పేలిన ఆక్సిజన్‌ సిలిండర్‌

ABN , First Publish Date - 2020-09-01T08:08:44+05:30 IST

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సిలిండర్‌ పేలింది. దీంతో రోగులు భయభ్రాంతులకు గురయ్యారు

పేలిన ఆక్సిజన్‌ సిలిండర్‌

  • గద్వాల జిల్లా ఆస్పత్రిలో ప్రమాదం.. పిల్లల వార్డులో పగిలిన అద్దాలు
  • ప్రాణాలు అరచేత పట్టుకొని భయంతో పరుగులు తీసిన రోగులు
  • వెంటిలేటర్‌పై ఉన్న వ్యక్తిని బయటకు తీసుకెళ్లిన బంధువులు.. పేషెంట్‌ మృతి
  • దవాఖానను పరిశీలించిన విపక్షాల నేతలు భట్టి, డీకే అరుణ


గద్వాల, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సిలిండర్‌ పేలింది. దీంతో రోగులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆక్సిజన్‌ సిలిండర్‌ పేలిందని కొందరు, గ్యాస్‌ లీకైందంటూ మరికొందరు పరుగులు తీశారు. ఈ క్రమంలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఓ వ్యక్తిని కూడా బయటకు తీసుకెళ్లడంతో ఊపిరాడక ఆయన మృతి చెందారు. సోమవారం ఉదయం 11 నుంచి 11.30 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని న్యూ బార్న్‌ బేబీ సెంటర్‌లో నవజాత శిశువుకు ఆక్సిజన్‌ అమర్చడానికి ఓ నర్సు సిలిండర్‌ రెగ్యులేటర్‌ను తిప్పుతున్న క్రమంలో అది పేలింది. సిలిండర్‌కున్న ఆక్సిలేటర్‌ ఒక్కసారిగా పగిలి అద్దాలకు తగింది. దీంతో అద్దాలు బద్దలయ్యాయి. సిలిండర్‌ పేలుడు, అద్దాలు పగిలిన శబ్దంతో ఆస్పత్రిలోని పలు వార్డుల్లో ఉన్న రోగులు, వారి బంధువులు బయటకు పరుగులు తీశారు. ఈక్రమంలో షుగర్‌ వ్యాధితో బాధపడున్న గద్వాల మండలం శెట్టి ఆత్మకూర్‌ గ్రామానికి చెందిన కృష్ణ (46)కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. గ్యాస్‌ లీకైందని తెలియడంతో ఆయనను వారి బంధువులు ఆస్పత్రి బయటకు తీసుకొచ్చారు. కొద్దిసేపటి తర్వాత, జరిగిన ఘటన చిన్నదేనని వైద్యులు చెప్పడంతో తిరిగి కృష్ణను వెంటిలేటర్‌ వద్దకు తీసుకువెళుతుండగా ప్రాణాలు పోయాయి.  


ఆస్పత్రికి వెళ్లిన భట్టి, డీకే అరుణ

విషయం తెలుసుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్‌ నాయకుల బృందం గద్వాల ఆస్పత్రికి వచ్చింది. అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ ఆస్పత్రుల్లో ప్రమాదాలు జరుగుతున్నా జిల్లా అధికారులు, మంత్రి ఈటలకు సోయిలేదని విమర్శించారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే బీజేపీ నేత డీకే అరుణ ఆస్పత్రికి వెళ్లారు. మృతుని కుటుంబానికి రూ.30 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కాగా, ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని.. భయంతో షుగర్‌ రోగిని బయటకు తీసుకువచ్చి, లోపలికి తీసుకెళ్లేలోపే మృతి చెందారని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ తెలిపారు.

Updated Date - 2020-09-01T08:08:44+05:30 IST