అమ్మగారి మాంసం కోర్కె.. అటెండర్‌ ప్రాణం తీసింది!

ABN , First Publish Date - 2020-04-30T14:20:46+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించడం..

అమ్మగారి మాంసం కోర్కె.. అటెండర్‌ ప్రాణం తీసింది!

మాంసం కోసం బైక్‌పై వెళుతుండగా రోడ్డు ప్రమాదం

ఢీకొట్టింది పోలీసు బండి... గుర్తుతెలియని వాహనంగా కేసు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించడం.. అధికార యంత్రాంగమంతా దీనిపైనా కేంద్రీకృతం కావడం విదితమే. ఇదిలావుంటే  జిల్లాలోని ఓ ఉన్నతాధికారి భార్య నాన్‌ వెజ్‌ వంటకంపై మక్కువతో మాంసం తీసుకురావలసిందిగా అటెండర్‌ను పురమాయించారు. ఇందులో విశేషం ఏమీ లేదు... అయితే మాంసం కోసం వెళ్లిన ఆ అటెండరు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఇక్కడ మరోవిషయం... అతను వెళుతున్న ద్విచక్రవాహనాన్ని పోలీసు వాహనం ఢీకొనడం గమనార్హం! సేకరించిన సమాచారం మేరకు వివరాలు...


అమ్మగారికి మాంసం తినాలనిపించడంతో అటెండరును గన్నవరం వెళ్లి తీసుకురావాలని కోరారు. అందుకు కారును సమకూర్చకపోగా... అతని బైక్‌పైనే వెళ్లాల్సిందిగా ఆదేశించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో లాక్‌ డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి ఆ అటెండర్‌ తన బైక్‌పై ఇక్కడి నుంచి బయలుదేరి కృష్ణా జిల్లాలో ప్రవేశించారు. అయితే విధి వక్రీకరించి ఓ పోలీసు వాహనం... బైక్‌ను ఢీకొనడంతో అటెండరు గాయపడ్డాడు. ఈ ఘటన విజయవాడ కృష్ణలంక పరిధిలో జరగ్గా... అక్కడి పోలీసులు గుర్తుతెలియని వాహనం ఢీకొన్నట్లుగా కేసు నమోదు చేయడం గమనార్హం! కొన ఊపిరితో ఉన్న బాధితుడిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. సుమారు 18 గంటలు అపస్మారక స్థితిలో ఉన్న అతనికి మంగళవారం అర్ధరాత్రి వరకు చికిత్సలు చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. అటెండరు మరణం విషయాన్ని గోప్యంగా ఉంచారు.


ప్రమాద విషయాన్ని తెలుసుకున్న ఉద్యోగవర్గాలు మండిపడుతున్నాయి. కుటుంబీకులను మేనేజ్‌చేసి గోప్యంగా ఉంచినప్పటికీ ఉద్యోగ వర్గాలు ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి దృష్టికి తెచ్చాయి. దీనిపై కూపీ లాగేందుకు జీజీహెచ్‌ వర్గాలను సంప్రదించగా రెండు రోజులుగా ఎటువంటి యాక్సిడెంట్‌, మరణాలు లేవని మొదట బుకాయించాయి. ఫలానా వ్యక్తికి విజయవాడ పరిధిలో ప్రమాదం జరిగి ఇక్కడకు తీసుకువచ్చారు కదా అని ప్రశ్నించడంతో అప్పుడు అతని మృతి విషయాన్ని నిర్ధారించారు. ఇదిలావుంటే అమ్మగారి పని మీద కాకుండా ఆ అటెండర్‌ విజయవాడ నుంచి గుంటూరుకు వస్తున్నట్లుగా చెప్పమని అతని బంధువులు, సన్నిహితులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.

Updated Date - 2020-04-30T14:20:46+05:30 IST