మాంసం దుకాణాలపై తనిఖీలు మరింత కొనసాగించండి- మంత్రి తలసాని

ABN , First Publish Date - 2020-05-02T00:08:25+05:30 IST

మాంసం దుకాణాలపై తనిఖీలు నిరంతరం కొనసాగించాలని, నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు.

మాంసం దుకాణాలపై తనిఖీలు మరింత కొనసాగించండి- మంత్రి తలసాని

హైదరాబాద్‌: మాంసం దుకాణాలపై తనిఖీలు నిరంతరం కొనసాగించాలని, నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. కరోనా నేపధ్యంలో జీహెచ్‌ఎంసి పరిధిలో మాంసం దుకాణాల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి విక్రయిస్తున్నారని ఇటీవల షాపులపై అధికారులు నిర్వహించిన తనిఖీలు సత్ఫలితాలు ఇస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ తనిఖీల సందర్భంగా అనేక విషయాలను గుర్తించామని అన్నారు. అధికారులు తనిఖీల సందర్భంలో గుర్తించిన అంశాలను ఫోటోలతో కూడిన ప్రజెంటేషన్‌ ద్వారా మంత్రికి వివరించారు. నిబందనల ప్రకారం కొన్నిషాపుల నిర్వాహకులు శానిటైజర్లను ఉపయోగించడం లేదని, మాస్క్‌లను ధరించడం లేదని వివరించారు. కొందరు ఎలాంటి షాపులు లేకుండా కేవలం రోడ్లపక్కన మాంసం విక్రయిస్తున్నారని తెలిపారు.


తనిఖీల కోసం నియమించిన అధికారుల బృందం పలు సూచనలతో నివేదికను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ లైసెన్స్‌ లేకుండా అనేక షాపులు కొనసాగుతున్నాయని స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి లైసెన్స్‌ లేకుండా కొనసాగుతున్న షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లైసెన్స్‌ తీసుకునే విధంగా వారిని ఒప్పించాలని అన్నారు. అదే విధంగా పరిశుభ్రత పాటించేలా , ధరలను తెలిపే విధంగా ప్రతిషాప్‌లో బోర్డు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ 101 షాపులను తనిఖీ చేస్తే 73 షాపులు లైసెన్స్‌ లేకుండా నిర్వహిస్తున్నట్టు గుర్తించిందనారు. అధికారుల పర్యవేక్షణ లేని కారణంగానే షాపుల నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారరని అన్నారు. ఇక నుంచి అలాంటి పరిస్థితి ఉండ వద్దన్నారు. ఖచ్చితంగా నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

Updated Date - 2020-05-02T00:08:25+05:30 IST