రాబడి సరిపోవడం లేదు!

ABN , First Publish Date - 2020-12-04T09:07:35+05:30 IST

రాష్ట్రానికి క్రమేణా ఆదాయం పెరుగుతున్నప్పటికీ అప్పులు చేయక తప్పడం లేదు. అంచనా వేసినట్టుగా ఆదాయం రాకపోయినా.. ఏడాది మొదట్లోని పరిస్థితితో పోలిస్తే ప్రస్తుతం కొంత

రాబడి సరిపోవడం లేదు!

అవసరాలకు అప్పులు తప్పడం లేదు.. రాష్ట్ర ఆదాయం రూ.73,968 కోట్లు

 అందులో రుణమే 30 వేల కోట్లు!

 చేసిన వ్యయం రూ.69,634 కోట్లు

 ఈ ఏడాది ఏడు నెలల లెక్క ఇదీ!

 కాగ్‌ తాజా నివేదికలో వెల్లడి 

హైదరాబాద్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి క్రమేణా ఆదాయం పెరుగుతున్నప్పటికీ అప్పులు చేయక తప్పడం లేదు. అంచనా వేసినట్టుగా ఆదాయం రాకపోయినా.. ఏడాది మొదట్లోని పరిస్థితితో పోలిస్తే ప్రస్తుతం కొంత మెరుగైన వాతావరణమే నెలకొంది. కానీ, అవసరాలకు తగ్గట్టుగా ఆదాయం పెరగకపోవడంతో అప్పులు చేయాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభు త్వం ఈ ఏడాది బడ్జెట్‌ను భారీ అంచనాలతో రూపొందించిన విషయం తెలిసిందే. వ్యయాన్ని కూడా భారీగానే అంచనా వేయడం, ఆ మేరకు ఆదాయం రాకపోవడంతో భారీగా అప్పులు చేయాల్సి వస్తోంది.


ఈ ఆర్థి క సంవత్సరం (2020-21)లోని తొలి 7 నెలల్లో (ఏప్రిల్‌ నుంచి అక్టోబరు) రాష్ట్రానికి మొత్తం రూ.73,968 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో సుమారు రూ.27,619 కోట్లు రుణమే ఉంది. నవంబరులో తీసుకున్న రుణాన్ని కూడా కలిపితే రూ.30 వేల కోట్లు దాటిపోతోంది. అలాగే ఈ ఏడు నెలల్లో సుమారు రూ.69,643 కోట్లు ఖర్చుచేశారు. ఈ ఏడాది తొలి 7 నెలల్లో ఆదాయం, వ్యయానికి సంబంధించి కాగ్‌ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

రాష్ట్రానికి వస్తున్న ఆదాయాన్ని పరిశీలిస్తే జూన్‌ నుంచి పన్నుల రాబడి పెరిగింది. ఏప్రిల్‌, మే నెలల్లో ఆదాయం భారీగా పడిపోయినా.. తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే జూన్‌, ఆగ స్టు, అక్టోబరు మాసాల్లో ఆదాయం పెరిగింది. ఏప్రిల్‌, మే, జూలై, సెస్టెంబరు నెలల్లో మాత్రం కొంత ఆదా యం తగ్గింది. మొత్తంగా గత ఏడాది తొలి 7 మాసా ల్లో వచ్చిన ఆదాయం కంటే.. ఈ ఏడాది వచ్చిన ఆదా యం రూ.7 వేల కోట్లకు పైగా తగ్గింది. ఇలా తగ్గిన ఆదాయాన్ని పూ డ్చుకోవడానికి ప్ర భుత్వం పెద్ద ఎత్తున రుణాలు తీసుకుంటోంది.


ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ద్వారా రూ.32,671 కోట్ల ఆదాయం వస్తుందని  ప్రభుత్వం అంచనా వేసింది. కానీ, 7 నెలల్లో రూ.12,887 కోట్లు మాత్రమే వచ్చాయి. అలాగే కరోనా, ఇతర కారణా ల వల్ల తగ్గిన జీఎస్టీ పరిహారాన్ని పొందడంలో కేంద్రం రాష్ట్రాలకు రెండు మార్గాలను ఎంచుకోవాలని సూచించింది. మొదట్లో వీటిని వ్యతిరేకించిన తెలంగాణ ప్రభుత్వం, చివర కు మొదటి మార్గానికి ఆమో దం తెలిపింది. దాంతో  రాష్ట్రానికి రూ.2,380 కోట్లు ఇచ్చారు. మరో రూ.5,017 కోట్ల పరిహారాన్ని రుణంగా తీసుకోవడానికి అవకాశం కల్పించారు.


అలాగే ఈ ఏడాది అక్టోబరు వరకు అమ్మకం పన్నుల కింద రూ.10,097 కోట్లు, రాష్ట్ర ఎక్సైజ్‌ డ్యూటీస్‌ కింద రూ.7611 కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్రం వాటాగా రూ.4282 కోట్ల ఆదాయం సమకూరింది. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద కేంద్రం నుంచి రూ.6002 కోట్ల నిధులు వచ్చాయి. ఇలా వివిధ రూపాల్లో మొత్తం రూ.38,530 కోట్ల ఆదాయం వచ్చింది. 



రిజిస్ట్రేషన్ల నిలిపివేతతో..

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లను నిలిపివేయడంతో 3 నెలలుగా కొంత ఆదాయం పడిపోయింది. అక్టోబరు వరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల విభాగం నుంచి రూ.1692 కోట్ల రాబడి వచ్చింది. సెప్టెంబరు 8 నుంచి రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. తర్వాత వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్లను ప్రారంభించినా.. వ్యవసాయేతర ఆస్తులకు మాత్రం ప్రారంభించలేదు. మరోవైపు యాసంగికి సంబంధించి రైతు బంధు డబ్బులను చెల్లించడానికి వీలుగా ప్రభుత్వం నిధులు సమకూర్చుకుంటోంది. వీలైతే ఈ నెలలోనే రైతులకు చెల్లించాలని భావిస్తున్నారు.


ప్రతి నెలా బాండ్ల వేలం నిర్వహించి బహిరంగ మార్కె ట్ల ద్వారానే కాకుండా, ఇతర మార్గాల్లోనూ పెద్ద ఎత్తున రు ణాలు తీసుకొస్తున్నారు. అక్టోబరు వరకు రూ.27,619 కోట్ల రుణం తీసుకున్నారు. నవంబరులో బహిరంగ మార్కెట్ల ద్వారా మరో రూ.3,500 కోట్ల రుణాన్ని స్వీకరించారు. అలా గే ఈ నెలలోనూ రూ.1000 కోట్ల రుణం తీసుకున్నారు. ఇలా ఇప్పటి వరకు తీసుకున్న రుణం రూ.30 వేల కోట్ల మార్కును దాటింది. 


ఈ ఏడాది తీసుకున్న రుణాల వివరాలు (రూ.కోట్లలో)


నెల 2019-20 2020-21

ఏప్రిల్‌ 1561.73 5709.23

మే 3898.74 7642.79

జూన్‌ 859.04 4318.43

జులై 4006.07 3113.39

ఆగస్టు 1268.14 3935.19

సెప్టెంబరు 3110.50 1270.40

అక్టోబరు 2796.51 1629.61

మొత్తం 17500.73 27619.04


Updated Date - 2020-12-04T09:07:35+05:30 IST