Amazon India: ప్లీజ్ వెళ్లిపోరూ.. ఉద్యోగులకు అమెజాన్ సెపరేషన్ ఆఫర్!

ABN , First Publish Date - 2022-11-17T16:47:04+05:30 IST

ప్రస్తుతం లే ఆఫ్‌ల కాలం నడుస్తోంది. ట్విట్టర్‌తో మొదలైన ఈ ట్రెండ్ ఆ తర్వాత మెటాకు, ఇతర సంస్థలకు పాకింది.

Amazon India: ప్లీజ్ వెళ్లిపోరూ.. ఉద్యోగులకు అమెజాన్ సెపరేషన్ ఆఫర్!
Amazon

న్యూఢిల్లీ: ప్రస్తుతం లే ఆఫ్‌ల కాలం నడుస్తోంది. ట్విట్టర్‌తో మొదలైన ఈ ట్రెండ్ ఆ తర్వాత మెటాకు, ఇతర సంస్థలకు పాకింది. ఇప్పుడు అమెజాన్ ఇండియా (Amazon India) వంతు వచ్చింది. సంస్థను స్వచ్ఛందంగా విడిచి వెళ్లిపోవాలని కోరుతూ బుధవారం ఉద్యోగులకు ‘వలంటరీ సెపరేషన్’ ఆఫర్ ప్రకటించింది. ఈ వలంటరీ సెపరేషన్ ప్రోగ్రాం (Voluntary Separation Programme)లో భాగంగా 22కు వారాలకు సమానమైన బేసిక్ వేతనాన్ని ఒకేసారి చెల్లిస్తారు. అంటే తమ సర్వీసులో ప్రతి ఆరు నెలలకు ఒక వారం చొప్పున గరిష్టంగా 20 వారాలకు బేస్ వేతనాన్ని చెల్లిస్తారు. ఈ మేరకు ఉద్యోగులకు నోటీసు అందిస్తారు. నోటీసు కాలపరిమితి ముగిసే వరకు ఉద్యోగంలో కొనసాగవచ్చు. లేదంటే తక్షణం కంపెనీ ఆఫర్ చేస్తున్న మొత్తాన్ని తీసుకుని సంస్థలను వదిలి వెళ్లిపోవచ్చు. ఏదో ఒకటి ఎంచుకునే స్వేచ్ఛను ఉద్యోగులకే వదిలేసింది.

ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్, టెక్నాలజీ విభాగాల్లో 10 వేల మంది ఉద్యోగలకు లే ఆఫ్ ఇవ్వాలని అమెజాన్ (Amazon) నిర్ణయించింది. ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం అమెజాన్ చరిత్రలోనే ఇది తొలిసారి. కరోనా మహమ్మారి తర్వాత ప్రజలు తిరిగి తమ షాపింగ్ అలవాట్లను పునరుద్ధరించుకుంటున్నప్పటికీ ఆర్థిక వృద్ధి ఇంకా మందగమనంలోనే ఉంది. అంతేకాదు, ఇది మరింత దిగజారి 2001 నాటి కనిష్ట స్థాయికి పడిపోయే అవకాశం ఉందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అమెజాన్ ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్థిరతగా ఉన్న నేపథ్యంలో కంపెనీలు ఉద్యోగులను నియమించుకోవడాన్ని ప్రస్తుతానికి నిలిపివేశాయి. మైక్రోసాప్ట్, మెటా, ట్విట్టర్, స్నాప్ ఇంక్ వంటివి ఉద్యోగులను తొలగించాయి. యాపిల్, ఆల్ఫాబెట్‌లు ఉద్యోగులను తీసుకోవడాన్ని ప్రస్తుతానికి నిలుపుదల చేశాయి.

మహమ్మారి నుంచి బయటకు వచ్చినప్పటికీ సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒడిదొడుకుల కారణంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ఉద్యోగులకు పంపిన మెమోలో అమెజాన్ పేర్కొంది. కాగా, అమెజాన్ ఇండియాలో దాదాపు లక్ష మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. అమెజాన్ వలంటరీ సెపరేషన్ ప్రోగ్రాం ఎల్ 1 (ఎంట్రీ లెవల్) నుంచి ఎల్ 7 (సీనియర్ లెవల్) వరకు ఉంది. సెపరేషన్ ప్రోగ్రాం ప్రస్తుతం అందుబాటులోనే ఉందని, దీనిని ఎంచుకోవాలనుకునే వారు ఏఈటీ ఆర్గనైజేషన్‌ను కలవాలని సూచించింది. నవంబరు 30వ తేదీ వరకు ఉద్యోగులు తమ దరఖాస్తులను అందించవచ్చని తెలిపింది. నిర్ణయం మార్చుకుని దరఖాస్తును వెనక్కి తీసుకోవాలనుకునే వారి కోసం డిసెంబరు 6 వరకు గడువు విధించింది. అదే నెల 23న వలంటరీ సెపరేషన్ ప్రోగ్రాంను ఎంచుకున్న వారి దరఖాస్తును ఆమోదిస్తుంది.

Updated Date - 2022-11-17T16:47:06+05:30 IST