CM Jagan: కడపలో నాలుగు గంటలు నరకం
ABN , First Publish Date - 2022-12-23T21:38:15+05:30 IST
సీఎం జగన్ (CM Jagan) నాలుగు గంటల కడప నగర పర్యటన జనానికి నరకం చూపించింది. సీఎం వెళ్లే మార్గాల్లో రహదారులను పోలీసులు దిగ్బంధం చేశారు.
కడప: సీఎం జగన్ (CM Jagan) నాలుగు గంటల కడప నగర పర్యటన జనానికి నరకం చూపించింది. సీఎం వెళ్లే మార్గాల్లో రహదారులను పోలీసులు దిగ్బంధం చేశారు. బారికేడ్లు వేసి అటు వాహనాల రాకపోకలు, ఇటు జనాల రాకపోకలు అడ్డుకున్నారు. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సంధ్యా సర్కిల్ వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారు. జగన్ శుక్రవారం గన్నవరం నుంచి బయలుదేరి 12.35గంటలకు కడప ఎయిర్‌పోర్టు (Kadapa Airport) చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన అమీన్‌పీర్ దర్గాను సందర్శించారు. పెద్ద దర్గాలో ప్రభుత్వ లాంఛనాలతో దర్గా మజార్ల వద్ద పూలఛాదర్ సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మత సామరస్యానికి ప్రతీక, మహిమాన్విత సూఫీగా వెలుగొందుతున్న అమీన్‌పీర్ దర్గాను సందర్శించడం తన అదృష్టం, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. అనంతరం పరిశ్రమల శాఖ సలహాదారు రాజోలి వీరారెడ్డి ఇంటికి వెళ్లి ఇటీవలే వివాహం జరిగిన ఆయన కుమారుడు, కోడలిని ఆశీర్వదించారు. అనంతరం ఏపీఎస్ ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ మల్లికార్జునరెడ్డి (Mallikarjuna Reddy) ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులతో మాట్లాడి వారి కూతురు, అల్లుడికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్‌ఖాన్ కుమారుడి వివాహనికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. 3 గంటల ప్రాంతంలో ఎయిర్‌పోర్టు చేరుకున్నారు. అంటే.. దాదాపు నాలుగు గంటల పాటు కడప నగరంలో సీఎం పర్యటన జరిగింది.
కడప ఎయిర్‌పోర్టు నుంచి ఇర్కాన్‌సర్కిల్, ఆలంఖాన్‌పల్లె, వినాయకసర్కిల్ మీదుగా పెద్ద దర్గా వరకు... తిరిగి వినాయకసర్కిల్ నుంచి బిల్టప్, ఐటీఐ, సంధ్యా సర్కిల్, కోటిరెడ్డిసర్కిల్, అంబేడ్కర్‌సర్కిల్, రైల్వేస్టేషన్ రోడ్డు మీదుగా పర్యటన సాగింది. తిరిగి మాధవీ కన్వెన్షన్ వరకు సీఎం పర్యటించారు. ఈ మార్గంలోని ప్రాంతాల్లో సుమారు రెండుగంటల పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు, జనాలు తిరగకుండా పోలీసులు బారికేడ్లు వేయడంతో పాటు వాహనాలు ఎక్కడపడితే అక్కడ నిలిపివేశారు. మధ్యాహ్నం సమయం కావడంతో ఎండకు జనం తీవ్ర అవస్థలు పడ్డారు. పెద్దదర్గా సమీపంలో ఒంటిగంట ప్రాంతంలో పెద్ద దర్గాకు వచ్చారు. శుక్రవారం కావడంతో పలువురు ముస్లింలు నమాజ్‌కు వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు. అలాగే గంటన్నర పాటు విద్యార్థులు బారికేడ్ల కారణంగా అక్కడే నిలబడ్డారు. ఇక వలంటీర్లు అయితే ఉదయం 9గంటలకే ఎయిర్‌పోర్టు నుంచి దారి పొడవునా సుమారు 5గంటల పాటు ఎండలో నిల్చున్నారు. ఇలా నాలుగు గంటల సీఎం టూరు ఇటు కడప వాసులను, అటు వలంటీర్లను తీవ్ర కష్టాలకు గురిచేసింది. సీఎంకు స్వాగతం పలికేందుకు డ్వాక్రా మహిళలను ఎద్ద ఎత్తున ఆ ప్రాంతానికి తీసుకువచ్చారు. సీఎం రాకముందే సుమారు గంటపై నుంచి ఆ ప్రాంతంలో నిలబెట్టారు. దీంతో వారు ఇబ్బందులు పడ్డారు. వచ్చిన వారందరి చేతుల్లో వైపీపీ జెండా రంగులున్న బెలూన్లు, థ్యాంక్యూ సీఎం అనే ప్లకార్డలు ఉండడం విశేషం.