కేంద్ర ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నాం!

ABN , First Publish Date - 2020-09-01T08:04:59+05:30 IST

జీఎస్టీలో చేరడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిందని ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఈ నష్ట పరిహారాన్ని కేంద్రమే

కేంద్ర ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నాం!

  • జీఎస్టీలో చేరడం వల్ల నష్టపోయాం
  • పరిహారాన్ని కేంద్రమే చెల్లించాలి
  • జీఎస్టీలో చేరకపోతే 25 వేల కోట్లుండేవి
  • 4 నెలల్లో రాష్ట్రానికి 8 వేల కోట్ల నష్టం
  • కేంద్ర ఆర్థిక మంత్రికి సీఎం కేసీఆర్‌ లేఖ
  • రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ వెల్లడి


హైదరాబాద్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): జీఎస్టీలో చేరడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిందని ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఈ నష్ట పరిహారాన్ని కేంద్రమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పరిహార చెల్లింపులో కేంద్రం సూచించిన ప్రతిపాదనలను తాము తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఈ పరిహారం కోసం పార్లమెంటులో ఇతర రాష్ట్రాలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని, అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పారు. జీఎస్టీ పరిహార చెల్లింపులపై కేంద్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిన ప్రతిపాదనలపై పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చించారు. ఇందులో పశ్చిమబెంగాల్‌, కేరళ, ఢిల్లీ, ఛత్తీ్‌సగఢ్‌, పంజాబ్‌ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. అంతకుముందు సీఎం కేసీఆర్‌తో జరిగిన ప్రత్యేక సమావేశంలో హరీశ్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అందులో కేంద్రం చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారంపై చర్చించినట్లు సమాచారం. కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలనే విషయంపైనా చర్చించినట్లు తెలిసింది. కేంద్ర  ప్రతిపాదనలను అంగీకరించవద్దని నిర్ణయించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం మంత్రి హరీశ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రెండు ప్రతిపాదనలనూ తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం జీఎస్టీ పరిహారం రూ.3 లక్షల కోట్లకు గాను రూ.1.65 లక్షల కోట్లకు తగ్గించడాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. కరోనా పేరిట రూ.1.35 లక్షల కోట్ల పరిహారాన్ని కేంద్రం ఎగ్గొట్టాలని చూస్తోందని చెప్పారు. చట్ట ప్రకారం వృద్ధి రేటు 14 శాతం కంటే తగ్గితే ఆ మేరకు కేంద్రమే పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం అడ్వొకేట్‌ జనరల్‌ను సంప్రదించినప్పటికీ రాష్ట్రాలకు మొత్తం నష్ట పరిహారాన్ని చెల్లించాలని చెప్పిన ట్లు గుర్తు చేశారు. ‘జీఎస్టీ అమల్లోకి వచ్చి మూడే ళ్లయింది. జీఎస్టీ డబ్బులు, ఐజీఎస్టీ డబ్బులు మిగిలితే కన్సాలిడేట్‌ ఫండ్‌లో జమ చేసుకుంటున్నారు. ఆదాయం తగ్గితే రాష్ట్రాలను అప్పులు తీసుకోమని చెబుతున్నారు’ అని హరీశ్‌ అన్నారు. జీఎస్టీ, ఐజీఎస్టీ పరిహారం సుమారు రూ.8 వేల కోట్లను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జీఎస్టీలో చేరకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రం వద్ద ప్రస్తుతం రూ.25 వేల కోట్లు ఉండేవని గుర్తుచేశారు. ఈ నాలుగు నెలల్లో రాష్ట్రం సుమారు 34 శాతం ఆదాయాన్ని కోల్పోయిందని, తద్వారా రూ.8 వేల కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల పేరు చెప్పి తప్పించుకోవాలని కేంద్రం చూస్తోందని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. 


అది సరికాదు.. 

రాష్ట్రాలు రూ.3 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోతే మొదటి ప్రతిపాదన మేరకు కేవలం జీఎస్టీ అమలులో ఏర్పడిన రెవెన్యూ లోటు రూ.1.65లక్షల కోట్లను మాత్రమే రాష్ట్రాలకు రుణం పేరిట చెల్లిస్తామని కేంద్రం చెప్పడం సరికాదని హరీశ్‌ అన్నారు. అలాగే రెండో ప్రతిపాదన ప్రకారం.. జీఎస్టీ అమలు, కొవిడ్‌ వల్ల ఏర్పడిన రెవెన్యూ లోటును రాష్ట్రాల పేరుమీద రుణంగా తీసుకుని చెల్లిస్తామనడం కూడా మంచిది కాదని చెప్పారు. దీనివల్ల రాష్ట్రానికి కేవలం రూ.10 వేల కోట్ల రుణం అదనంగా వస్తుందని, పైగా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల సమస్య తలెత్తుతుందని తెలిపారు. ఈ ప్రతిపాదనలను అంగీకరించకూడదని నిర్ణయించామన్నారు. జీఎస్టీలో చేరి సెస్‌ రూపంలో రూ.18,032 కోట్లు ఇస్తే.. రాష్ట్రానికి కేవలం రూ.3,200 కోట్లే వచ్చాయని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చట్టబద్ధంగా వచ్చే నిధులను కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఎఫ్‌ఆర్‌బీఎంలో కేంద్రం ఐదు శాతం అప్పులు తీసుకోవచ్చని, రాష్ట్రాలను మాత్రం 3 శాతానికే పరిమితం చేశారని చెప్పారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమైందని చెప్పారు. 

Updated Date - 2020-09-01T08:04:59+05:30 IST