అవకతవకలపై చర్యలేవీ?

ABN , First Publish Date - 2020-12-04T09:02:21+05:30 IST

రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఏకసభ్య కమిషన్‌(ఔంసీ) మధ్యంతర నివేదిక సమర్పించి నాలుగు నెలలు

అవకతవకలపై చర్యలేవీ?

ఉన్నత విద్యామండలిలో అక్రమాల ఆరోపణలు

ఆగస్టులోనే  కమిషన్‌ మధ్యంతర నివేదిక

పరిశీలించకుండానే గడువు పొడిగింపు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఏకసభ్య కమిషన్‌(ఔంసీ) మధ్యంతర నివేదిక సమర్పించి నాలుగు నెలలు అవుతున్నా, ఇంతవరకు చర్యల జాడలేదు. ఏఏ అంశాల్లో అక్రమాలు జరిగాయో  ప్రాథమికంగానైనా బహిర్గతం చేయలేదు. ఉన్నత విద్యామండలి ఆర్థిక అంశాలపై విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించేందుకు మరో ఐదు నెలల గడువు ఇస్తూ ఉన్నత విద్యాశాఖ తాజాగా మరో లేఖ రాయడం కలకలం రేపుతోంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో చేపట్టిన పలు కార్యక్రమాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో నిబంధనలు పాటించలేదని, అక్రమాలు జరిగాయంటూ గతేడాది ఆరోపణలు రాగా, విచారణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 2019 జూలై 19న ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంహెచ్‌ఆర్‌డీ) డైరెక్టర్‌ జనరల్‌ డి.చక్రపాణి(రిటైర్డ్‌ ఐఏఎస్‌) నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది.


ఈ కమిషన్‌ మూడు నెలలపాటు సమాచారాన్ని సేకరించింది. చక్రపాణి స్థానంలో ఎంహెచ్‌ఆర్‌డీ డీజీగా అప్పటి సీఎస్‌ ఎల్‌వీ సుబ్రహ్మణ్యంను నియమించడంతో దాదాపు ఆరు నెలలపాటు ఏకసభ్య కమిషన్‌ విచారణపై సందిగ్ధత ఏర్పడింది. ఆ తర్వాత 2020 ఏప్రిల్‌ 20న ఉన్నత విద్యాశాఖ మరో లేఖ ద్వారా ఓఎంసీ విచారణ గడువును మరో మూడు నెలలు పొడిగించింది. ఆ తర్వాత కొవిడ్‌ ప్రభావంతో విచారణ నిలిచిపోయింది. చక్రపాణి హైదరాబాద్‌లో ఉండగా, విచారణకు సంబంధించిన రికార్డులు గుంటూరులో ఉండిపోయాయి. తర్వాత ఎట్టకేలకు ఓఎంసీ ఆగస్టు 10న మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదికను ప్రభుత్వం కనీసం పరిశీలించలేదని సమాచారం. కారణాలు తెలపకుండానే.. పూర్తిస్థాయి నివేదిక సమర్పించడానికి మరో ఐదు నెలల సమయం కేటాయిస్తూ ఉన్నత విద్యాశాఖ నవంబరు 13న మరో లేఖను చక్రపాణి కమిషన్‌కు పంపింది. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి ఆర్థిక లావాదేవీలపై విచారణ మరింత కాలం కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Updated Date - 2020-12-04T09:02:21+05:30 IST