ఇంటికి పోదాం!

ABN , First Publish Date - 2020-05-01T08:41:09+05:30 IST

లాక్‌డౌన్‌ వల్ల ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులకు అన్ని రకాల వైద్యపరీక్షలు నిర్వహించి వారి స్వస్థలాలకు పంపిస్తున్నామని రోడ్లు, భవనాల శాఖ

ఇంటికి పోదాం!

  • వలస కూలీల తరలింపు ప్రారంభం
  • గుంటూరు నుంచి 11,554 మంది
  • కర్నూలు జిల్లా కూలీల తరలింపు
  • 12,602 మందిని రాష్ట్రానికి తెస్తాం
  • బయటి రాష్ట్రాల్లో చిక్కుకున్న వారు
  • 0866-2424680కు ఫోన్‌చేయాలి
  • ఏపీలో ఉన్న ఇతర రాష్ట్రాల వారు
  • 1092కు ఫోన్‌చేయాలి: కృష్ణబాబు
  • కూతంత ఓదార్పు
  • వలస కూలీల కోసం నాన్‌స్టాప్‌ రైళ్లు? 

అమరావతి, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ వల్ల ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులకు అన్ని రకాల వైద్యపరీక్షలు నిర్వహించి వారి స్వస్థలాలకు పంపిస్తున్నామని రోడ్లు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి, కరోనా సేవలపై ప్రధాన సమన్వయకర్త ఎంటీ కృష్ణబాబు తెలిపారు. ప్రభుత్వం సొంత ఖర్చుతో సర్కారీ బస్సుల్లో తొలుత రాష్ట్రీయంగా కార్మికుల తరలింపు చేపట్టినట్లు తెలిపారు. కర్నూలు జిల్లాకు చెందిన 11,554 మంది వలస కార్మికులను గుంటూరు నుంచి తరలించామన్నారు. గ్రీన్‌జోన్‌ నుంచి గ్రీన్‌జోన్‌కు మాత్రమే ఈ తరలింపు జరిగిందని తెలిపారు. ఇతర రాష్ట్రాల కార్మికుల తరలింపు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న మన రాష్ట్రవాసులను తీసుకొచ్చేందుకు అనుమతులు ఇవ్వాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశామన్నారు.


కీలక వెసులుబాట్లు ఇస్తూ సర్కారు జీవో 255 జారీ చేసిన నేపథ్యంలో, ఇప్పటిదాకా తీసుకున్న చర్యలను వివరించేందుకు గురువారం సమాచార, పౌరసంబంధాల కమిషనర్‌ విజయ్‌కుమార్‌రెడ్డితో కలిసి కృష్ణబాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రీయంగా, అంతర్రాష్ట్ర కార్మికులకు ముందుగా అన్ని రకాల వైద్యపరీక్షలు నిర్వహించి వారికి ఏ రోగ లక్షణాలు లేవని నిర్ధారించుకున్నాకే సొంత ప్రాంతాలకు పంపిస్తున్నామని స్పష్టంచేశారు. అనుమానాలు, అపోహలతో అలాంటివారిని అడ్డుకోవద్దని, గ్రామాల్లోకి రానివ్వాలని కోరారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇతర రాష్ట్రాల్లో 12,062మంది మనవాళ్లు చిక్కుకుపోయినట్లు సమాచారం ఉందన్నారు. ‘‘గుజరాత్‌లో 4వేల మంది మత్స్యకారులున్నారు. వారిని సురక్షితంగా తీసుకొస్తున్నాం.


మరో 8 వేలమంది ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లు లెక్క. వారిని తీసుకురావడానికి అనుమతి కోరుతూ ఆయా రాష్ట్రాల సీఎ్‌సలకు లేఖలు రాశాం. ఇంకా ప్రభుత్వం దృష్టికి రాకుండా ఎవరైనా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకొని ఉంటే, వారు తమ వివరాలను 0866 2424680 లేక 1902 కాల్‌సెంటర్‌కు  ఫోన్‌చేసి  నమోదు  చేసుకోవాలి’’ అని ఆయన చెప్పారు. గుంటూరులో 64,883మంది కార్మికులు ఉన్నారన్నారు. వీరిలో 42 వేలమంది కర్నూలు, ఇతర జిల్లాల వారు 9వేలమంది, ఇతర రాష్ట్రాల వారు 13వేల మంది ఉన్నారని తెలిపారు. కార్మికుల తరలింపులో తొలుత గ్రీన్‌జోన్‌లో ఉన్నవారికే  ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో పొగాకు సంబంధ పనిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన 1500మంది కార్మికులున్నారని, త్వరలో వారినీ సొంత ప్రాంతాలకు పంపిస్తామన్నారు. 


గ్రూపులకు ప్రాధాన్యం

కార్మికుల తరలింపునకు ఆయా ప్రాంతాలకు వెళ్లేవారిని గ్రూపులుగా ఎంపిక చేస్తున్నామని కృష్ణబాబు చెప్పారు. ‘‘ఒడిశా, చెన్నై, హైదరాబాద్‌ వెళ్లేవారిని గ్రూపులుగా విభజిస్తున్నాం. ప్రభుత్వం సొంత ఖర్చుతో వారిని బస్సుల్లో పంపిస్తోంది. తరలింపునకు ఎంపికచేసిన గ్రూపులో ఎవరికైనా పాజిటివ్‌ వస్తే ఆ గ్రూపు ప్రయాణాన్ని నిలిపివేస్తున్నాం. 14రోజుల పాటు క్వారంటైన్‌కు పంపిస్తాం. ఇప్పటిదాకా ఏ గ్రూపులోనూ కరోనా లక్షణాలు బయటపడలేదు’’ అని వివరించారు. రాష్ట్రంలోని 402 రిలీఫ్‌ క్యాంపుల్లో 20వేల మందికిపైగా వసతి కల్పిస్తున్నామని, వీరిలో 10వేల మంది మనవారు కాగా, మరో 10వేల మంది రాష్ట్రేతరులున్నారని తెలిపారు. 


1655 పరిశ్రమలు ప్రారంభం 

గ్రీన్‌జోన్ల పరిధిలో వ్యవసాయం, అగ్రో ప్రాసెసింగ్‌ రంగాల్లో 100 శాతం పనులు మొదలయ్యాయని కృష్ణబాబు చెప్పారు. మున్సిపాలిటీలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లోని పరిశ్రమలు పనిచేస్తున్నాయని వివరించారు. రాష్ట్రంలో 1655 పరిశ్రమలు తిరిగి పనిచేస్తున్నాయన్నారు. పరిశ్రమలు, ఆర్థిక సంస్థలకు ఉపయోగకరమైన కొరియర్‌ సర్వీసులకు అవకాశం కల్పించామని చెప్పారు. కృష్ణపట్నం పోర్టు రెడ్‌జోన్‌ మండలంలో ఉన్నప్పటికీ, అది అత్యవసర సేవల పరిధిలోకి వస్తుంది కాబట్టి పనిచేయడానికి అవకాశం కల్పించినట్లు చెప్పారు. నిత్యావసరాలు, గూడ్స్‌ వాహనాల రాకపోకలకు ఆటంకాలు లేవని, గత 15రోజుల్లో కాల్‌సెంటర్‌కు ఒక్క ఫిర్యాదు రాలేదని, లారీ ఓనర్ల అసోసియేషన్ల సంబంధంలో ఉన్నామని చెప్పారు. ఎక్కడా నిత్యావసరాల వాహనాలు నిలిచిపోలేదని, వాటికి కొరత లేదన్నారు. లాక్‌డౌన్‌ వల్ల కార్మికులు కొంతమేర ఇబ్బందిపడ్డ విషయం వాస్తవమేనన్నారు. 


సొంత వాహనాలకు అనుమతిలేదు

లాక్‌డౌన్‌ సందర్భంగా సొంత వాహనాల్లో ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలకు వెళ్లడానికి ఎలాంటి అనుమతి లేదని కృష్ణబాబు స్పష్టం చేశారు. సొంత వాహనంలో వెళ్లేందుకు రాష్ట్ర సర్కారు అవకాశం ఇచ్చినా, ఇతర రాష్ట్రాలు వారిని అనుమతిస్తుందన్న నమ్మకం తమకు లేదని చెప్పారు.

Updated Date - 2020-05-01T08:41:09+05:30 IST