భారతీయ నిపుణులకు గుడ్‌న్యూస్.. కీలక బిల్లుకు యూఎస్ సెనేట్ ఆమోదం

ABN , First Publish Date - 2020-12-04T13:03:03+05:30 IST

అమెరికాలో పనిచేస్తున్న భారతీయ వృత్తి నిపుణులకు శుభవార్త! హెచ్‌1బీ వర్క్‌ వీసాల మీద వెళ్లి గ్రీన్‌కార్డు లేదా శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న వారికి గొప్ప ఊరట! ఉద్యోగ ఆధారిత వలస వీసాలకు సంబంధించి దేశాల వారీగా ఉన్న కోటాను అమెరికా ప్రభుత్వం ఎత్తివేసింది.

భారతీయ నిపుణులకు గుడ్‌న్యూస్.. కీలక బిల్లుకు యూఎస్ సెనేట్ ఆమోదం

గ్రీన్‌కార్డులకు ‘దేశాల కోటా’ ఎత్తివేత!

బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన అమెరికా సెనేట్‌

వాషింగ్టన్‌, డిసెంబరు 3: అమెరికాలో పనిచేస్తున్న భారతీయ వృత్తి నిపుణులకు శుభవార్త! హెచ్‌1బీ వర్క్‌ వీసాల మీద వెళ్లి గ్రీన్‌కార్డు లేదా శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న వారికి గొప్ప ఊరట! ఉద్యోగ ఆధారిత వలస వీసాలకు సంబంధించి దేశాల వారీగా ఉన్న కోటాను అమెరికా ప్రభుత్వం ఎత్తివేసింది. ‘ఫెయిర్‌నెస్‌ ఫర్‌ హై స్కిల్డ్‌ ఇమిగ్రెంట్స్‌’ బిల్లును అమెరికా సెనేట్‌ బుధవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో హెచ్‌1బీ వర్క్‌ వీసాలతో అమెరికా వచ్చి శాశ్వత నివాసం లేదా గ్రీన్‌కార్డు కోసం దశాబ్దాల తరబడి ఎదురుచూస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు ఊరట లభించినట్లయింది. గత ఏడాది జూలైలో ప్రతినిధుల సభ ఆమోదించిన బిల్లుతో కుటుంబ ఆధారిత వలస వీసాలకు ఉన్న 7 శాతం పరిమితి.. ఆ ఏడాదికి 15 శాతానికి పెరిగింది. ఆ బిల్లును రిపబ్లికన్‌ సెనెటర్‌ మైక్‌ లీ ప్రతిపాదించారు.


తాజా చట్టంతో ఉద్యోగ ఆధారిత వలస వీసాలకు ఉన్న 7 శాతం పరిమితి తొలగిపోయినట్లయింది. ఫలితంగా గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది భారత ఐటీ నిపుణులకు మార్గం సుగమం కానుంది. అలాగే చైనా నుంచి వచ్చే వారికి వీసాలను తగ్గించే ప్రక్రియను కూడా కొత్త చట్టం ద్వారా తొలగించినట్లయింది. గ్రీన్‌కార్డు దరఖాస్తుల్లో అత్యధికం భారత్‌, చైనా వారివే ఉంటాయి. దేశాల వారీగా కోటా వల్ల భారతీయులు ఎక్కువగా నష్టపోయారు. 2019 ఆర్థిక సంవత్సరంలో మనవారికి ఈబీ1 విభాగంలో 9008, ఈబీ2లో 2908, ఈబీ3లో 5083 గ్రీన్‌కార్డులే లభించాయి. తాజా చట్టం వల్ల ఇతర దేశాలతో పోలిస్తే ప్రతిభ ఆధారంగా భారతీయులకు ఎక్కువ సంఖ్యలో గ్రీన్‌కార్డులు మంజూరు కానున్నాయి.  

Updated Date - 2020-12-04T13:03:03+05:30 IST