రోహిత్‌ ఊ.. అంటేనే బస్‌ కదిలేది

ABN , First Publish Date - 2020-05-01T09:43:19+05:30 IST

భారత క్రికెట్‌ జట్టులో భారీ షాట్లను బాదడంలో స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మది తిరుగులేని స్థానం. క్రీజులో కుదురుకున్నాడంటే బౌలర్లకు చుక్కలు...

రోహిత్‌ ఊ.. అంటేనే బస్‌ కదిలేది

విరాట్‌ కోహ్లీ

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టులో భారీ షాట్లను బాదడంలో స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మది తిరుగులేని స్థానం. క్రీజులో కుదురుకున్నాడంటే బౌలర్లకు చుక్కలు చూపించే ఈ ముంబైకర్‌ గురువారం 33వ పడిలోకి ప్రవేశించాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన రోహిత్‌... భార్య రితిక, కూతురు సమైరాతో కలిసి కేక్‌ కట్‌ చేశాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశించిన హిట్‌మ్యాన్‌కు క్రికెట్‌ ప్రపంచం శుభాకాంక్షలు తెలిపింది. 

అన్నీ మర్చిపోతాడట..: మైదానంలో బంతిని చితక బాదడం సంగతి ఎలా ఉన్నా.. రోహిత్‌ శర్మ మాత్రం తనకు సంబంధించిన వస్తువులను ఎప్పుడూ మర్చిపోతూ ఉంటాడట. ఈ జాబితాలో పర్స్‌, మొబైల్‌ కాకుండా ఒక్కోసారి పాస్‌పోర్ట్‌ సైతం ఉంటుందని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఓ సందర్భంలో తెలిపాడు. దీంతో టీమ్‌ బస్‌ కూడా ఆలస్యంగా కదలడం అనివార్యమై పోతుండేది. ఇలా తరచుగా జరుగుతుండడంతో.. రోహిత్‌కు సంబంధించిన వస్తువులన్నీ బస్‌లోనే ఉన్నాయా? అని జట్టు మేనేజర్‌ ప్రతిసారీ నిర్ధారించుకునే వాడని కోహ్లీ చెప్పాడు. అతడి అనుమతి తీసుకున్నాకే బస్‌ ముందుకు కదిలేదని, అయితే క్రికెట్‌ సరంజామాను మాత్రం రోహిత్‌ ఎప్పుడూ మర్చిపోడని గుర్తుచేశాడు. 

Updated Date - 2020-05-01T09:43:19+05:30 IST