హంతకుడిది ముంబై.. హతురాలిది సిక్కిం..

ABN , First Publish Date - 2020-09-01T08:26:48+05:30 IST

రాష్ట్రంకాని రాష్ట్రంలో హత్యచేస్తే.. పోలీసులు పట్టుకోలేరనుకున్నారు. హత్యచేసి తాపీగా ఎస్కేప్‌ అవ్వాలనుకున్నారు. వ్యూహాన్ని

హంతకుడిది ముంబై.. హతురాలిది సిక్కిం..

  • హైదరాబాద్‌లో పక్కాప్లాన్‌తో హత్య
  • పోలీసులకు దొరకొద్దని పకడ్బందీ జాగ్రత్తలు
  • ‘డ్రైవ్‌ ఈజీ’ ఆధారాలతో నిందితుల అరెస్టు
  • ఆర్‌జీఐఏ సీసీటీవీ ఫుటేజీతో వీడిన గుట్టు

శంషాబాద్‌, ఆగస్టు 31: రాష్ట్రంకాని రాష్ట్రంలో హత్యచేస్తే.. పోలీసులు పట్టుకోలేరనుకున్నారు. హత్యచేసి తాపీగా ఎస్కేప్‌ అవ్వాలనుకున్నారు. వ్యూహాన్ని పక్కాగా  అమలుచేశామని ఊపిరి పీల్చుకున్నారు. కానీ.. ‘కానూన్‌ కా హాథ్‌ లంబా హోతాహై’ అని సైబరాబాద్‌ పోలీసులు నిరూపించారు. మార్చి 16న చేవెళ్ల సమీపంలో తంగెళ్లపల్లి వద్ద దారుణహత్యకు గురైన సిక్కిం మహిళ దవాఫసిషర్పా(37) హత్య కేసును సాంకేతిక ఆధారాలతో ఛేదించారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. తంగెళ్లపల్లి వద్ద ఒంటిపై దుస్తులు లేకుండా గుర్తుతెలియని మహిళ మృతదేహం పడిఉండటం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు.. ఆ మార్గంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. హత్యజరిగిన సమయం ఆధారంగా ఒకరోజంతా ఆ మార్గంలో వచ్చిన వాహనాల వివరాలను సేకరించారు. ‘డ్రైవ్‌ ఈజీ’కి చెందిన ఓ అద్దె కారుపై అనుమానం బలపడి, ఆ సంస్థను సంప్రదించారు. ఆ కారును అక్తర్‌భారీ అనే వ్యక్తి అద్దెకు తీసుకున్నట్లు గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అక్తర్‌భారీ.. గచ్చిబౌలిలోని ఓ హాస్టల్‌లో ఉంటూ.. బీటెక్‌ ఇంటర్న్‌షిప్‌ చేస్తున్నాడు. అతడిని అదుపులోకి తీసుకుని, విచారించగా.. తాను, వరసకు తనకు సోదరుడయ్యే జానీ అక్తర్‌ కలిసి ఆ మహిళను హతమార్చినట్లు అంగీకరించాడు. దీంతో.. అతడిని ఏ-2గా పరిగణిస్తూ.. అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. హత్యకు గురైన ఆ మహిళను సిక్కింకు చెందిన దవాఫసిషర్పాగా గుర్తించారు. ముంబైలో ఉంటున్న జానీఅక్తర్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. జానీతో కలిసి, ఆ మహిళ ముంబై నుంచి వచ్చినప్పుడు.. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో లభించిన సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలను సేకరించారు. జానీ అక్తర్‌ను సోమవారం అరెస్టు చేసినట్లు డీసీపీ ప్రకాశ్‌రెడ్డి వెల్లడించారు.


ప్రేమ పేరుతో వంచన..

సిక్కింకు చెందిన దవాఫసీషర్పా(37)కు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ముంబైలోని ఓ బట్టలషాపులో పనిచేసే ఉత్తరప్రదేశ్‌ వాసి జానీఅక్తర్‌ ఆమెకు మూడేళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యాడు. ఆ పరిచయంతో ఓ సారి జాకీ సిక్కింకు వెళ్లాడు. వారిద్దరూ కలిసి.. ఎవరికీ తెలియకుండా కోల్‌కతాకు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత షర్పా కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో.. జానీని గట్టిగా మందలించారు. ఆ తర్వాత కూడా వీరి మధ్య ఫేస్‌బుక్‌ చాటింగ్‌లు, ఫోన్‌కాల్స్‌ కొనసాగాయి. ఈ క్రమంలో.. జనవరి 29న జానీ అక్తర్‌ సిక్కింకు వెళ్లి.. షర్ఫాను ముంబైకి తీసుకువచ్చాడు. అలా రెండు నెలలు కలిసే ఉన్నారు. అంతా వదులుకుని వచ్చినందుకు.. తనను పెళ్లి చేసుకోవాలంటూ జానీపై షర్పా తరచూ ఒత్తిడి తెచ్చేది. దీంతో.. ఆమెను హతమార్చాలని జానీ పథకం రూపొందించాడు. అందుకోసం హైదరాబాద్‌లోని అక్తర్‌భారీ సాయం తీసుకున్నాడు.


దొరకకుండా ఉండేందుకు పక్కా స్కెచ్‌

తన స్వస్థలం ఉత్తరప్రదేశ్‌. ఉండేది ముంబైలో. షర్పాది సిక్కిం. ఆమెను హైదరాబాద్‌లో హత్యచేస్తే.. పోలీసులకు దొరకకుండా తప్పించుకోవచ్చనే ఉద్దేశంతో మార్చి 16న షర్పాతో కలిసి హైదరాబాద్‌ వచ్చాడు. అప్పటికే ‘డ్రైవ్‌ ఈజీ’లో కారును అద్దెకు తీసుకున్న అక్తర్‌భారీ, వీరికోసం విమానాశ్రయం బయట సిద్ధంగా ఉన్నాడు. చేవెళ్ల, తాండూరు, వికారాబాద్‌ వంటి ప్రదేశాల్లో ఆమెను తిప్పారు. అదేంటని అడిగితే.. లాంగ్‌డ్రైవ్‌గా నమ్మించారు. ఫిర్జాగూడ గేటు దగ్గర కారు ఆపి.. షర్పా మెడకు తాడు బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని కారులోనే పెట్టుకుని, తిరిగారు. అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో తంగెళ్లపల్లి బ్రిడ్జి కింద పారేశారు. ఒంటిపై బట్టలు ఉంటే సులభంగా గుర్తించే అవకాశముండడంతో.. వాటిని తొలగించారు. ఆ తర్వాత ఓ బండరాయితో తలపై మోదారు. పొద్దుటూరు గేటు దగ్గర మృతురాలి దుస్తులను పారేశారు.

Updated Date - 2020-09-01T08:26:48+05:30 IST