ఎవరి ధీమా వారిదే

ABN , First Publish Date - 2020-12-04T07:39:49+05:30 IST

గ్రేటర్‌ పీఠంపై మరోసారి గులాబీ జెండా ఎగరేస్తాం! ఇది టీఆర్‌ఎస్‌ ధీమా! జీహెచ్‌ఎంసీపై ఈసారి కాషాయ జెండా ఎగరడం ఖాయం! ఇది బీజేపీ భరోసా! మేయర్‌ ఎవరైనా మేమే కీలకం!

ఎవరి ధీమా వారిదే

 మరో అనూహ్య ఫలితంపై బీజేపీ ఆశ

 అనూహ్యమా!? అధికారమా!?

జీహెచ్‌ఎంసీ ఫలితాలపై ఉత్కంఠ.. కారు.. కమలం.. ఎవరి ధీమా వారిదే

 మళ్లీ మేయర్‌ తమదేనంటున్న టీఆర్‌ఎస్‌

 మరో అనూహ్య ఫలితంపై బీజేపీ ఆశ

 కింగ్‌ మేకర్‌ హోదాపై మజ్లిస్‌ అంచనా

 కాంగ్రెస్‌ ఆశలన్నీ మల్కాజిగిరి ప్రాంతంపైనే

హైదరాబాద్‌, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ పీఠంపై మరోసారి గులాబీ జెండా ఎగరేస్తాం! ఇది టీఆర్‌ఎస్‌ ధీమా! జీహెచ్‌ఎంసీపై ఈసారి కాషాయ జెండా ఎగరడం ఖాయం! ఇది బీజేపీ భరోసా! మేయర్‌ ఎవరైనా మేమే కీలకం! ఇది మజ్లిస్‌ ధిలాసా! గెలుపుపై అన్ని పార్టీలూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ నేతలు ఓ అడుగు ముందుకేసి పోలింగ్‌ రోజే నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎదుట బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామని కమలం నేతలు చెబుతున్నారు.


భావోద్వేగాన్నే ప్రధాన అస్త్రంగా చేసుకుని ప్రచార హోరును సాగించిన బీజేపీ కూడా ఓటర్లు తమవైపే ఉన్నారన్న ధీమాను వ్యక్తం చేస్తోంది. దుబ్బాక తరహాలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ అనూహ్య ఫలితాలే వస్తాయన్న అంచనాతో ఆ పార్టీ ఉంది. 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో మాత్రమే గెలిచిన ఆ పార్టీకి ఈసారి పాతిక డివిజన్లకు అటు ఇటుగా వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి. గ్రేటర్‌లో ఆ పార్టీకి సంప్రదాయంగా ఉన్న బలానికి తోడు ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల్లో సాధించిన విజయం, గ్రేటర్‌ ప్రచారానికి పార్టీ అగ్ర నేతలంతా ఢిల్లీ నుంచి తరలి రావడంతో అధికార పార్టీకి బీజేపీనే గట్టి పోటీ ఇస్తుందన్న ప్రచారం వచ్చింది. దాంతో, సహజంగా ప్రభుత్వ వ్యతిరేకత కూడా బీజేపీకే కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. భావోద్వేగమే పనిచేస్తే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యమైన ఫలితాన్ని సాధించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.


అదే సమయంలో, ఈసారి సెంచరీ పక్కా అని టీఆర్‌ఎస్‌ ధీమా వ్యక్తం చేస్తోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం మంత్రులు, జిల్లాల ఎమ్మెల్యేలు, నామినేటెడ్‌ పోస్టుల్లో ఉన్న వారిని అధికార పక్షం మోహరించిన విషయం తెలిసిందే. డివిజన్ల వారీగా వారికి పోల్‌ మేనేజ్‌మెంట్‌ బాధ్యతలు అప్పగించింది. పోలింగ్‌ సరళి, ఓటరు మూడ్‌ తమకే అనుకూలమని భావిస్తోంది. దాదాపు 37 మంది ఎక్స్‌ అఫీషియో సభ్యుల బలంతో మేయర్‌ పీఠం తమదేనన్న స్పష్టమైన అంచనాకు టీఆర్‌ఎస్‌ ఇప్పటికే వచ్చింది. ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా టీఆర్‌ఎ్‌సకు అనుకూలంగానే వెలువడడాన్ని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.

అయితే, 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఏకంగా 99 డివిజన్లలో గెలుపు బావుటాను ఎగరేసిన టీఆర్‌ఎస్‌.. ఆ నంబర్‌ను నిలబెట్టుకునే అవకాశం లేదని ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి. దుబ్బాక ఓటమి భారంతో ఉన్న టీఆర్‌ఎ్‌సకు.. సీట్లు, ఓట్ల శాతమూ తగ్గితే భవిష్యత్తులో కొంత ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొనాల్సి రావచ్చునన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. 


ఇక, దుబ్బాక తరహాలోనే కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా వ్యహరించింది. ప్రచార ఆర్భాటాల కంటే క్షేత్రస్థాయిలో ఓటర్ల ఆదరణ కోసం ప్రయత్నాలు చేసింది. పార్టీ విజయానికి అవకాశమున్న డివిజన్లపై ఆ పార్టీ నేతలు ప్రత్యేక దృష్టి సారించారు. మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం పరిధిలో వీలైనన్ని డివిజన్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, ఎగ్జిట్‌ పోల్‌ సంస్థలన్నీ ఆ పార్టీకి నాలుగో స్థానాన్నే కట్టబెట్టడం గమనార్హం.

అయితే, 15 డివిజన్లకు అటు ఇటుగా గెలుస్తామన్న అంచనాలో కాంగ్రెస్‌ వర్గాలు ఉన్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోయిన కాంగ్రెస్‌ పార్టీకి.. జీహెచ్‌ఎంసీ పరీక్షలోనూ అదే పరిస్థితి ఎదురైతే ముందు ముందు గడ్డు పరిస్థితులనే ఎదుర్కొనాల్సి వస్తుందని పార్టీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.


కాగా, 2016 కంటే తక్కువ స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం.. గతం కంటే ఎక్కువ డివిజన్లలో గెలుస్తామని చెబుతోంది. పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే.. స్వతంత్ర అభ్యర్థులు గెలిచే అవకాశాలు తక్కువగా ఉండగా.. వారికి వచ్చే ఓట్లు ఎవరి గెలుపోటములపై ప్రభావం చూపుతాయన్నది కీలకంగా మారింది.


Updated Date - 2020-12-04T07:39:49+05:30 IST