ఇది నీ పని కాదన్నారు!

ABN , First Publish Date - 2020-08-31T05:30:00+05:30 IST

పోషకాహారానికి నోచుకోని గర్భిణులు, పిల్లలు... కనీసాదాయం లేని కుటుంబాలు... నక్సల్స్‌గా ముద్రపడి, చెడు మార్గాలు పడుతున్న యువత... చత్తీస్‌గఢ్‌లోని గిరిజన ప్రాంతాల్లోని ఈ దుర్భర పరిస్థితులను మార్చడానికి తన వంతు కృషి చేస్తున్నారు ముప్ఫై మూడేళ్ళ షేక్‌ రజియా...

ఇది నీ పని కాదన్నారు!

పోషకాహారానికి నోచుకోని గర్భిణులు, పిల్లలు... కనీసాదాయం లేని కుటుంబాలు... నక్సల్స్‌గా ముద్రపడి, చెడు మార్గాలు పడుతున్న యువత... చత్తీస్‌గఢ్‌లోని గిరిజన ప్రాంతాల్లోని ఈ దుర్భర పరిస్థితులను మార్చడానికి తన వంతు కృషి చేస్తున్నారు ముప్ఫై మూడేళ్ళ షేక్‌ రజియా. మత్తు పానీయాల తయారీకి వాడే ఇప్ప పువ్వులను మహిళల ఆర్థిక వికాసానికి ముడిసరుకుగా మార్చారామె. ఆ కథంతా ఆమె మాటల్లోనే...


‘‘చదువు పూర్తికాగానే ‘భద్రతనిచ్చే ఉద్యోగం చేయాలా? నాకు ఆసక్తి ఉన్న సేవా కార్యక్రమాల్లో పని చేయాలా?’ అనే ప్రశ్న ఎదురైనప్పుడు... నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. టాటా ట్రస్ట్‌ సహకారంతో నడుస్తున్న ‘రామకృష్ణ శారదా సేవా ఆశ్రమ్‌’ అనే స్వచ్ఛంద సంస్థలో పరిశోధకురాలిగా చేరిపోయాను. 


ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని జగదల్పూర్‌ నా స్వస్థలం. చదువంటే మొదటి నుంచీ ఇష్టం. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో మైక్రోబయాలజీలో ఎమ్మెస్సీ చేశాను. ఆశ్రమ్‌లో చేరిన తరువాత మా ప్రాంతంలోని గిరిజనుల ఆరోగ్యం, వారికి అందుతున్న పోషకాహారం, వారి జీవనోపాధి పరిస్థితులపై పరిశోధన ప్రారంభించాను. గర్భిణులు, బాలింతలు, శిశువుల ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వర్క్‌ షాపులు నిర్వహించేదాన్ని. వారి జీవితాలను మరింత స్పష్టంగా గమనించే అవకాశం కలిగింది. మంచి ఆహారం తీసుకోవాలని వాళ్ళకి చెబుతూ ఉంటాం. కానీ పండ్లు, పాలు కొనడానికి వారి దగ్గర డబ్బులెక్కడివీ? మా ప్రాంతంలో ఉపాధి అవకాశాలు అంతంత మాత్రం. గిరిజనుల్లో చాలామంది నిరక్షరాస్యులు. ఎక్కడ చూసిన పేదరికం తాండవిస్తూ ఉంటుంది. పురుషుల్లో కొందరు వేరే ప్రాంతాల్లో పనులు వెతుక్కుంటూ వెళ్తారు. పైగా నక్సలిజం ప్రభావం ఇక్కడ ఎక్కువ. పనులు లేకపోవడంతో యువకులు తీవ్రవాద కార్యకలాపాల పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు. మగవాళ్ళు ఖాళీ దొరికితే ఇప్ప సారా తాగుతూ గడిపేస్తారు. ఇక పొలాల్లోనో, తోటల్లోనో మహిళలు పని చేస్తే తప్ప రోజు గడవదు. అలాంటప్పుడు వారి ఆరోగ్యాల గురించీ, పిల్లల సంరక్షణ గురించీ పట్టించుకొనే సమయం ఎక్కడుంటుంది? వారి కోసం ఏదైనా చెయ్యాలనిపించింది.


ఆరు నెలలు పట్టింది!

ఒక రోజు జగదల్పూర్‌ సమీపంలోని కమనార్‌ గ్రామంలో వర్క్‌షాప్‌ నిర్వహించాను. పోషకాహారం గురించి చెబుతూ, గర్భిణులు ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారని అడిగాను. మొహ్వా (ఇప్ప) పూలతో చేసిన లడ్డూలను గర్భిణులకు ఇస్తూ ఉంటామని వారు చెప్పారు. అవి ఇళ్ళలో తయారు చేస్తారట. వాటి గురించి వినడం అదే మొదటిసారి. ఇది కూడా మత్తు పదార్థం లాంటిదేమో అనుకున్నాను. గిరిజన సంస్కృతిలో ఇప్ప చెట్టను ఆరాధిస్తారు. దాని నుంచి తీసే కల్లును ప్రసాదంగా తీసుకుంటారు. ఇప్ప పువ్వు గురించి మరిన్ని వివరాలు సేకరించాను. దానిలో మంచి పోషకాలు ఉంటాయనీ, హిమోగ్లోబిన్‌ను పెంచుతాయనీ తెలిసింది. గిరిజన మహిళలతో మొహ్వా లడ్డూలను తయారు చేయించి, తక్కువ ధరకు అందరికీ అందుబాటులోకి తెస్తే వారికి ఉపాధి కల్పించడంతో పాటు పోషకాలను కూడా అందించవచ్చన్న ఆలోచన వచ్చింది. అయితే వాళ్ళు తయారు చేసే లడ్లు నాలుగు రోజులకు మించి నిల్వ ఉండవు. అంతేకాదు, వాటిలో ఉపయోగించే ఇతర దినుసులు కూడా అంత నాణ్యమైనవి కావు. రుచి, వాసన కూడా మారిపోతూ ఉంటాయి. వాటిని ఎక్కువకాలం ఉండేలా, రుచిగా, సువాసనతో ఎలా తయారు చేయాలనేది సమస్య. ఆ లడ్డూలను ఫుడ్‌ ల్యాబరేటరీకి తీసుకువెళ్ళి, ప్రయోగాలు చేశాం. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నిక్‌ ద్వారా ఎలాంటి ప్రిజర్వేటివ్స్‌ వాడనక్కర్లేకుండా నాలుగు నెలల పాటు నిల్వ చేసే పద్ధతిని కనుక్కున్నాం. నిర్దిష్టమైన ఉష్ణోగ్రతలో, నాణ్యమైన నీటిని ఉపయోగించి ఇప్ప పువ్వును శుభ్రపరచడం ప్రధానమని తెలిసింది. అలాగే రుచి పెరగడం కోసం ఇప్ప పువ్వుల పొడికి నువ్వులు, శొంఠి, లవంగాలు, నెయ్యి, బెల్లం కలిపాం. ఒక నిర్దిష్టమైన ఉత్పత్తిగా మొహ్వా లడ్డూలను రూపొందించడానికి ఆరు నెలలు పట్టింది. 




ఒక బ్రాండ్‌గా... ఆకర్షణీయంగా...

ఉత్పత్తుల తయారీకీ, లైసెన్స్‌ తీసుకోవడానికీ, ప్యాకింగ్‌, మార్కెటింగ్‌ లాంటి అంశాలకూ పెట్టుబడి అవసరం. స్థానిక మహిళల స్వయం ఉపాధి కోసం సహాయం చెయ్యాలని ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగాను. ‘‘ఇది నీ పని కాదు. నువ్వు ఒక పరిశోధకురాలివి.  


నీ ఉద్యోగం నువ్వు చూసుకో!’’ అని కొందరు అధికారులు నా ప్రతిపాదనను తోసిపుచ్చారు. చివరకు పది మంది మహిళలతో కమనార్‌ గ్రామంలో 2017లో మొహ్వా లడ్డూల తయారీ యూనిట్‌ను నేనే ప్రారంభించాను. అదే ‘బస్తర్‌ ఫుడ్స్‌’. దీనికోసం మహిళలు ‘జై మా అంబే మహిళా స్వసహాయతా సముఖ్‌’ పేరిట సంఘంగా ఏర్పడ్డారు. ‘జై మా అంబే’ పేరుతో బ్రాండ్‌ను ప్రమోట్‌ చేశాం. మొదట్లో అమ్మకాలు పెద్దగా ఉండేవి కావు. మా ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించడానికి ఢిల్లీ, ఇతర ప్రధాన నగరాల్లోని ఉత్సవాల్లో, ఎగ్జిబిషన్లలో స్టాల్స్‌ ఏర్పాటు చేశాను. ప్యాకింగ్‌ ఆకర్షణీయంగా ఉండేలా జాగ్రత్త తీసుకున్నాను. క్రమంగా మా లడ్లకు ఆదరణ మొదలైంది. ఇప్పుడు తేనె, ఆర్గానిక్‌ బెల్లం, డ్రైఫ్రూట్స్‌ కలిపిన తేనె, మిక్స్‌డ్‌ డ్రై నట్స్‌, బెల్లం పొడి... ఇలా వివిధ ఉత్పత్తులు తయారు చేస్తున్నాం. వందమందికి పైగా మహిళలు వీటి ద్వారా ఉపాధి పొందుతున్నారు అలాగే ‘బస్తర్‌ ఫుడ్స్‌’ ద్వారా ప్యాకింగ్‌, బ్రాండింగ్‌, మార్కెటింగ్‌, లైసెన్సింగ్‌లో సహాయం, ఉత్పత్తుల్లో పోషకాల విశ్లేషణ లాంటి సేవలను కూడా అందిస్తున్నాం. అన్యాయంగా నక్సల్స్‌గా ముద్ర పడుతున్న యువత చెడు మార్గాల్లోకి వెళ్ళకుండా పని కల్పిస్తున్నాం. 


సిలికాన్‌ వ్యాలీలోనూ..

ఒకప్పుడు ‘కనీస అమ్మకాలు ఉంటాయా?’ అనే దశ నుంచీ డిమాండ్‌ను అందుకోలేని స్థాయికి మా ‘బస్తర్‌ ఫుడ్స్‌’ చేరుకుంది. ఆన్‌లైన్‌ ద్వారా ఢిల్లీ, హైదరాబాద్‌, ముంబాయ్‌, కోల్‌కతా, రాయపూర్‌ లాంటి నగరాల నుంచి ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయి. కిందటి ఏడాది కాలిఫోర్నియాలోని సిలికాన్‌ వ్యాలీలో నిర్వహించిన ‘టైకాన్‌ గ్లోబల్‌ కాన్ఫరెన్స్‌’ సందర్భంగా ఏర్పాటుచేసిన మా ప్రదర్శనకు మంచి స్పందన వచ్చింది.. ఢిల్లీలో నిర్వహించిన ఒక ప్రదర్శనలో మా ఉత్పత్తులను ప్రధానమంత్రి మోదీ, ఎందరో మంత్రులు మెచ్చుకున్నారు. అలాగే నీతి అయోగ్‌ ‘విమెన్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా- 2019’ పురస్కారాల కోసం ఎంపిక చేసిన 30 మంది ఫైనలిస్ట్స్‌లో నా పేరు ఉండటం ఎంతో సంతోషం కలిగించింది.


ప్రజల్లో ప్రకృతి సిద్ధమైన, ఆర్గానిక్‌ ఉత్పత్తులకు ప్రజల్లో ఆదరణ క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుత కరోనా కాలంలో అందరూ రోగనిరోధక శక్తిని పెంచే మంచి ఆహారం వైపు మళ్ళుతున్నారు. ‘కొవిడ్‌-19’ కారణంగా మా కార్యకలాపాలు కొంతకాలం స్తంభించినా, తిరిగి మామూలు స్థితికి చేరుకున్నాం. సరికొత్త సాంకేతికతతో డిమాండ్‌ను అందుకుంటామనీ, మరింతమంది మహిళలకు చేయూత ఇస్తామనీ నాకు నమ్మకం ఉంది.’’



Updated Date - 2020-08-31T05:30:00+05:30 IST