భుతంగా కనిపిస్తాయి. ఆచరణలో మాత్రం అవి చిట్టచివరి మార్గాలు. ఎంతో జాగ్రత్తగా అడుగులు వెయ్యకపోతే వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తాయి. వాటిని అర్థం చేసుకుని, ప్రస్తావించి, ప్రతిపాదించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగా అభినందనీయులు.


కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికై సహాయం కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏప్రిల్ 11న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక లేఖ రాసారు. ఇటువంటి ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ సహాయం ఆశిస్తూ లేఖలు రాయడం మామూలుగా జరుగుతూండే విషయమే. ఐతే కేసీఆర్ రాసిన లేఖలో ప్రత్యేకత ఏమిటంటే ఆయన ప్రధానమంత్రికి కొన్ని సూచనలు చేసారు. అమెరికా, యూరప్, చైనా వంటి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలాగే మనదేశంలో కూడా QE (Quantitative Easing – పరిమాణాత్మక సరళీకరణ), హెలికాప్టర్ మనీ మొదలైన విధానాల ద్వారా అదనపు వనరులు సమకూర్చవచ్చని సలహా ఇచ్చారు. ఇలా కాక మరో విధంగా వనరులు సమకూర్చుకునే అవకాశం లేదనే విషయమై ఆయనకు అవగాహన ఉండడం, దానికి అనుగుణంగా కేంద్రానికి సిఫార్సు చేయడం నిజంగా అభినందనీయం. కేసీఆర్ గారి ఈ లేఖను అర్థం చేసుకోవడానికి ముందు మనం ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలి. అసలు QE అంటే ఏమిటి? హెలికాప్టర్ మనీ అంటే ఏమిటి? వీటిని అమలు చేయడం మన దేశంలో సాధ్యపడే విషయమేనా? ఇలాంటివి ఆచరణలో పెట్టడానికి రిజర్వ్ బ్యాంక్‌కు అధికారం ఉందా?


ద్రవ్యోల్బణం అదుపు తప్పకుండా చూసుకుంటూ, సాధ్యమైనంత వృద్ధి సాధించడం చాలా అవసరం. ఆర్థిక రంగంలో వృద్ధి, ద్రవ్యోల్బణం సరైన పద్ధతిలో ఉండేటట్లు చూడడం రిజర్వ్ బ్యాంక్ ప్రధాన బాధ్యతలలో ఒకటి. వృద్ధి రేటు పెంచుకోవాలని ప్రతి ఆర్థిక వ్యవస్థా ఆశిస్తుంది. ఇది ప్రభుత్వ ఆర్థిక విధానాల (fiscal policies) మీద, అనేక ఇతర విషయాల మీద ఆధారపడి ఉంటుంది. నగదు విధానాలు (monetary policy) మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఆధీనంలో ఉంటాయి. నగదు విధానం వృద్ధికి సహా యం చెయ్యదు కానీ ఆశించిన వృద్ధి రేటుకి అనుగుణంగా వృద్ధీ, ద్రవ్యోల్బణం ఉండేలా చూసుకుంటూ ఉంటుంది. వృద్ధి అనుకున్నంతగా లేనప్పుడు, ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్న సందర్భాలలో రిజర్వ్ బ్యాంక్ రుణాలు ఇవ్వడాన్ని, తీసుకోవడాన్నీ ప్రొత్సహిస్తుంది. అలాగే ద్రవ్యోల్బణం అదుపు తప్పుతున్నప్పుడు రుణాలు ఇవ్వడాన్ని, తీసుకోవడాన్నీ నియంత్రిస్తుంది. ఇలా నియంత్రించడానికి రిజర్వ్ బ్యాంక్ వద్ద రెండు ప్రధాన ఆయుధాలు ఉన్నాయి. 


అందులో ఒకటి రెపో రేటు. బ్యాంకులకు అత్యవసరంగా వనరులు కావలసినప్పుడు తప్పనిసరి పరిస్థితిలో రిజర్వ్ బ్యాంక్ దగ్గరకి వెళ్తాయి. అలాంటప్పుడు రిజర్వ్ బాంకు వసూలు చేసే వడ్డీనే ‘రెపో రేట్’ అంటారు. ఇది ఎప్పటికప్పుడు మారుతూంటుంది. రెండవది లిక్విడిటీ మేనేజిమెంటు (ద్రవ్య లభ్యత). ఎప్పుడైతే రిజర్వ్ బ్యాంకు, ఆర్థిక రంగాన్ని ప్రోత్సహించాలనుకుంటుందో అప్పుడు లిక్విడిటీ (నగదు/ ద్రవ్య లభ్యత) పెంచుతుంది. అలాగే ఆర్థిక రంగాన్ని అదుపులో ఉంచాలనుకున్నప్పుడు లిక్విడిటీ తగ్గిస్తుంది. రిజర్వ్ బ్యాంకు ఈ పని ఎలా చేస్తుంది? 


కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలూ కూడా తమ బడ్జెట్‌లో లోటును భర్తీ చేసుకోవడానికి అప్పు తెచ్చుకుంటాయి. కేంద్ర ప్రభుత్వమైతే G-Secs (ప్రభుత్వ సెక్యూరిటీలు) అనే బాండ్లు మార్కెట్లో జారీ చెయ్యడం ద్వారా వనరులు సమకూర్చుకుంటుంది. వీటిని బ్యాంకులూ, మ్యూచువల్ ఫండ్లూ, ఇన్స్యూరెన్స్ కంపెనీలు, ప్రావిడెంట్ ఫండ్లూ మొదలైనవి తీసుకుంటాయి. ఉదాహరణకి కెనరా బ్యాంకు దగ్గర అదనపు నగదు ఉందనుకుందాం. అప్పుడు ప్రభుత్వం, కెనరా బ్యాంకు నుంచి కోటి రూపాయల రుణం తెచ్చుకుందామనుకుంది అనుకుందాం. అప్పుడు కెనరా బ్యాంకు ప్రభుత్వం దగ్గర నుంచి బాండ్లు కొనుక్కుని, కోటి రూపాయల్ని ప్రభుత్వ ఖాతాకు బదిలీ చేస్తుంది. అంటే ప్రభుత్వానికి వనరులు లభిస్తాయి, కెనరా బ్యాంకుకు ప్రభుత్వ బాండు దొరుకుతుంది.


ఈ బాండ్లు నిర్ణీత కాలవ్యవధికై జారీ చేయబడతాయి. ఆ వ్యవధి పూర్తయ్యే వరకు ప్రభుత్వం కెనరా బ్యాంకుకు ముందే నిర్ణయించబడిన రేటు ప్రకారం వడ్డీ చెల్లిస్తుంది. అనుకున్న సమయం పూర్తికాగానే కెనరా బ్యాంకుకి ప్రభుత్వం కోటి రూపా యలు చెల్లించి, ఆ బాండ్లను రద్దు చేస్తుంది. మరి ఈ మొత్తం వ్యవహారంలో రిజర్వ్ బ్యాంక్ పాత్ర ఏమిటి? మార్కెట్లో నగదు లభ్యత అదుపులో ఉంచుకోవడానికి ప్రభుత్వం జారీ చేసిన G-Sec లను ఆయుధంగా ఉపయోగిస్తుంది. నగదు లభ్యత పెరగాలంటే బాండ్లు కొనుక్కుంటుంది. మరి రిజర్వ్ బ్యాంకుకి వనరులు ఎక్కడినుంచి వస్తాయి? కరెన్సీ నోట్లు ముద్రించడం ద్వారా వస్తాయి. రిజర్వ్ బ్యాంక్ మాత్రమే కరెన్సీ ముద్రించే అధికారం కలిగి ఉంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రభుత్వం నుంచి కెనరా బ్యాంకు బాండ్లు కొన్నప్పుడు మార్కెట్‌ లోకి కొత్తగా నగదు పుట్టుకు రాలేదు. కేవలం చేతులు మారిందంతే. అదే బాండ్లు రిజర్వ్ బ్యాంక్ వెనక్కి తీసుకున్నప్పుడు అదనపు నగదు మార్కెట్లోకి వచ్చింది. ఈ విధంగా రిజర్వ్ బ్యాంకు అవసరమైనంత నగదు చెలామణీలో ఉండేట్లు చూసుకుంటుంది.


ఇప్పుడు మనం QE అంటే ఏమిటో వివరంగా తెలుసుకుందాం. ఆర్థిక సంక్షోభం వచ్చిన సందర్భాల్లో ప్రజల దగ్గర నగదుకి కొరత వస్తుంది. వాళ్లు దాచుకున్న డబ్బు ఖర్చైపోవచ్చు లేదా ఆస్తులు అమ్ముకోవలసిన అవసరం కూడా రావచ్చు. దాంతో ప్రజల్లో భయం ఏర్పడుతుంది. కొనుగోళ్లు సాధ్యమైనంత తగ్గిస్తారు. కొనేవాళ్లు లేకపోయేసరికి ఉత్పత్తులు తగ్గిపోతాయి. వ్యాపారాలు దెబ్బతింటాయి. కొందరి ఉపాధి పోతుంది. ఉద్యోగాలు పోతాయి. దానితో కొనుగోలు శక్తి మరింత పడిపోతుంది. ఫలితం మరింత ఆర్థిక మాంద్యం.


ఇదొక విషవలయం. దీన్ని అదుపులో పెట్టాలంటే రిజర్వ్ బ్యాంకు సత్వర చర్యలు చేపట్టాలి. ఎక్కువ రుణాలు ఇచ్చేలా బ్యాంకులను ప్రోత్సహించాలి. అప్పులు తీసుకుని ఖర్చు పెట్టేలా జనాన్ని ప్రోత్సహించాలి. దీనివల్ల మార్కెట్‌లో నగదు పెరుగుతుంది. తమ దగ్గర నగదు నిల్వలు పెరిగినప్పుడు బ్యాంకులు కూడా ముందుకు వస్తాయి. వడ్డీ రేట్లు తగ్గుతాయి. రుణాలు తీసుకునేందుకు ప్రజలు ముందుకొస్తారు. మార్కెట్లు పుంజుకుంటాయి.


ఇది సాధించాలంటే రిజర్వ్ బ్యాంకు చురుగ్గా అడుగేసి ద్రవ్యత పెంచాలి. అంటే సాధ్యమైనంత ఎక్కువగా ప్రభుత్వ బాండ్లు కొనాలి. ఐతే ఒక సమస్య ఎదురుకావచ్చు. ప్రభుత్వ బాండ్లు దాదాపు అయిపోయినా, ఆర్థిక వ్యవస్థలో మార్పు అనుకున్న స్థాయిలో రాకపోవచ్చు. రిజర్వ్ బ్యాంకు నగదు వ్యవస్థలోకి పంపడానికి మాములుగా బాండ్లు కొంటుందని చెప్పుకున్నాం కదా, మరి ఆ మార్గం మూసుకుపోయింది. అంటే మరిన్ని కొత్త దారుల కోసం వెతకాలి. సాధారణంగా ఇలాంటి సందర్భాలలో రిజర్వ్ బ్యాంకు మిగతా సంస్థలు, అంటే కార్పొరేషన్లు, స్థానిక ప్రభుత్వాలు (మునిసిపాలిటీల వంటివి) జారీ చేసిన హామీ పత్రాలు, తనఖా పెట్టబడ్డ బాండ్లు, ఇలాంటివి సాధ్యమైనంత ఎక్కువగా కొంటుంది. మామూలు మాటల్లో చెప్పాలంటే QE అంటే ఇదే. 2008లో ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలు ఇదే పద్ధతిని అవలంబించాయి. మనకు రిజర్వ్ బ్యాంకులాగే అమెరికాలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఉంది. (ఒక్కో దేశంలో ఒక్కో పేరుతో పిలిచినా స్థూలంగా వీటిని సెంట్రల్ బ్యాంక్ అంటారు.) మొదటి అడుగు అది వేసింది. యూకె, జపాన్, యూరోప్ దానిని అనుసరించాయి.


QE అన్నది మంత్ర దండమా? అది అంత ప్రభావవంతమైన మంత్రదండమైతే సెంట్రల్ బ్యాంకులు ఇదే ఆయుధాన్ని ఉపయోగించొచ్చు కదా? ఎందుకు తటపటాయిస్తాయి? దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇదేం మనం ఊహించినంత ప్రభావ వంతమైనది కాదు. ప్రతిసారీ ఆదుకుంటుందన్న నమ్మకం లేదు. సెంట్రల్ బ్యాంక్ తన శాయశక్తులా ప్రయత్నించినా, అనుకున్న ఫలితం రాకపోతే దాని మీద ఉన్న ఆపాటి నమ్మకం పోతుంది. వ్యవస్థ ఇంకా దిగజారుతుంది. సెంట్రల్ బ్యాంక్ ఇలా విశ్వాసం కోల్పోతే అది చాలా పెద్ద దెబ్బ. అంతేకాక వ్యవస్థకి మరింత ద్రవ్యత చేకూరుస్తూ పోతే అది ద్రవ్యోల్బణానికి దారి తీసే అవకాశాలు చాలా ఎక్కువ. సరైన సమయంలో QE ఉపసంహరించకపోతే, (అంటే కొన్న బాండ్లు తిరిగి అమ్మడం, అదనపు ద్రవ్యత ఉపసంహరించడం వంటివి) అది మరింత ద్రవ్యోల్బణానికి కారణం అవుతుంది. ద్రవ్యోల్బణం అన్నది పెద్ద శాపం, ముఖ్యంగా భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు. అంటే ఫలితం మీద పూర్తి నమ్మకం లేదు కానీ, అనుకున్న ఫలితం రాకపోతే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. అందుకే చాలా కొద్ది సెంట్రల్ బ్యాంకులు మాత్రమే ఈ అడుగు వేస్తాయి. మనదేశం ఇప్పటిదాకా ఇటువంటి చర్య చేపట్టలేదంటే అర్థం చేసుకోవచ్చు.


ఇక్కడ మనం తెలుసుకోవలసినది ఏమిటంటే QE మూలంగా విడుదలైన నగదు నేరుగా ప్రజలలోకి వెళ్లదు. బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు పెరుగుతుంది. ఆ బ్యాంకుల ద్వారా ప్రజలలోకి వెళ్తుంది, అది కూడా అప్పు రూపంలో. అదే హెలికాప్టర్ మనీ అంటే ఒక హెలికాప్టర్ ఎగురుతూ వచ్చి వరద ప్రాంతాల్లో ఆహారపు పొట్లాలు విసిరినట్లు, పొలాల్లో మందులు చల్లినట్లు, జనాల మధ్యకి డబ్బు వెదజల్లుతుందన్నమాట. దాని వెనుక ప్రజలు పరుగులెత్తి, అందినంత మూటకట్టుకుని, ఖర్చు చెయ్యడం మొదలుపెడతారు. తద్వారా ఆర్థిక రంగం పుంజుకుంటుందని ఆశిస్తాం. స్థూలంగా– ఇదీ QEకీ, హెలికాప్టర్ మనీకీ తేడా. నిజానికి హెలికాప్టర్ మనీ అంటే హెలికాప్టర్ వాడుతామని అర్థం కాదు. రిజర్వ్ బాంకు వంటి సెంట్రల్ బ్యాంకులు అదనంగా కరెన్సీ నోట్లు ముద్రించి, ప్రభుత్వానికిస్తాయి. అది బాంకుల ద్వారా ప్రజల ఖాతాల్లోకి బదిలీ చేయబడుతుంది. ఏఏ పథకాల కింద ఎవరికి ఎంతివ్వాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దేశంలో ఉన్న అందరికీ సమానంగా పంచవచ్చు లేదా అవసరాన్ని బట్టి ఎవరికి ఎంత ఇవ్వాలో నిర్ణయించవచ్చు. కేవలం పేదవారికి మాత్రమే ఇవ్వవచ్చు. ఆ విధంగా నగదు ప్రజల చేతుల్లోకి వెళ్తుంది. అది కూడా, QE లో వలే అప్పు రూపంలో కాకుండా, కేవలం ఎప్పటికి చెల్లించనవసరం లేని గ్రాంటు లాగా అన్నమాట.


ఇక్కడ గమనించవలసినదేమిటంటే నగదు ప్రజల చేతిలోకి వెళ్తుంది. అది కూడా తిరిగి చెల్లించవలసిన అవసరం లేకుండా. కనుక దానిని నిర్భయంగా, స్వేచ్ఛగా ఖర్చు చేస్తారు. కొనుగోళ్లు పెరుగుతాయి. తద్వారా ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతుంది. అలా ఆలోచిస్తే QE కంటే హెలికాప్టర్ మనీ మరీ శక్తివంతమైనది. మరి QE కంటే హెలికాప్టర్ మనీ అంత శక్తివంతమైనదైతే, ఎప్పుడూ ఇదే చెయ్యొచ్చు కదా? నిజానికి QE లో ఉన్న లోపాలు, ప్రమాదాలూ దీంట్లోనూ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మరింత తీవ్రమైన దెబ్బ తగలవచ్చు. దాంతో ప్రజలకి సెంట్రల్ బ్యాంక్ మీద ఉన్న విశ్వసనీయత దెబ్బతిని, ఆర్థిక అస్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది. హెలికాప్టర్ మనీ వెదజల్లడం వలన వచ్చే ప్రయోజనాన్ని ద్రవ్యోల్బణం నిర్వీర్యం చెయ్యవచ్చు.


కరోనా లాంటి విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు ఉత్పత్తి ఉండవలసినంత ఉండదు. దానికి ఎన్నో అవరోధాలు ఉంటాయి. అందుకే చాలా దేశాలు అలాంటి సందర్భాలలో QE కానీ హెలికాప్టర్ మనీ కానీ చేపట్టబోయేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. ప్రజల చేతిలోకి నగదు వస్తే కొనుగోలు శక్తి పెరుగుతుంది. కానీ లాక్‌డౌన్ మూలంగా ఉత్పత్తి పెరిగే అవకాశం ఉండదు. అంటే QE కానీ హెలికాప్టర్ మనీ కానీ, ఏ చర్య చేపట్టినా కలిగే ఫలితం ద్రవ్యోల్బణం. అంటే వస్తువుల కొరత, ధరలు పెరగడం. ఇప్పటిదాకా హెలికాప్టర్ మనీ అన్న ప్రయోగాన్ని ఏ దేశమూ చేపట్టలేదని మనం గమనించాలి. చివరికి అమెరికా కూడా. 


QE కానీ, హెలికాప్టర్ మనీ కానీ ఆలోచనల్లో అద్భుతంగా కనిపిస్తాయి. కానీ ఆచరణలో మాత్రం ఇవి చిట్టచివరి మార్గం. ఎంతో జాగ్రత్తగా అడుగులు వెయ్యకపోతే వ్యవస్థను అస్తవ్యస్తం చేసే మార్గాలు. QE, హెలికాప్టర్ మనీ చిట్టచివరి మార్గాలైనా, వాటిని అర్థం చేసుకుని, ప్రస్తావించి, ప్రతిపాదించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగా అభినందనీయుడు. రాష్ట్రాలు అత్యంత సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న మాట వాస్తవం. వైద్య సదుపాయాలు మెరుగుపరచడానికి, ప్రజల నిత్యావసరాలు తీర్చడానికి, ఉపాధి చూపడానికి, అత్యవసర సేవలు అందించడానికీ ఈ లాక్‌డౌన్ సమయంలో ఆర్థిక సహాయం తప్పక కావాలి. కేసీఆర్ చెప్పినట్లు అది హెలికాప్టర్ మనీ కాకపోతే ఏరోప్లేన్ మనీ.. పేరేదైతేనేం, రాష్ట్రాలకు సహాయం అత్యవసరం. ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రతిపాదనకి కేంద్రం సానుకూలంగా స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉంది.


డా. దువ్వూరి సుబ్బారావు

మాజీ గవర్నర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

(లంక నాగరాజు సహకారంతో)

Updated Date - 2020-05-01T06:15:45+05:30 IST