‘లార్డ్‌ ఆఫ్‌ లార్డ్స్‌’

ABN , First Publish Date - 2020-05-01T09:47:19+05:30 IST

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ వెంగ్‌సర్కార్‌ తన కెరీర్‌లో నాలుగు సార్లు ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లాడు. ఇందులో తొలి మూడు పర్యాయాలూ లార్డ్స్‌లో...

‘లార్డ్‌ ఆఫ్‌ లార్డ్స్‌’

విశ్వవ్యాప్తంగా ఎన్ని క్రికెట్‌ మైదానాలున్నా ఇంగ్లండ్‌లోని లార్డ్స్‌ స్టేడియానికున్న ప్రత్యేకతే వేరు. రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ మైదానంలో ఒక్కసారైనా ఆడాలనేది ప్రతీ క్రికెటర్‌ కల. ‘క్రికెట్‌ మక్కా’గా భావించే ఇక్కడ సెంచరీయే బాదేస్తే.. ఆ అనుభూతి మాటలకందనిది. అలాంటి చోట ఒకటి కాదు మూడు శతకాలు సాధించడంతో పాటు ఈ ఘనత వహించిన తొలి విదేశీ ఆటగాడిగా దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ నిలవడం భారత క్రికెట్‌కు గర్వకారణం..


భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ వెంగ్‌సర్కార్‌ తన కెరీర్‌లో నాలుగు సార్లు ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లాడు. ఇందులో తొలి మూడు పర్యాయాలూ లార్డ్స్‌లో శతకాలతో చెలరేగాడు. దీంతో అతడి పేరు రికార్డులకెక్కింది. ఎందుకంటే ఇంగ్లండ్‌ నుంచి కాకుండా మరో జట్టు క్రికెటర్‌ లార్డ్స్‌లో ఇన్ని సెంచరీలు చేసింది లేదు. అందుకే అతడిని ‘లార్డ్‌ ఆఫ్‌ లార్డ్స్‌’గానూ పిలుచుకుంటారు. అలాగే ఈ మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన టాప్‌-10 ఎలైట్‌ జాబితాలోనూ వెంగీకి చోటు దక్కింది. లార్డ్స్‌ మైదానం ఆతిథ్యమిచ్చిన వందో టెస్టుకు కూడా అతడిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. వెంగీ ఇక్కడ 1979, 1982, 1986లలో జరిగిన టెస్టుల్లో వరుసగా సెంచరీలు సాధించాడు. చివరిసారిగా 1990లో నాలుగో సారి లార్డ్స్‌లో బరిలోకి దిగినా ఈ ఫీట్‌ను రిపీట్‌ చేయలేకపోయాడు. ఈ టెస్టులో 52, 35 రన్స్‌మాత్రమే చేయగలిగాడు. ఓవరాల్‌గా ఈ మైదానంలో అతడు 72.57 సగటుతో 508 రన్స్‌ చేశాడు. లార్డ్స్‌లో శతకం బాదిన సెంచరీల ఇన్నింగ్స్‌ను పరిశీలిస్తే..


1979 (103)

లార్డ్స్‌లో వెంగ్‌సర్కార్‌ ఆడడం ఇదే తొలిసారి. అయితే మొదటి ఇన్నింగ్స్‌లో అతను డకౌట్‌ కాగా అటు భారత్‌ 96 పరుగులకే కుప్పకూలింది. ఈ స్థితిలో రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం జూలు విదిల్చాడు. 103 పరుగుల అతడి ఇన్నింగ్స్‌తో జట్టు ఓటమి నుంచి బయటపడి డ్రా చేసుకోగలిగింది. తన మూడు శతకాలలో ఇదే క్లిష్టమైనదిగా వెంగ్‌సర్కార్‌ చెబుతుంటాడు. ఎందుకంటే మైక్‌ హెండ్రిక్‌, జాన్‌ లేవర్‌, ఇయాన్‌ బోథమ్‌లతో కూడిన పేస్‌ లైన్‌పను ఎదుర్కొంటూ 353 నిమిషాలపాటు క్రీజులో ఉండి చేసిన సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గానూ నిలిచాడు.


1982 (157)

ఈసారి కూడా ఒత్తిడి పరిస్థితిల్లోనూ వెంగీ మరో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.  305 పరుగులు వెనకబడిన భారత్‌ ఫాలో ఆన్‌ ఆడేందుకు బరిలోకి దిగింది. ఆరు పరుగులకే మొదటి వికెట్‌ కోల్పోయినా వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చిన వెంగ్‌సర్కార్‌ తన ట్రేడ్‌మార్క్‌ డ్రైవ్స్‌తో పాటు పుల్‌, కట్‌ షాట్లతో 157 పరుగులు సాధించాడు. ప్రఖ్యాత పేసర్లు బాబ్‌ విల్లీస్‌, బోథమ్‌, ప్రింగిల్‌ ఇబ్బందిపెట్టినా జట్టుకు 369 పరుగుల గౌరవప్రదమైన స్కోరును అందించాడు. అయితే ఈ మ్యాచ్‌ను ఇంగ్లండ్‌ ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. 


1986 (126 నాటౌట్‌)

లార్డ్స్‌లో వెంగీ ఆడిన తొలి రెండు టెస్టులు డ్రా, ఓటమిగా ముగిసినా ఈసారి అతడి అజేయ ఆటతీరుతో భారత జట్టు ఇక్కడ తొలి గెలుపు అందుకుంది. వెంగ్‌సర్కార్‌ (126 నాటౌట్‌) అజేయ శతకంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 47 పరుగుల ఆధిక్యం సాధించింది. అయితే అతడు 95 పరుగుల వద్ద ఉన్నప్పుడు సెంచరీపై ఉత్కంఠ నెలకొన్నా చివరి బ్యాట్స్‌మన్‌ మణీందర్‌ సింగ్‌ను అండగా చేసుకుని మూడంకెల స్కోరు సాధించి చరిత్ర సృష్టించాడు.

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

Updated Date - 2020-05-01T09:47:19+05:30 IST