Yogi Vemana పద్యంతోనే వైసీపీ సర్కార్‌కు పవన్ కౌంటర్

ABN , First Publish Date - 2022-11-10T14:35:49+05:30 IST

కడపలో యోగి వేమన యూనివర్సిటీలోని విగ్రహ తొలగింపుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. యోగి వేమన పద్యంతోనే ఆయన వైసీపీ ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు.

Yogi Vemana పద్యంతోనే వైసీపీ సర్కార్‌కు పవన్ కౌంటర్

అమరావతి : కడపలో యోగి వేమన యూనివర్సిటీలోని విగ్రహ తొలగింపుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. యోగి వేమన పద్యంతోనే ఆయన వైసీపీ ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు. విద్యలేనివాడు విద్వాంసుల దగ్గర ఉన్నంత మాత్రాన వాడు ఎప్పటికీ విద్వాంసుడు కాలేడంటూ యోగి వేమన చెప్పిన పద్యంతో ట్విటర్ వేదికగా ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చారు.

‘‘విద్యలేనివాడు విద్వాంసుచేరువ

నుండగానే పండితుండుగాడు

కొలని హంసలకదా గొక్కెర లున్నట్లు

విశ్వదాభిరామ! వినుర వేమ!

తాత్పర్యం: విద్యలేనివాడు విద్వాంసుల దగ్గర ఉన్నంత మాత్రాన వాడు ఎప్పటికీ విద్వాంసుడు కాలేడు. సరోవరంలోని రాజహంసల సమూహంలో కొంగ ఉన్నంత మాత్రాన అది రాజహంస అవదు కదా అని అర్థం’’ అని పవన్ ట్వీట్ చేశారు.

జీవిత తత్వాన్ని సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా చెప్పిన మహా కవి యోగి వేమన. అందుకే ఆయనను ప్రజా కవి అంటారు. ఆయన పేరుతో కడపలో యోగి వేమన యూనివర్శిటీని 2006లో వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నెలకొల్పారు. అంతే కాదు.. వేమన గొప్పతనాన్ని చాటేలా యూనివర్శిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనిని తొలగించి.. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని అక్కడి అధికారులు ఏర్పాటు చేశారు. దీనిపై ఏపీలో ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి.

Updated Date - 2022-11-10T18:02:39+05:30 IST